అంబటి రాయుడిపై సస్పెన్షన్‌ | Sakshi
Sakshi News home page

అంబటి రాయుడిపై సస్పెన్షన్‌

Published Thu, Feb 1 2018 12:10 AM

Suspension on Ambati Royadu - Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కెప్టెన్‌ అంబటి తిరుపతి రాయుడుపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సస్పెన్షన్‌ వేటు వేసింది. గత నెలలో కర్ణాటకతో జరిగిన ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ మ్యాచ్‌లో అంపైర్లతో వాగ్యుద్ధానికి దిగడమే అందుకు కారణం. బోర్డు కాంట్రాక్టు ప్లేయర్‌ అయిన అతను ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినట్లు తేలడంతో బీసీసీఐ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ‘రాయుడుపై రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో విజయ్‌ హజారే వన్డే టోర్నీలో అతను తొలి రెండు మ్యాచ్‌లకు దూరమవుతాడు. ఈ వివాదంపై ఫీల్డు అంపైర్లు అభిజిత్‌ దేశ్‌ముఖ్, ఉల్లాస్‌ విఠల్‌రావు గాంధీలతో పాటు థర్డ్‌ అంపైర్‌ అనిల్‌ దండేకర్‌ల వాదనలు విన్నాం. హైదరాబాద్‌ టీమ్‌ మేనేజర్‌ వివరణ కూడా తీసుకున్నాం’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ మ్యాచ్‌లో కర్ణాటక ముందుగా 203 పరుగులు చేసింది. జట్టు ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్‌ను గుర్తించని అంపైర్లు రెండు పరుగులు మాత్రమే ఇచ్చారు.తర్వాత కర్ణాటక విజ్ఞప్తిపై మరో రెండు పరుగులు జోడించారు. దీనిని రాయుడు తప్పుబట్టాడు. హైదరాబాద్‌ కూడా సరిగ్గా 203 పరుగులే చేయడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించాలంటూ మైదానంలోనే పట్టుబట్టాడు. అయితే దానికి అంపైర్లు అంగీకరించలేదు. ఈ గొడవ వల్ల  తర్వాతి మ్యాచ్‌ కూడా ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది.  

రాయుడికి కొత్తకాదు: మైదానంలో ఆటతో పాటే వివాదాల్లో నిలవడం అంబటి రాయుడికిది కొత్తకాదు. ఐపీఎల్‌ 2012 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయుడు బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ ఆటగాడు హర్షల్‌ పటేల్‌ను దూషించాడు. అక్కడే ఉన్న భారత సీనియర్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ సర్దిచెప్పేందుకు వచ్చినా లెక్కచేయలేదు. దాంతో బీసీసీఐ అతనిపై 100 శాతం మ్యాచ్‌ ఫీజు జరిమానా విధించింది. 2016 ఐపీఎల్‌లో సొంత జట్టు బౌలర్‌ హర్భజన్‌తో మిస్‌ ఫీల్డింగ్‌ సంబంధించి నోరుపారేసుకున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ వయోవృద్ధుడితో రోడ్డుపైనే గొడవపడ్డాడు. కెరీర్‌ తొలినాళ్లలో అనంతపురంలో 2005లో ఆంధ్ర జట్టుకు ఆడుతున్న రాయుడు, హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ అర్జున్‌ యాదవ్‌తో మైదానంలో బాహాబాహికి దిగడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.    

Advertisement
Advertisement