భారత్ తడాఖా... | Sakshi
Sakshi News home page

భారత్ తడాఖా...

Published Sat, Apr 16 2016 12:52 AM

భారత్ తడాఖా...

మలేసియాపై 6-1తో గెలుపు
అజ్లాన్ షా కప్‌లో ఫైనల్‌కి చేరిక
నేడు ఆస్ట్రేలియాతో టైటిల్ పోరు

 ఇపో (మలేసియా): తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత హాకీ జట్టు తమ తడాఖా చూపించింది. ఆతిథ్య మలేసియా జట్టును హడలెత్తించింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన టీమిండియా 6-1 గోల్స్ తేడాతో మలేసియా జట్టును చిత్తుగా ఓడించింది. తద్వారా సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఆరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున నికిన్ తిమ్మయ్య (3వ నిమిషంలో), హర్జీత్ సింగ్ (7వ ని.లో), డానిష్ ముజ్తబా (27వ ని.లో), తల్విందర్ సింగ్ (50వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... రమణ్‌దీప్ సింగ్ (25వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. మలేసియా జట్టుకు షారిల్ సబా (46వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. శుక్రవారం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 3-0తో కెనడాపై, పాకిస్తాన్ 4-1తో జపాన్‌పై గెలిచాయి. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆస్ట్రేలియా ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 18 పాయిం ట్లతో అగ్రస్థానంలో నిలువగా... 12 పాయింట్ల తో భారత్ రెండో స్థానాన్ని సంపాదించింది.

 లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచినందుకు శనివారం జరిగే టైటిల్ పోరులో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. 3-4 స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో మలేసియాతో న్యూజిలాండ్; 5-6 స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో కెనడాతో పాకిస్తాన్ తలపడతాయి. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన జపాన్ చివరిదైన ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 33 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్ ఐదుసార్లు విజేతగా నిలువగా.. ఒకసారి రన్నరప్‌గా, ఆరుసార్లు మూడో స్థానంలో నిలిచింది. 2010 తర్వాత టీమిండియా ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.

 ఫైనల్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ సమష్టిగా ఆడి సత్తా చాటుకుంది. గతేడాది మలేసియా చేతిలో కీలక మ్యాచ్‌లో ఓడిపోయి ఫైనల్ అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా ఈసారి ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మూడో నిమిషంలోనే తిమ్మయ్య గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. నాలుగు నిమిషాలు గడిచాక హర్జీత్ సింగ్ రివర్స్ షాట్‌తో భారత్‌కు రెండో గోల్‌ను అందించాడు. రెండో క్వార్టర్‌లోనూ భారత ఆటగాళ్లు చురుకైన కదలికలతో అవకాశం దొరికినపుడల్లా మలేసియా రక్షణ వలయంలోకి దూసుకెళ్లారు. ఫలితంగా రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించారు. మూడో క్వార్టర్‌లో మరో గోల్‌ను చేసిన సర్దార్ సింగ్ బృందం, చివరి క్వార్టర్‌లోనూ మరో గోల్ చేసింది. రెండు గోల్స్ సాధించిన రమణ్‌దీప్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది.

 సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement