'నవ' చరిత్రకు 'ఏడు' కావాలి | Sakshi
Sakshi News home page

'నవ' చరిత్రకు 'ఏడు' కావాలి

Published Wed, Dec 6 2017 12:36 AM

Sri Lanka need 410 to win after India declare - Sakshi

టీమిండియా బౌలర్లు లంక తొలి ఇన్నింగ్స్‌ను ముగించారు. బ్యాట్స్‌మెన్‌ ప్రత్యర్థి ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. మళ్లీ ఆఖరి రోజు బౌలర్ల వంతు వచ్చేసింది. ఢిల్లీ టెస్టు గెలిచేందుకు... మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకునేందుకు ఇంకా 7 వికెట్ల దూరంలో ఉంది భారత్‌. పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా ఐదో రోజు మూడో సెషన్‌కు ముందే లంకను చుట్టేసినా ఆశ్చర్యం లేదు!  

న్యూఢిల్లీ: వరుసగా తొమ్మిదో టెస్టు సిరీస్‌ విజయానికి భారత్‌ మూడు (3 వికెట్లు) అడుగులు వేసింది. మూడో టెస్టులో ఇక ఒక రోజు ఆటే మిగిలుంది. 7 వికెట్లు అడ్డుగా ఉన్నాయి. కాలుష్యం కాటేయకపోతే... ఆటలో అంతరాయం లేకపోతే... ఆఖరి టెస్టును, 2–0తో సిరీస్‌ను... గెలుచుకునేందుకు బౌలర్లు చెమటోడ్చితే చాలు! సఫారీ పర్యటనకు టీమిండియా కొండంత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావొచ్చు. ఒకవేళ అనూహ్య పరిస్థితుల నడుమ ఈ మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసినా భారత్‌ 1–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. తద్వారా టెస్టు క్రికెట్‌ చరిత్రలో వరుసగా తొమ్మిది సిరీస్‌ విజయాలు సాధించిన ఆస్ట్రేలియా రికార్డును సమం చేసి ‘నవ’ చరిత్రను సృష్టిస్తుంది.  

మొదట 356/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 373 వద్ద ముగిసింది. కెప్టెన్‌ చండిమాల్‌ (361 బంతుల్లో 164; 21 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌ బెస్ట్‌ స్కోరు చేశాడు. ఇషాంత్‌ (3/98) బౌలింగ్‌లో చివరి వికెట్‌గా నిష్క్రమించాడు. తర్వాత భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 52.2 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ధావన్‌ (91 బంతుల్లో 67; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కోహ్లి (58 బంతుల్లో 50; 3 ఫోర్లు), రోహిత్‌ శర్మ (49 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు.  

వేగంగా... వన్డేలాగా..
భారత ఆటగాళ్లు ఒకే రోజు బంతితో, బ్యాట్‌తో ప్రతాపం చూపారు. ఆఖరి టెస్టులో ఆధిపత్యం చాటారు. తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌కు 4.7 రన్‌రేట్‌ చొప్పున పరుగులు చేసింది. లంచ్‌కు ముందే... 29 పరుగులకే విజయ్‌ (9), రహానే (10) వికెట్లను కోల్పోయినప్పటికీ మ్యాచ్‌లో మరింత పట్టుబిగించేందుకు ధావన్, పుజారా (66 బంతుల్లో 49; 5 ఫోర్లు) వేగం పెంచారు. మరో వికెట్‌ పడకుండా జట్టు స్కోరును 30వ ఓవర్లో 100 పరుగులు దాటించారు. అనంతరం కాసేపటికే పుజారాను డిసిల్వా అవుట్‌ చేశాడు. దీంతో క్రీజులో ధావన్‌కు జతయిన కెప్టెన్‌ కోహ్లి ధాటిగా ఆడాడు. అతని అండతో ధావన్‌ 83 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ధావన్‌ నిష్క్రమణ తర్వాత రోహిత్‌ శర్మ రావడంతో స్కోరు పుంజుకుంది. కోహ్లి, రోహిత్‌లు వన్డే తరహాలో పరుగులు చేశారు. కోహ్లి 55 బంతుల్లో 3 ఫోర్లతో అర్ధసెంచరీ చేసిన వెంటనే గమగే బౌలింగ్‌లో అవుటయ్యాడు. తర్వాత జడేజా క్రీజులోకి వచ్చాడు. రోహిత్‌ అర్ధ శతకం పూర్తికాగానే కెప్టెన్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని భారత్‌ లంకకు 410 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  

జడేజా 5-2-5-2
రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంకను జడేజా దెబ్బమీద దెబ్బ తీశాడు. తన ఐదు ఓవర్ల స్పెల్‌లో ఓపెనర్‌ కరుణరత్నే (13), నైట్‌ వాచ్‌మన్‌ లక్మల్‌ (0)లను పెవిలియన్‌ చేర్చాడు. అంతకుముందు షమీ వేసిన అద్భుత బౌన్సర్‌ను ఎదుర్కోలేక సమరవిక్రమ (5) గల్లీలో రహానేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. జడేజా విజృంభణకు శ్రీలంక ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  

►1 మూడు టెస్టుల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా, ఓవరాల్‌గా నాలుగో క్రికెటర్‌గా కోహ్లి (610 పరుగులు) గుర్తింపు పొందాడు. గూచ్‌ (ఇంగ్లండ్‌; 752 పరుగులు భారత్‌పై 1990లో), లారా (విండీస్‌; 688 పరుగులు శ్రీలంకపై 2001లో), మొహమ్మద్‌ యూసుఫ్‌ (పాకిస్తాన్‌; 665 పరుగులు విండీస్‌పై 2006లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

► 3 మూడు టెస్టుల సిరీస్‌లో ఐదు లేదా అంతకంటే తక్కువ ఇన్నింగ్స్‌ ఆడి 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో క్రికెటర్‌ కోహ్లి. బ్రాడ్‌మన్‌ (806 పరుగులు దక్షిణాఫ్రికాపై 1931లో), యూసుఫ్‌ ( 665 పరుగులు విండీస్‌పై 2006లో) మొదటి ఇద్దరు.  

►1ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌ కోహ్లి. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 243, రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు గావస్కర్‌ (289 పరుగులు; 107, 182 నాటౌట్‌ విండీస్‌పై 1978లో కోల్‌కతాలో) పేరిట ఉంది.

► 7 ఒకే టెస్టులో డబుల్‌ సెంచరీ, అర్ధ సెంచరీ చేసిన ఏడో కెప్టెన్‌ కోహ్లి. గతంలో గావస్కర్, గూచ్,  టేలర్‌ (ఆస్ట్రేలియా), ఫ్లెమింగ్‌ (న్యూజిలాండ్‌), గ్రేమ్‌ స్మిత్‌ (దక్షిణాఫ్రికా), పాంటింగ్‌ (ఆస్ట్రేలియా) ఈ ఘనత సాధించారు.

► 1 భారత్‌ తరఫున ఓ టెస్టు సిరీస్‌లో మూడుసార్లు 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి క్రికెటర్‌ కోహ్లి. 2014–2015 బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో 692 పరుగులు (నాలుగు టెస్టుల్లో), గతేడాది ఇంగ్లండ్‌పై 655 పరుగులు (ఐదు టెస్టుల్లో) చేశాడు. గావస్కర్, ద్రవిడ్‌ రెండుసార్లు ఇలా చేశారు.

► 3 క్రికెట్‌ క్యాలెండర్‌ ఇయర్‌లో అన్ని ఫార్మాట్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌ కోహ్లి. ఈ ఏడాది 46 మ్యాచ్‌ల్లో 2,818 పరుగులు చేశాడు. లంకతో వన్డేలు, టి20 లకు విశ్రాంతి తీసుకోవడంతో అతను ఈ ఏడాది చివరి మ్యాచ్‌ ఆడేశాడు. సంగక్కర (2014లో 48 మ్యాచ్‌ల్లో 2,868 పరుగులు), పాంటింగ్‌ (2005లో 46 మ్యాచ్‌ల్లో 2,833 పరుగులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

Advertisement
Advertisement