పిస్టోరియస్ కావాలని చంపలేదు | Sakshi
Sakshi News home page

పిస్టోరియస్ కావాలని చంపలేదు

Published Fri, Sep 12 2014 1:32 AM

పిస్టోరియస్ కావాలని చంపలేదు - Sakshi

- ప్రిటోరియా హైకోర్టు తీర్పు  
- ప్రియురాలి హత్య కేసులో బ్లేడ్ రన్నర్‌కు ఊరట
ప్రిటోరియా: బ్లేడ్ రన్నర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్‌కు తన ప్రియురాలి హత్య కేసులో కాస్త ఉపశమనం లభించింది. ఉద్దేశపూర్వకంగానే అతడీ హత్య చేసినట్టు నిరూపితం కాలేదని అతడిపై ఉన్న హత్యానేరాన్ని ప్రిటోరియా హైకోర్టు జడ్జి తొకోజిలే మసిపా కొట్టివేశారు. అలాగే అత్యంత కఠిన శిక్ష పడే అభియోగాలను సైతం తోసిపుచ్చారు. సంఘటన జరిగిన రోజు తనో హత్య చేయబోతున్నట్టు అతడేమీ ఊహించలేదని తెలిపారు. ‘ఈ హత్య కేసు స్పష్టంగా నిరూపితం కాలేదు. పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగా తన ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్‌ను హత్య చేశాడని చెప్పేందుకు ఆధారాలు లేవు.

కచ్చితంగా ఆ రోజు ఇలా జరుగుతుందని పిస్టోరియస్ అనుకోలేదు. తలుపు వెనకాల ఉన్న వ్యక్తిని మాత్రమే తను చంపాడని భావించాడు. ఎందుకంటే ఆ సమయంలో తన ప్రియురాలు బెడ్ రూమ్‌లో ఉన్నట్టు అతడికి తెలుసు. కానీ ఆ సమయంలో తను చాలా ఆదరా బాదరాగా ప్రవర్తించాడు. విపరీతమైన శక్తిని ఉపయోగించాడు. ఓ విధంగా అతను నిర్లక్ష్యంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు వెలువడిన సమయంలో కోర్టు రూమ్‌లోనే ఉన్న పిస్టోరియస్ తల దించుకుని మౌనంగా రోదించాడు. అయితే ఓ వ్యక్తి మరణానికి కారణమైనందున తక్కువ తీవ్రత కలిగిన హోమిసైడ్ కేసు పిస్టోరియస్‌పై అలాగే ఉంది. ఈ కేసు విచారణ నేడు (శుక్రవారం) కొనసాగనుంది.
 
ఫిబ్రవరి 14, 2013న పిస్టోరియస్ ఇంట్లోని టాయిలెట్‌లో ఈ హత్య జరిగింది. ఎవరో ఆగంతకుడు ఇంట్లో చొరబడ్డాడనుకుని కాల్పులు జరిపినట్టు ఆది నుంచీ ఈ క్రీడాకారుడు వాదిస్తున్నాడు. అయితే తన ప్రియురాలితో గొడవ పడి కావాలనే చంపేసినట్టు ప్రాసిక్యూషన్ వాదించింది. కానీ ఆ జంట మధ్య గొడవ జరిగినట్టు ఆధారాలు లేవని జడ్జి తేల్చారు. మితిమీరిన మీడియా కవరేజి కూడా సాక్షులపై ప్రభావం చూపిందని చెప్పారు. ఘటన జరిగిన అనంతరం కొద్ది రోజులు జైల్లోనే ఉన్న ఈ 27 ఏళ్ల అథ్లెట్ తిరిగి బెయిల్‌పై విడుదలయ్యాడు.

Advertisement
Advertisement