అందువల్లే ఓడిపోయాం: కోహ్లి | Sakshi
Sakshi News home page

అందువల్లే ఓటమి చవిచూశాం: కోహ్లి

Published Fri, Sep 29 2017 11:31 AM

virat kohli

బెంగళూరు:ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో వన్డేలో భారత స్సిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో స్పందించాడు. భారత్ సాధించే ప్రతీ విజయంలో స్పిన్నర్లు రాణించాలనుకోవడం సరైనది కాదన్నాడు. అన్ని రోజులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయనుకోవడం పొరపాటు అవుతుందన్నాడు. అయితే పేసర్లు ఉమేశ్ యాదవ్, మొహ్మద్ షమీల బౌలింగ్ ను కోహ్లి ప్రత్యేకంగా కొనియాడాడు. వారిద్దరూ బౌలింగ్ బాగా చేశారంటూ కితాబిచ్చాడు.


'ఉమేశ్, షమీల బౌలింగ్ ఆకట్టుకుంది. ఆ ఇద్దరూ తమవంతు న్యాయం చేశారు. కాకపోతే ఎల్లప్పుడూ  స్పిన్నర్లు రాణించాలనుకోవడం కరెక్ట్ కాదు. అన్ని రోజులు స్పిన్నర్లదే కాదు.ఇక్కడ ఆసీస్ బ్యాటింగ్ చాలా బాగుంది. బ్యాట్ తో వారు ప్రణాళిక అమలు చేసిన విధానం చాలా చక్కగా ఉంది. మా వ్యూహాల్ని వారు వెనక్కినెట్టి పైచేయి సాధించారు. నిన్నటి మ్యాచ్ లో మేము మరీ చెత్తగా అయితే ఆడలేదు. కానీ ఆసీస్ మా కంటే మంచిగా ఆడింది' అని మ్యాచ్ అనంతరం కోహ్లి పేర్కొన్నాడు.

అయితే విజయానికి చేరువగా వచ్చి ఓడి పోవడంపై కూడా కోహ్లి స్పందించాడు. తమకు చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యం లభించినప్పటికీ ఆపై సరైన భాగస్వామ్యం నమోదు చేయడంలో విఫలమైనట్లు పేర్కొన్నాడు. తమకు ఓటమికి ప్రధాన కారణం ఓపెనింగ్ తరహా భాగస్వామ్యం మరొకటి రాకపోవడమేనని కోహ్లి అన్నాడు. అందువల్లే ఓటమిని చూడాల్సి వచ్చిందన్నాడు. తమ జట్టు ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయకపోవడం వల్లే పరాజయం చవిచూశామన్నాడు. ఓవరాల్ గా చూస్తే పేసర్ల ప్రదర్శన తమకు ఊరటనిచ్చే అంశమని ఒక ప్రశ్నకు సమాధానంగా కోహ్లి పేర్కొన్నాడు. ఇక పిచ్ విషయంలో తొలుత భయపడ్డప్పటికీ, ఆపై ఆడేటప్పుడు మాత్రం ఎటువంటి ఇబ్బంది అనిపించలేదన్నాడు. ఇది తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement