‘కూల్’గా కొట్టేశారు | Sakshi
Sakshi News home page

‘కూల్’గా కొట్టేశారు

Published Wed, Jan 13 2016 12:20 AM

‘కూల్’గా కొట్టేశారు

ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో 310 పరుగులు ఛేదించడం అంత సులువు కాదు.
గతంలో రెండు సార్లు మాత్రమే ఇలా జరగ్గా...‘వాకా’ మైదానంలో ఏ జట్టుకూ అది సాధ్యం కాలేదు.
కానీ కెప్టెన్ స్మిత్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌కు మాజీ కెప్టెన్ బెయిలీ మెరుపులు జతకలవడంతో తొలి వన్డేలో కంగారూలు అలవోకగా దానిని చేసి చూపించారు.
కంగారూ జోడీ ప్రదర్శన ముందు రోహిత్ భారీ సెంచరీ, కోహ్లి మెరుపులు చిన్నబోవడంతో ప్రపంచకప్ సెమీస్‌కు కొనసాగింపుగానా అన్నట్లు అదే ఫలితం పునరావృతమైంది.

 
* తొలి వన్డేలో భారత్ ఓటమి
* 5 వికెట్లతో ఆసీస్ విజయం
* స్మిత్, బెయిలీ శతకాలు
* రోహిత్ సూపర్ సెంచరీ వృథా  
* రెండో వన్డే శుక్రవారం


పెర్త్: రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ, విరాట్ కోహ్లి కళాత్మక ఇన్నింగ్స్ ఒక వైపు... స్మిత్ దూకుడు, బెయిలీ సమయస్ఫూర్తి మరో వైపు... చివరకు ఆసీస్ ద్వయం బ్యాటింగ్ ముందు భారత స్టార్ల ప్రదర్శన సరిపోలేదు. ఫలితమే తొలి వన్డేలో భారత్ పరాజయం. ‘వాకా’లో పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (163 బంతుల్లో 171 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగగా...విరాట్ కోహ్లి (97 బంతుల్లో 91; 9 ఫోర్లు, 1 సిక్స్) శతకం చేజార్చుకున్నాడు.

వీరిద్దరు రెండో వికెట్‌కు 207 పరుగులు జోడించారు. అనంతరం ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ (135 బంతుల్లో 149; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), జార్జ్ బెయిలీ (120 బంతుల్లో 112; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో తమ జట్టును గెలిపించారు. ఈ జోడి మూడో వికెట్‌కు 242 పరుగులు జత చేయడం విశేషం. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం బ్రిస్బేన్‌లో జరుగుతుంది.
 
భారీ భాగస్వామ్యం
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు పేసర్లు స్కాట్ బోలాండ్, జోయల్ పారిస్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయగా...భారత్ బరీందర్ శరణ్‌కు తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చింది. హాజల్‌వుడ్ వేసిన ఏడో ఓవర్లో హుక్ షాట్ ఆడబోయి ధావన్ (9) లాంగ్ లెగ్‌లో క్యాచ్ ఇవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే రోహిత్, కోహ్లి కలిసి సమర్థంగా జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 52 పరుగులకు చేరింది.  

ఈ క్రమంలో రోహిత్ 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, బోలాండ్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో కోహ్లి కూడా 61 బంతుల్లో ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత పిచ్ కూడా నెమ్మదించడంతో వీరిద్దరు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరుగులు సాధించారు. కొద్ది సేపటికి పారిస్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా సింగిల్ తీసి కెరీర్‌లో 9వ సెంచరీ సాధించిన రోహిత్...ఆ తర్వాత బోలాండ్ వేసిన 40వ ఓవర్లో మూడు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. అయితే మరో వైపు లాంగాన్‌లో ఫించ్ చక్కటి క్యాచ్ పట్టడంతో కోహ్లి వెనుదిరిగాడు.

ధోని (13 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా...రోహిత్ చివరి వరకు తన సిక్సర్ల జోరును కొనసాగించాడు. ఆఖరి ఐదు ఓవర్లలో వరుసగా 6, 15, 16, 10, 14 పరుగులు చేసిన భారత్ 61 పరుగులు రాబట్టడం విశేషం. గతంలో వివ్ రిచర్డ్స్ (153 నాటౌట్) ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో చేసిన అత్యధిక పరుగుల రికార్డును రోహిత్ ఈ మ్యాచ్‌లో సవరించాడు.
 
‘డబుల్’ సెంచరీలు
లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. కొత్త కుర్రాడు బరీందర్ తన రెండో ఓవర్లోనే చక్కటి రిటర్న్ క్యాచ్‌తో ఫించ్ (8)ను అవుట్ చేసి కెరీర్‌లో తొలి వికెట్ సాధించాడు. అనంతరం బరీందర్ తన తర్వాతి ఓవర్లోనే వార్నర్ (5)ను కూడా పెవిలియన్ పంపడంతో భారత శిబిరంలో ఆనందం నెలకొంది. మరుసటి బంతికే బెయిలీ, కీపర్‌కు క్యాచ్ ఇచ్చినా అంపైర్ గుర్తించకపోవడంతో అతను బతికిపోయాడు. అంతే...ఆ తర్వాత స్మిత్, బెయిలీ భారత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. పరిస్థితికి తగినట్లుగా నెమ్మదిగా ఆడుతూనే, మధ్యలో దూకుడు కూడా ప్రదర్శిస్తూ జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నడిపించారు.

ధోని 12వ ఓవర్లోనే రోహిత్‌తో బౌలింగ్ వేయించి కాస్త భిన్నంగా ప్రయత్నించగా, ఆ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ముందుగా బెయిలీ 60 బంతుల్లో, ఆ తర్వాత స్మిత్ 55 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా భారత స్పిన్నర్లపై ఇద్దరు ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఎదురుదాడికి దిగారు. తన తొలి 4 ఓవర్లలోనే 30 పరుగులు ఇచ్చిన అశ్విన్ తన మరుసటి ఓవర్లో 18 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 2 సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. కోహ్లితో వేయించిన రెండు ఓవర్లు కూడా ఫలితమివ్వలేదు. 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి బెయిలీ అవుట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.

97 బంతుల్లోనే సెంచరీ సాధించిన స్మిత్...ఉమేశ్ వేసిన ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. మ్యాక్స్‌వెల్ (6)తో పాటు విజయానికి 2 పరుగులు చేయాల్సిన దశలో స్మిత్ వెనుదిరిగినా...నాలుగు బంతుల ముందే ఆసీస్ మ్యాచ్ ముగించింది. అశ్విన్, జడేజా కలిసి 18 ఓవర్లలో 129 పరుగులు ఇవ్వడం జట్టుపై ప్రభావం చూపించింది.
 
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 171; ధావన్ (సి) మార్ష్ (బి) హాజల్‌వుడ్ 9; కోహ్లి (సి) ఫించ్ (బి) ఫాల్క్‌నర్ 91; ధోని (సి) బోలాండ్ (బి) ఫాల్క్‌నర్ 18; జడేజా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 3 వికెట్లకు) 309.
వికెట్ల పతనం: 1-36; 2-243; 3-286.
బౌలింగ్: హాజల్‌వుడ్ 10-0-41-1; పారిస్ 8-0-53-0; మార్ష్ 9-0-53-0; బోలాండ్ 10-0-74-0; ఫాల్క్‌నర్ 10-0-60-2; మ్యాక్స్‌వెల్ 3-0-22-0.
 
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (సి) అండ్ (బి) శరణ్ 8; వార్నర్ (సి) కోహ్లి (బి) శరణ్ 5; స్మిత్ (సి) కోహ్లి (బి) శరణ్ 149; బెయిలీ (సి) భువనేశ్వర్ (బి) అశ్విన్ 112; మ్యాక్స్‌వెల్ (సి) ధావన్ (బి) అశ్విన్ 6; మార్ష్ (నాటౌట్) 12; ఫాల్క్‌నర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.2 ఓవర్లలో 5 వికెట్లకు) 310.
వికెట్ల పతనం: 1-9; 2-21; 3-263; 4-273; 5-308.
బౌలింగ్: శరణ్ 9.2-0-56-3; భువనేశ్వర్ 9-0-42-0; రోహిత్ 1-0-11-0; ఉమేశ్ 10-0-54-0; జడేజా 9-0-61-0; అశ్విన్ 9-0-68-2; కోహ్లి 2-0-13-0.
 
అది అవుటై ఉంటే...
సెంచరీతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెయిలీకి తొలి బంతికే అదృష్టం కలిసొచ్చింది. శరణ్ వేసిన బంతిని బెయిలీ లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. ధోని చక్కటి క్యాచ్ అందుకొని అప్పీల్ చేశాడు. అయితే ఇటీవలే ఐసీసీ బెస్ట్ అంపైర్ అవార్డుకు ఎంపికైన కెటిల్‌బరో దీనిని పట్టించుకోలేదు. దాంతో బెయిలీ నాటౌట్‌గా బయటపడ్డాడు.

టీవీ రీప్లేలో బంతి స్పష్టంగా బెయిలీ బ్యాట్‌కు తగిలినట్లు కనిపించింది. అప్పుడే ఈ వికెట్ పడి ఉంటే మ్యాచ్ ఫలితంపై అది ప్రభావం చూపించేదేమో! ‘డీఆర్‌ఎస్‌లో దీనిని చూసి ఉంటే అది ఎలా కనిపించేదో. అయినా డీఆర్‌ఎస్‌ను వద్దని చెబుతున్న జట్టు మాది కాదు కదా’...అంటూ మ్యాచ్ అనంతరం బెయిలీ ఒకింత వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
 
* ఒకే మ్యాచ్‌లో రెండు 200 పరుగుల భాగస్వామ్యాలు నమోదు కావడం ఇదే తొలిసారి.
* అరంగేట్రంలో కనీసం 3 వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్ శరణ్
 
‘కూర్పు’ కుదర్లేదు...
భారత జట్టు గత ఏడాది కూడా తమ మొదటి వన్డే ఆస్ట్రేలియాలో అదే జట్టుతో ఆడింది. అప్పుడు కూడా రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఈసారి కూడా సరిగ్గా అలాగే జరిగింది. అయితే ఈసారి రోహిత్ గతంకంటే ఇంకా మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒకరకంగా కెరీర్‌లో తాను చేసిన రెండు డబుల్ సెంచరీలకు సమానమైన ఇన్నింగ్స్ ఇది. ఆరంభంలో పేసర్లకు పిచ్ నుంచి సహకారం లభించినా... రోహిత్ ఏ మాత్రం తడబాటు లేకుండా ఓ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కోహ్లి కూడా తన క్లాస్ చూపించడంతో భారత్ 309 పరుగుల భారీ స్కోరు సాధించింది.
 
నిజానికి ఈ పిచ్‌పై టాస్ గెలిచిన కెప్టెన్ మామూలుగా అయితే బౌలింగ్ ఎంచుకుంటాడు. పిచ్ నుంచి తొలి గంట పేసర్లకు సహకారం లభించడం... మ్యాచ్ సాగే కొద్దీ బ్యాటింగ్ సులభమయ్యే పిచ్ కావడంతో ఈ నిర్ణయం ఊహించారు. కానీ ధోని ఆశ్చర్యకరంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తన బ్యాటింగ్ లైనప్‌పై ఉన్న నమ్మకం కావచ్చు... లేదా గతంలో లక్ష్య ఛేదనలో ఆసీస్‌లో విఫలమవడం కావచ్చు... కారణం ఏదైనా ధోని నిర్ణయం కాస్త ఆశ్చర్యపరిచేదే.
 
మరో బౌలర్ కావాలి
తొలి వన్డేకు భారత్ తుది జట్టు కూర్పు కూడా కాస్త ఆశ్చర్యాన్నే కలిగించింది. పిచ్ స్వభావం దృష్ట్యా ఆస్ట్రేలియా మొత్తం ఐదుగురు పేసర్లతో ఆడితే... భారత్ దీనికి భిన్నంగా ముగ్గురు సీమర్లతోనే సరిపెట్టింది. స్పిన్ మన బలం కాబట్టి ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నారని అనుకున్నా.... ఉమేశ్, బరిందర్ శరణ్‌లతో పాటు భువనేశ్వర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం సంచలన నిర్ణయమే. ఆసీస్ పిచ్‌లపై ప్రతిసారీ అద్భుతంగా బౌలింగ్ చేసే ఇషాంత్ శర్మను బెంచ్ మీద కూర్చోబెట్టారు.

నిజానికి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన జట్టులో భువనేశ్వర్  లేడు. షమీ గాయపడటంతో అనుకోకుండా అతనికి అవకాశం వచ్చింది. అంటే తొలుత ఎంపిక చేసిన జట్టులో ఉన్న ఇషాంత్... భువనేశ్వర్ కంటే మెరుగైన బౌలర్ అనే అర్థం. ఈ పిచ్‌పై బౌన్స్‌ను రాబట్టగల సత్తా ఉన్న ఇషాంత్‌ను ఆడించాల్సింది. తనకు ఉన్న పాత గాయం పెద్దది అవుతుందనే భయంతోనే ఇషాంత్‌ను ఆపినట్లు చెబుతున్నారు.
 
గుర్‌కీరత్‌ను కాదని మనీష్ పాండేను ఆడించడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించేదే. ప్రాక్టీస్ మ్యాచ్‌లో చేసిన అర్ధసెంచరీ వల్ల మనీష్ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టులోకి తీసుకుని ఉంటారు. అయితే ఐదుగురు బౌలర్లలో ఏ ఒక్కరు విఫలమైనా బ్యాకప్‌గా మరొకరు లేరనే సంగతి కూడా మరువకూడదు. గుర్‌కీరత్ మంచి బ్యాట్స్‌మన్. అవసరమైతే పది ఓవర్ల కోటా పూర్తి చేయగల స్పిన్ బౌలర్ కూడా. చాలాకాలంగా జట్టుతో పాటు తిరుగుతున్నా అవకాశం రావడం లేదు. తొలి వన్డేలో అతణ్ని ఆడించి ఉంటే బాగుండేది.
 
వారి సన్నాహకం బాగుంది

భారత్ కచ్చితంగా ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతున్నందున కచ్చితంగా 20 ఓవర్లు వారితో బౌలింగ్ చేయించాలి. ఈ పిచ్‌లపై స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపరు కాబట్టి... వారిపై ఎదురుదాడి చేయడం ఉత్తమం. ఆసీస్ అదే పని చేసింది. స్పిన్నర్ల బౌలింగ్‌లో ఏకంగా 150 పరుగులు రాబట్టి పని తేలిక చేసుకున్నారు. నిజానికి భారీ లక్ష్యం ఎదురైనప్పుడు ఏ జట్టయినా తడబడుతుంది. కానీ స్మిత్ రూపంలో ‘కూల్’ క్రికెటర్ ఉండటం వల్ల ఏ దశలోనూ కంగారూలు తడబడలేదు. దీనికి తోడు జట్టులో ఎనిమిదో నంబర్ ఆటగాడి వరకూ బ్యాటింగ్ చేయగల క్రికెటర్లు ఉండటం ఆ జట్టు తడబడకుండా ఆడటానికి ఓ కారణం.
 
సానుకూలాంశాలూ ఉన్నాయి

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ మంచి ఫామ్‌లో కనపడటం భారత్‌కు ఈ మ్యాచ్ ద్వారా లభించిన పెద్ద సానుకూలాంశం. ఇక కొత్త బౌలర్ బరిందర్ శరణ్ కూడా ఆకట్టుకున్నాడు. అరంగేట్రంలో ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమైన చోట... మన పేసర్ మూడు వికెట్లు సాధించాడు. తర్వాతి మ్యాచ్ జరిగే గబ్బా (బ్రిస్బేన్) మైదానంలో పిచ్ కూడా పెర్త్ తరహాలోనే ఉంటుంది. కాబట్టి  జట్టు కూర్పును పునఃసమీక్షించుకుంటే మేలు.     
- సాక్షి క్రీడావిభాగం

Advertisement
Advertisement