మైదానాలు పిలుస్తున్నాయి! | Sakshi
Sakshi News home page

మైదానాలు పిలుస్తున్నాయి!

Published Wed, Aug 3 2016 12:38 AM

మైదానాలు పిలుస్తున్నాయి! - Sakshi

పూర్తి స్థాయిలో 9 కొత్త  వేదికల నిర్మాణం... 5 తాత్కాలిక వేదికలు... చాన్నాళ్లుగా నగరంలో అందుబాటులో ఉన్న 18 వేదికల్లో ఎనిమిదింటికి కొత్తగా రంగు హంగులు... వెరసి మహా యజ్ఞంలాంటి ఒలింపిక్ పోటీలకు రియో డి జనీరో ముస్తాబయింది. నగరంలో మొత్తం 32 వేదికల్లో ఒలింపిక్స్ పోటీలు జరుగుతాయి. వీటికి తోడు దేశంలోని మరో ఐదు నగరాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రపంచ క్రీడా మహా సంబరానికి సాక్షిగా నిలుస్తున్న రియో ఒలింపిక్స్‌లో అన్ని వేదికలూ సిద్ధంగా ఉన్నాయి.


ఒలింపిక్స్ పోటీలు జరిగే రియో డి జనీరో నగరంలోని వేదికలను మొత్తం నాలుగు జోన్లుగా విభజించారు. రియో నగరం నలువైపులా విస్తరించిన బారా, డియోడొరో, కోపాకబానా, మర్కానా అనే నాలుగు ప్రాంతాలలో వేర్వేరు క్రీడలు నిర్వహిస్తారు. ఇతర నగరాలు బెలో హారిజంటే, బ్రసీలియా, మనాస్, సాల్వడార్, సావోపావ్లోలలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు మాత్రం జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం స్టేడియాల నిర్మాణానికి బ్రెజిల్ భారీగా ఖర్చు పెట్టింది. ఆయా వేదికలకు రవాణా సౌకర్యాలు కల్పించడం కోసం కూడా ప్రత్యేకంగా మెట్రో రైల్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఒక్క ఒలింపిక్ పార్క్ నిర్మాణం, ప్రజా రవాణా కోసం దాదాపు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం విశేషం. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న స్టేడియంలు, నిర్వహించే క్రీడలు, వాటి సామర్థ్యం, తదితర వివరాలు...

 

రియో సెంట్రో పెవిలియన్ 2, 3, 4, 6
వెయిట్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, బాక్సింగ్
నాలుగు వేదికల్లో కలిపి సామర్థ్యం 29 వేలు

 

ఒలింపిక్ స్టేడియం ఎన్‌గెన్‌హావో
అథ్లెటిక్స్‌కు ప్రధాన వేదిక, కొన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి.
స్టేడియం సామర్థ్యం 60 వేలు, తాత్కాలిక ఏర్పాట్లతో కెపాసిటీ పెంచారు.
రన్నింగ్ ట్రాక్‌ను పూర్తిగా కొత్తగా అత్యాధునికంగా తీర్చి దిద్దారు.

 

ఒలింపిక్ పార్క్
రియో ఒలింపిక్స్‌లో ఇదో కీలకమైన, అతి పెద్ద వేదిక. అన్నింటికంటే ఎక్కువగా ఒలింపిక్ పార్క్‌లో 9 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. వీటిలో ఏడు శాశ్వత నిర్మాణాలు. 1980ల్లో ఇదే ప్రాంతం బ్రెజిల్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఒలింపిక్స్ కోసం దీనిని బాగా అభివృద్ధి చేశారు. ఈ క్రీడలు ముగిసిన తర్వాత ఆరు వేదికలతో ఒలింపిక్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. మరో మూడింటిని కలిపి స్పోర్ట్స్ స్కూల్‌గా తీర్చి దిద్దనున్నారు.
కరియోకా ఎరీనా 1 (బాస్కెట్‌బాల్- సామర్థ్యం 16 వేలు)
ఎరీనా 2 (రెజ్లింగ్, జూడో- 10 వేలు)
ఎరీనా 3 (ఫెన్సింగ్, తైక్వాండో - 10 వేలు)
ఫ్యూచర్ ఎరీనా (హ్యాండ్ బాల్- 12 వేలు)
మారియా లెంక్ అక్వాటిక్స్ సెంటర్ (డైవింగ్, సింక్రనైజ్డ్ స్విమ్మింగ్, వాటర్ పోలో - 5 వేలు)
అక్వాటిక్స్ స్టేడియం (స్విమ్మింగ్ - 15 వేలు)
ఒలింపిక్ ఎరీనా (జిమ్నాస్టిక్స్ - 12 వేలు)
ఒలింపిక్ వెలోడ్రోమ్ (ట్రాక్ సైక్లింగ్ - 5 వేలు)


క్రీడా గ్రామంలో ‘ప్రపంచం’
పెద్దా, చిన్నా తేడా లేదు... స్టార్ ఆటగాడా, అనామకుడా అవసరం లేదు... అక్కడా అంతా సమానమే. గెలుపోటముల సంగతి తర్వాత... కొత్త స్నేహాలకు, వివిధ దేశాల మధ్య వారధికి అది సరైన వేదిక. మైదానంలో ప్రత్యర్థులుగా తలపడే వారు కూడా ఇక్కడికి చేరగానే ఆత్మీయులుగా మారిపోవచ్చు. రెండు వారాల పాటు సాగే సమరంలో ప్రపంచ క్రీడాకారులంతా ఒక్కటిగా భావన కల్పించే చోటే ఒలింపిక్ గేమ్స్ విలేజ్. ఇందులో ఆటగాళ్లతో పాటు కోచ్‌లు, అధికారులు మాత్రమే ఉంటారు. బయటివారిని క్రీడా గ్రామంలోకి అనుమతించరు. సాధారణంగా క్రీడల ప్రధాన కేంద్రం (ఈ సారి ఒలింపిక్ పార్క్)కు సమీపంలోనే దీనిని నిర్మిస్తారు.

మొత్తం భవంతులు 31  3,064 ఫ్లాట్‌లు
17,950 మంది అథ్లెట్లు, అధికారులకు ఆతిథ్యం
మొత్తం 18 వేల మంది నిర్మాణంలో పని చేశారు.
మొత్తం ఖర్చు దాదాపు రూ. 6 వేల కోట్లు

విలేజ్‌లో ఉండే అథ్లెట్లలో 43 శాతం మంది 10 నిమిషాల్లోనే పోటీలు, ప్రాక్టీస్ వేదికలకు చేరుకోగలరు. మిగతా వారు గరిష్టంగా 25 నిమిషాల్లో అక్కడ ఉంటారు.

 

మరకానా స్టేడియం
పోటీల ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలు
ఫుట్‌బాల్ రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు, ఫైనల్
1900 తర్వాత అథ్లెటిక్స్ మైదానంలో కాకుండా మరో స్టేడియంలో ఆరంభ, ముగింపు వేడుకలు

 
నిర్వహించడం ఇదే తొలిసారి.

స్టేడియం సామర్థ్యం దాదాపు 74 వేలు


సాంబోడ్రోమో
ఆర్చరీ, మారథాన్ జరుగుతాయి చాలా ఏళ్లుగా సాంప్రదాయ సాంబా నృత్య కార్యక్రమాలకు ఇది వేదిక. ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.  సామర్థ్యం 36 వేలు


ఒలింపిక్ బీఎంఎక్స్ సెంటర్
బీఎంఎక్స్ సైక్లింగ్ పోటీల కోసం నిర్మించిన శాశ్వత వేదిక. 400 మీటర్ల పొడవు, 4000 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న ఈ వేదికలో సైక్లిస్టుల కోసం ప్రమాదకర మలుపులు సిద్ధంగా ఉన్నాయి.


సామర్థ్యం 6 వేలు
ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన స్టేడియాలతో పాటు గతంలో ఎప్పటి నుంచో ఉన్న కొన్ని క్రీడల వేదికలను ఆధునీకరించారు. హాకీ, బీచ్ వాలీబాల్, గోల్ఫ్‌కోర్స్, షూటింగ్, ఈక్వెస్ట్రియన్, సెయిలింగ్, రోయింగ్ తదితర క్రీడలు వీటిల్లో జరుగుతాయి.

 

Advertisement
Advertisement