విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మిథాలీ | Sakshi
Sakshi News home page

విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మిథాలీ

Published Thu, Sep 7 2017 10:22 AM

విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మిథాలీ

కస్తూర్బా కాలేజీలో భారత కెప్టెన్‌కు ఘన సత్కారం  


సాక్షి, హైదరాబాద్: అమ్మాయిలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, దేశానికి పేరు తేవాలని భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సూచించింది. బుధవారం సికింద్రాబాద్‌ మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ మహిళా జూనియర్‌ కళాశాలలో ఆమెను ఘనంగా సత్కరించారు. 2000 సంవత్సరంలో ఆమె ఈ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివింది. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను మిథాలీ నెమరువేసుకుంది. ఉపాధ్యాయులు ఆమెకు జ్ఞాపికను బహూకరించారు. విద్యార్థినులతో ఉత్సాహంగా గడిపిన ఆమె పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

 

అనంతరం ఆమె మాట్లాడుతూ ‘ఈ కాలేజీలో చదువుకున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ప్రతి విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. చదువు ముఖ్యమే అయినా ఆసక్తి ఉన్న క్రీడలపై కూడా పట్టుసాధించాలి’ అని చెప్పింది. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఆమె బహుమతులు అందజేసింది. ఇకపై కళాశాల క్రీడల్లో రాణించేవారికి మిథాలీరాజ్‌ పేరుతో స్పోర్ట్స్‌ స్కాలర్‌షిప్‌లను అందజేస్తామని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమానికి ఉస్మానియా గ్రాడ్యుయేషన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరినాథరెడ్డి, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు సురేందర్‌ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. వీరితో పాటు కళాశాల చైర్మన్‌ ఎన్‌.వి.ఎన్‌.ఆచార్యులు, వైస్‌ చైర్మన్‌ చంద్రకళ, సెక్రటరీ హైదర్, కోశాధికారి అజయ్‌కుమార్, ప్రిన్సిపాల్‌ ప్రతిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

 

Advertisement

తప్పక చదవండి

Advertisement