Sakshi News home page

ఈసారైనా గెలవాలి!

Published Tue, Oct 13 2015 4:09 PM

ఈసారైనా గెలవాలి!

ఇండోర్:దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో తృటిలో విజయాన్ని కోల్పోయిన టీమిండియా.. బుధవారం నాటి రెండో వన్డేలో గెలుపుతో గాడిలో పడాలని భావిస్తోంది. రేపు ఇరు జట్ల మధ్య ఇండోర్ వేదికగా జరిగే రెండో వన్డే మధ్యాహ్నం గం 1.30 ని.లకు ఆరంభం కానుంది.
టోర్నీఆరంభంలో భాగంగా జరిగిన ట్వంటీ 20 సిరీస్ లో టీమిండియా ఓటమి చెందడం .. ఆ తరువాత కాన్పూర్ లోని జరిగిన తొలి వన్డేను చేజేతులా చేజార్చుకోవడం సెలెక్షన్ కమిటీని కలవరపెడుతోంది. జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా విఫలం చెందడం జట్టు విజయాలపై అనేక అనుమానాలకు తావిస్తోంది. సఫారీలతో జరిగి వార్మప్ మ్యాచ్ లో సెంచరీతో మెరిసిన శిఖర్ ధవన్ ప్రధాన సిరీస్ లు ఆరంభమయ్యే సరికి విఫలమవుతున్నాడు. ఓపెనింగ్ లో రోహిత్ శర్మ విశేషంగా రాణిస్తున్నా.. మరో ఓపెనర్ శిఖర్ ఇప్పటివరకూ అతని స్థాయిలో రాణించకపోవడం ఆందోళనకరంగా మారింది.

 

దీంతో పాటు మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లి, సురేష్ రైనాలు రాణించాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే పేస్ విభాగంలో ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ లు, ఆల్ రౌండర్ గా జట్టులో ఉన్న స్టువర్ట్ బిన్నీ కూడా ఆకట్టుకోవాలి. కాగా, తొలి వన్డేలో ప్రధాన స్పిన్నర్ అశ్విన్ కు గాయపడటం జట్టును తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. అతని స్థానంలో హర్భజన్ సింగ్ కు వన్డే జట్టులోకి తీసుకుంటున్నట్లు ఇప్పటికే బీసీసీఐ తెలిపింది. రేపటి తుది జట్టులో హర్భజన్ ఆడినా.. దక్షిణాఫ్రికాను ఎంత వరకూ నిలువరిస్తాడనేది ప్రశ్నార్ధకం. మరోవైపు టి20 సిరీస్ గెలవడంతో పాటు తొలి వన్డేలో విజయంతో సఫారీలలో ఆత్మవి శ్వాసం అమాంతం పెరిగిపోయింది. బ్యాటింగ్‌లో అందరూ ఫామ్‌లో ఉండటం జట్టుకు అదనపు బలం. ఫస్ట్ వన్డేలో అజేయ సెంచరీతో చెలరేగిన డివిలియర్స్‌ను రేపటి మ్యాచ్ లో కట్టడి చేయకపోతే భారత్ మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకవైపు టీమిండియా వైఫల్యంపై విమర్శలు.. మరో పక్క మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీపై ప్రశ్నలు. ఇది జట్టు ప్రస్తుత పరిస్థితి. ఇటువంటి తరుణంలో టీమిండియా గాడిలో పడాలంటే ఒక గెలుపు కావాలి.

Advertisement
Advertisement