వాటికి ఇక ప్రతి మ్యాచ్‌ సెమీసే!  | Sakshi
Sakshi News home page

వాటికి ఇక ప్రతి మ్యాచ్‌ సెమీసే! 

Published Tue, May 1 2018 12:54 AM

sunil gavaskar match analysis - Sakshi

పాయింట్ల పట్టికలో కింది స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నేడు చిన్నస్వామి మైదానంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు ఐపీఎల్‌–11 ప్రయాణం దాదాపు ముగిసినట్లే. రెండింటిలోనూ పేరుగాంచిన స్టార్లున్నారు. అయినా బ్యాటింగ్, బౌలింగ్‌లో నిలకడ కొరవడింది. అత్యాధునిక క్రికెట్‌లో తేడా చూపేది ఇవే. ఫీల్డింగ్‌ ప్రమాణాలూ అత్యంత సాధారణంగా ఉన్నాయి. కీలక సమయంలో క్యాచ్‌లు జారవిడవడంతో లైఫ్‌లు పొందిన ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ మ్యాచ్‌ను తారుమారు చేసే స్కోర్లు సాధించారు. టాప్‌–4లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ ఉన్న బెంగళూరు సీజన్‌లో ఒక్కసారే 200పైగా స్కోరు చేయగలిగింది. నేటి  కీలక మ్యాచ్‌కు విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఫిట్‌నెస్‌ సాధించాలని జట్టు కోరుకుంటోంది. మెకల్లమ్, డికాక్‌ ప్రమాదకర జోడీనే అయినా కోల్‌కతాపై మాత్రమే అర్ధ శతక భాగస్వామ్యం నమోదు చేయగలిగారు. ఇప్పటివరకు ప్రభావవంత ఇన్నింగ్స్‌ ఆడని వీరు జట్టుకు భారీ స్కోరూ అందించలేకపోయారు.

ఇంతకుముందటి మ్యాచ్‌లో ముంబైపై వారి సొంతగడ్డ మీద అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి కోల్‌కతాపైనా అదే స్థాయి ప్రదర్శన కనబర్చాడు. ఈ బెంగళూరు కెప్టెన్‌ మళ్లీ చెలరేగుతాడని ముంబై ఆందోళనలో ఉండొచ్చు. ఇక్కడ ముఖ్య విషయమేమంటే బెంగళూరుకు మంచి ఫినిషర్‌ లేడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అవుటైతే ఆ జట్టు కథ ముగిసినట్లే. మ్యాచ్‌ ఏ దశలోనూ పదును చూపని బౌలింగ్‌ విభాగం కోహ్లి పనిని కష్టతరం చేస్తోంది. ముంబైకి కూడా ఇదే సమస్య ఉన్నా బుమ్రా చెన్నైపై అద్భుతంగా బంతులేశాడు. ప్రారంభంలో ఆకట్టుకున్న మార్కండే లయ తప్పినట్లు కనిపిస్తున్నాడు. ముస్తఫిజుర్‌ ఆకట్టుకోలేకపోతున్నాడు.   రోహిత్‌ శర్మ రాణిస్తే ముంబై స్కోరుకు ఢోకా ఉండదు. అతడు మూడో స్థానంలో దిగడం మంచిదే అయినా ప్రతిభావంతుడైన యువ ఇషాన్‌ కిషన్‌ కంటే ముందు రావడం కొంత అనాలోచితంగా కనిపిస్తోంది. ముంబై గెలిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. సూర్యకుమార్‌ చక్కగా ఆడుతుండగా, సహచర వెస్టిండియన్లు క్రిస్‌ గేల్, రసెల్‌లాగే ఎవిన్‌ లూయీస్‌ భీకర హిట్టర్‌. ఏదేమైనా రెండు జట్లకు ఇక ప్రతి మ్యాచ్‌ సెమీ ఫైనలే. సీజన్‌పై ఆశావహంగా ఉండాలంటే తప్పకుండా విజయాలు సాధించాల్సిందే.  

Advertisement

తప్పక చదవండి

Advertisement