ఇంటి స్థలం ఇచ్చేది లేదు! | Sakshi
Sakshi News home page

ఇంటి స్థలం ఇచ్చేది లేదు!

Published Tue, Jan 5 2016 12:48 AM

telangana state govt new GO release about state players

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించింది. వివిధ స్థాయిలలో గెలిచిన ఆటగాళ్లకు భారీ స్థాయిలో నగదు పురస్కారాలు ఇచ్చే విధంగా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వం సోమవారం దీనికి సంబంధించి జీఓ నం. 1 జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై క్రీడాకారులు ఏ స్థాయిలో విజయం సాధించినా ఇంటి నిర్మాణానికి స్థలం గానీ ఇతరత్రా భూమి గానీ కానుకగా ఇవ్వరు.
 
  నిబంధనల ప్రకారం నగదు పురస్కారం మాత్రమే అందజేస్తారు. అయితే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో 2000 నుంచి అమల్లో ఉన్న మొత్తాలను భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేతకు రూ. 25 లక్షలు ఉండగా, దానిని రూ. 2 కోట్లకు పెంచారు. రజతానికి రూ. 1 కోటి, కాంస్యానికి రూ. 50 లక్షలు ఇవ్వనున్నారు. టీమ్ ఈవెంట్ల విషయంలో కూడా ప్రత్యేక నిబంధనలు విధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పారాలింపిక్స్, స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకం సాధించినవారితో పాటు చెస్ క్రీడలో గెలిచినవారికి కూడా నగదు ఇవ్వనున్నారు. ఇక నాన్ ఒలింపిక్/గ్రామీణ క్రీడలను కూడా ప్రోత్సహించేందుకు ప్రదర్శనను బట్టి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ఇస్తారు.
 
  ముఖ్యమంత్రి విచక్షణపై ఆధారపడి అంతకంటే ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంది. విజయం సాధించిన ఆటగాడు గత రెండేళ్లుగా తాను ఎవరి వద్ద శిక్షణ పొందాడో చెబితే ఆ కోచ్ (తెలంగాణకు చెందిన వారైతేనే)కు కూడా నగదు పురస్కారం దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత మంది క్రీడాకారులు తమ స్థాయిలో ఉన్న  పరిచయాలతో గుర్తింపు లేని టోర్నీలకు కూడా ప్రభుత్వం నుంచి భారీ మొత్తాలు పొందారనే విమర్శలు వినిపించాయి. ఇప్పటి తాజా నిబంధనల కారణంగా అన్నీ స్పష్టంగా ఉండటంతో ఇకపై అలాంటివాటికి అవకాశం ఉండదు.

కొత్త పాలసీ ప్రకారం వ్యక్తిగత నగదు
పురస్కారాలు (స్వర్ణ, రజత, కాంస్యాలకు)
ఒలింపిక్స్ (రూ. 2 కోట్లు, 1 కోటి, 50 లక్షలు; పాల్గొంటే 5 లక్షలు)
ఒలింపిక్ క్రీడాంశంలో వరల్డ్ చాంపియన్‌షిప్ (రూ. 50, 30, 20 లక్షలు)
ఆసియా క్రీడలు (రూ. 30, 20, 10 లక్షలు)
కామన్వెల్త్ క్రీడలు (రూ. 25, 15, 10 లక్షలు)
జాతీయ క్రీడలు (రూ. 5, 3, 2 లక్షలు)
‘శాఫ్’ క్రీడలు (రూ. 3, 2, 1 లక్షలు)
పారాలింపిక్స్ (రూ. 5, 3, 2 లక్షలు)
స్పెషల్ ఒలింపిక్స్ (రూ. 3, 2, 1 లక్షలు)
చెస్‌లో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ (ఐజీఎం) అయితే రూ. 3 లక్షలు;
ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం), ఇంటర్నేషనల్ ఉమెన్ మాస్టర్ (ఐడబ్ల్యూఎం) అయితే రూ. 1 లక్ష.

 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement