కెరీర్ కోసం కిడ్నీని వేలానికి పెట్టాడు.. | Sakshi
Sakshi News home page

కెరీర్ కోసం కిడ్నీని వేలానికి పెట్టాడు..

Published Tue, Jan 12 2016 3:14 PM

కెరీర్ కోసం కిడ్నీని వేలానికి పెట్టాడు..

బిజ్నూరు: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాడు. అంతర్జాతీయ వేదికలపై గెలిచి దేశానికి పలు పతకాలు అందించాడు. అయినా ఈ యువ క్రీడాకారుడిని ప్రోత్సహించేవారే కరువయ్యారు. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కెరీర్ కొనసాగించడానికి కిడ్నీని వేలానికి పెట్టాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన స్క్వాష్ క్రీడాకారుడు 20 ఏళ్ల రవి దీక్షిత్ దయనీయ పరిస్థితి ఇది.

జూనియర్ స్థాయి నుంచే గత పదేళ్లుగా రవి దీక్షిత్ ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010 ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించాడు. ఇంకా ఎన్నో పతకాలు సాధించాడు. అయినా అతణ్ని ఎవరూ ప్రోత్సహించలేదు. శిక్షణ కోసం, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అయ్యే ఖర్చులు భరించలేని పరిస్థితి. వచ్చే నెలలో జరిగే దక్షిణాసియా గేమ్స్లో పాల్గొనేందుకు తగినంత డబ్బు అందుబాటులో లేదు. స్క్వాష్ క్రీడపై మక్కువతో, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే పట్టుదలతో, కెరీర్ కొనసాగించిందుకు కిడ్నీని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు. ఆసక్తి గల వారు సంప్రదించాలని కోరాడు.

'దమ్పూర్ సుగర్ మిల్ నాకు సాయం చేస్తోంది. అయితే వాళ్లు ఎంతకాలమని సాయం చేస్తారు? గువహటిలో జరిగే దక్షిణాసియా గేమ్స్లో భారత్ తరపున ఆడాలి. ఈ టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు చెన్నైలో శిక్షణ పొందాలి. ఇందుకు తగినంత డబ్బు నా దగ్గర లేదు. ఇందుకోసం కిడ్నీ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నా. కావాల్సినవారు సంప్రదించండి. కిడ్నీ ధర 8 లక్షల రూపాయలు' అని ఫేస్బుక్లో రవి దీక్షిత్ పోస్ట్ చేశాడు. ఈ వార్త తెలియగానే అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రవి తండ్రి రామకైలాస్ దీక్షిత్ నాలుగో తరగతి ఉద్యోగి. ఆయన జీతంలో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. రవి సంపాదించిన డబ్బుతో తన కుమార్తెకు పెళ్లి చేశానని, అతనికి ఆర్థిక సాయం చేయలేని స్థితిలో ఉన్నానని, కిడ్నీ అమ్మాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా చెప్పానని రామకైలాస్ దీక్షిత్ చెప్పాడు.

రవి కిడ్నీ అమ్మకం వార్త విని పలువురు స్పందించారు. అతనికి ఎప్పుడూ అండగా ఉంటామని, తమను సంప్రదించాలని సుగర్ మిల్ యాజమాన్యం సూచించింది. యూపీ మంత్రి మూల్చంద్ చౌహాన్ స్పందిస్తూ.. ఈ విషయం విని షాకయ్యానని, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో చర్చించి రవికి సాయం చేస్తామని, త్వరలో అతని కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. యూపీ ప్రభుత్వం ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడం లేదని, రవి లాంటి క్రీడాకారులకు సాయం చేయడం బాధ్యతని దమ్పూర్ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ రాణా వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement