‘సన్’ ఎరుపెక్కింది... | Sakshi
Sakshi News home page

‘సన్’ ఎరుపెక్కింది...

Published Sun, May 1 2016 1:15 AM

‘సన్’ ఎరుపెక్కింది...

బెంగళూరుపై ఘన విజయం 
15 పరుగులతో నెగ్గిన హైదరాబాద్  
వార్నర్ మరో అర్ధ సెంచరీ

 
సన్‌రైజర్స్ సొంతగడ్డపై మళ్లీ చెలరేగింది... ఎప్పటిలా బౌలింగ్‌తో కాకుండా ఈ సారి బ్యాటింగ్‌తో సత్తా చాటింది. భారీ స్కోరు చేస్తే విజయాన్ని ఎంతటి జట్టయినా ఆపలేదని నిరూపించింది. వార్నర్ మెరుపు షాట్లతో ముందుండి నడిపించగా, విలియమ్సన్ అండగా నిలిచాడు. దాంతో సీజన్ తొలి మ్యాచ్‌లో ఓటమికి బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకుంది.

 
 ముందుగా పేలవ బౌలింగ్‌తో పరుగులిచ్చుకున్న బెంగళూరు ఆపై బ్యాటింగ్‌లో విఫలమైంది. రాహుల్ ఓపెనింగ్‌తో పాటు డివిలియర్స్ కొద్దిగా ఆశలు రేపినా, కోహ్లి వైఫల్యం, గేల్ లేకపోవడం జట్టును దెబ్బ తీశాయి. ఫలితంగా టాస్ గెలిచి ఛేదనకు మొగ్గు చూపిన ఆర్‌సీబీ ఈ సీజన్‌లో జరుగుతున్నట్లుగా గెలుపు సాంప్రదాయాన్ని కొనసాగించలేకపోయింది.

 
 
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 15 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (50 బంతుల్లో 92; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకం కోల్పోగా, విలియమ్సన్ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు) సహకరించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. లోకేశ్ రాహుల్ (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్ (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.
 

గేల్‌కూ చోటు లేదు: హైదరాబాద్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగగా, బెంగళూరు ఏకంగా నలుగురు ఆటగాళ్లను మార్చింది. గేల్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బహుశా కోహ్లి తమ బలహీన బౌలింగ్‌ను కాస్త పటిష్టంగా మార్చాలని ఆలోచించినట్లున్నాడు. అందుకే రిచర్డ్సన్, షమ్సీలలో ఎవరినీ తప్పించలేదు.

మెరుపు భాగస్వామ్యం: గత రెండు మ్యాచ్‌లలో ఆకట్టుకున్న ధావన్ (11) ఈసారి ప్రభావం చూపకుండానే వెనుదిరిగాడు. అయితే వార్నర్, విలియమ్సన్ కలిసి రైజర్స్ స్కోరును పరుగులు పెట్టించారు. వార్నర్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించగా, సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న విలియమ్సన్ కూడా తన కళాత్మక బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. హర్షల్ వేసిన ఆరో ఓవర్లో వార్నర్ రెండు ఫోర్లు, 1 సిక్స్ బాదగా 16 పరుగులు వచ్చాయి. పది ఓవర్లు ముగిసే సరికి సన్ స్కోరు 82 పరుగులకు చేరింది. ఆర్‌సీబీ బౌలర్లు ఎంతగా శ్రమించినా వీరిద్దరి దూకుడును ఆపలేకపోయారు.

ఈ క్రమంలో 32 బంతుల్లోనే వార్నర్ సీజన్‌లో ఐదో అర్ధ సెంచరీ నమోదు చేయడం విశేషం. రిచర్డ్సన్ వేసిన 15వ ఓవర్లో రైజర్స్ అత్యధికంగా 19 పరుగులు రాబట్టింది. ముఖ్యంగా 12-16 మధ్య ఐదు ఓవర్లలోనే 66 పరుగులు కొల్లగొట్టడం విశేషం. ఎనిమిది పరుగుల తేడాతో వార్నర్, విలియమ్సన్‌వెనుదిరిగినా, హెన్రిక్స్ (14 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఆఖరి ఓవర్లో వాట్సన్ 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో సన్ స్కోరు 200 పరుగులు చేరలేకపోయింది.


రాహుల్ దూకుడు: ఒక వైపు క్రీజ్‌లో కోహ్లి ఉన్నా, మరో వైపు లోకేశ్ రాహుల్ జోరు కొనసాగింది. గుజరాత్‌తో గత మ్యాచ్‌లో చెలరేగిన తరహాలోనే ఈ సారి ఓపెనర్‌గా రాహుల్ తన ధాటిని ప్రదర్శించాడు. వరుసగా బౌండరీలతో చెలరేగడంతో తొలి 4 ఓవర్లలో బెంగళూరు 37 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్లో ముస్తఫిజుర్ రెండో బంతికే కోహ్లి (17 బంతుల్లో 14; 1 ఫోర్)ని అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. బరీందర్ వేసిన ఓవర్లో  మరో సిక్స్, ఫోర్ కొట్టిన రాహుల్ ... 26 బంతుల్లోనే వరుసగా రెండో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ వెంటనే హెన్రిక్స్ చక్కటి బంతితో అతడిని అవుట్ చేయడంతో బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం లేని రెండో పరుగుకు ప్రయత్నించి బరీందర్ డెరైక్ట్ త్రోకు వాట్సన్ (2) వెనుదిరిగాడు.

అయితే మరో వైపు నిలదొక్కున్న తర్వాత డివిలియర్స్ తనదైన శైలిలో ఆడాడు. హెన్రిక్స్ వేసిన 14వ ఓవర్లో ఏబీ వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టగా, ఓవర్లో మొత్తం 19 పరుగులు లభించాయి. అయితే ఈ దూకుడుకు బరీందర్ అడ్డుకట్ట వేయడంతో సన్ ఊపిరి పీల్చుకుంది. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి డివిలియర్స్ లాంగాన్‌లో విలియమ్సన్‌కు చిక్కాడు. ఆ తర్వాత సచిన్ బేబీ, కేదార్ జాదవ్ పోరాడినా గెలిచేందుకు అది సరిపోలేదు.
 
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) డివిలియర్స్ (బి) షమ్సీ 92; ధావన్ (సి) అండ్ (బి) రిచర్డ్సన్ 11; విలియమ్సన్ (సి) రాహుల్ (బి) వాట్సన్ 50; హెన్రిక్స్ (నాటౌట్) 31; నమన్ ఓజా (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్సన్ 1; హుడా (రనౌట్) 2; ఆశిష్ రెడ్డి (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 194.

వికెట్ల పతనం: 1-28; 2-152; 3-160; 4-161; 5-190.
బౌలింగ్: రిచర్డ్సన్ 4-0-45-2; వాట్సన్ 4-0-33-1; రసూల్ 4-0-33-0; ఆరోన్ 3-0-27-0; హర్షల్ 1-0-16-0; షమ్సీ 4-0-39-1.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఆశిష్ రెడ్డి (బి) ముస్తఫిజుర్ 14; లోకేశ్ రాహుల్ (సి) నమన్ ఓజా (బి) హెన్రిక్స్ 51; ఏబీ డివిలియర్స్ (సి) విలియమ్సన్ (బి) శరణ్ 47; వాట్సన్ (రనౌట్) 2; సచిన్ బేబీ (సి) శిఖర్ ధావన్ (బి) నెహ్రా 27; కేదార్ జాదవ్ (నాటౌట్) 25; రసూల్ (సి) హెన్రిక్స్ (బి) భువనేశ్వర్ 10; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 179

వికెట్ల పతనం: 1-42, 2-83, 3-90, 4-129, 5-152, 6-179.
బౌలింగ్: ఆశిష్ నెహ్రా 4-0-32-1, భువనేశ్వర్ 4-0-36-1, ముస్తఫిజుర్ 4-0-34-1, శరణ్ 4-0-36-1, హెన్రిక్స్ 4-0-40-1.

Advertisement
Advertisement