కుస్తీ వీరులు తెలంగాణ ఖ్యాతిని చాటాలి | Sakshi
Sakshi News home page

కుస్తీ వీరులు తెలంగాణ ఖ్యాతిని చాటాలి

Published Tue, Jun 13 2017 3:10 PM

కుస్తీ వీరులు తెలంగాణ ఖ్యాతిని చాటాలి - Sakshi

హైదరాబాద్: మల్ల యోధులు కుస్తీ పోటీల్లో తెలంగాణ ఖ్యాతిని చాటాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి జియాగూడలోని ఎంసీహెచ్‌ క్వార్టర్స్‌లో జరిగిన వీర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్వాన్, గోషామహల్‌ నియోజకవర్గాల్లో మల్ల యోధులు వేల సంఖ్యలో ఉన్నారని, వీరంతా గత 100 సంవత్సరాల నుంచి తమ సత్తా చాటుతూనే ఉన్నారన్నారు. యువతకు కుస్తీ పోటీలపై ఆసక్తి కలిగే విధంగా శిక్షణ ఇస్తూ క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్నారని కితాబిచ్చారు.

 

ఈ సందర్భంగా బోలూ సింగ్‌జీ హెవీ వెయిట్‌ కేసరి టైటిల్‌ (90–150 కేజీలు) నెగ్గిన  ధూల్‌పేట్‌ లాలా తాలీమ్‌కు చెందిన సూరజ్‌ లాల్‌ పహిల్వాన్‌కు ఆయన విజేత గదను అందించారు. ఈ పోటీలో బోయిగూడ కమాన్‌ వీర్‌మారుతీ వ్యాయామశాలకు చెందిన రెజ్లర్‌ టిల్లు కుమార్‌ రన్నరప్‌గా నిలిచాడు. మిగతా వెయిట్‌ కేటగిరీల్లో వీర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ కేసరి టైటిల్‌ (70–90 కేజీలు)ను తెలంగాణ పోలీస్‌ అకాడమీకి చెందిన జి. గజేందర్‌ దక్కించుకోగా...  వీర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ బాల్‌ కేసరి టైటిల్‌ (50–55 కేజీలు)ను మల్లేపల్లి గోవింద్‌రామ్‌ అఖాడాకు చెందిన వై. సాయి గెలుచుకున్నాడు. 40–45 కేజీల విభాగంలో జియాగూడ ఎంసీహెచ్‌ రెజ్లర్‌ జి. ప్రదీప్‌ విజేతగా నిలిచాడు.

 

ఈ టోర్నీలో సుమారు 300 మంది మల్ల యోధులు తలపడగా గెలుపొందినవారికి రాష్ట్ర మంత్రి నాయిని షీల్డులు, గదలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యూత్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ గౌడ్, ఆర్గనైజర్‌ గులాబ్‌ సింగ్‌ పహిల్వాన్, జియాగూడ కార్పొరేటర్‌ మిత్ర కృష్ణ, గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ బంగారి ప్రకాశ్, కార్వాన్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌ ఠాకూర్‌ జీవన్‌ సింగ్, ఆర్గనైజర్‌ ధరమ్‌ సింగ్‌ పహిల్వాన్, కైలాష్‌సింగ్‌ పహిల్వాన్, లాలా తాలీమ్‌కు చెందిన ఆదేశ్‌ సింగ్‌ పహిల్వాన్, లక్ష్మణ్‌ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement