జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు రజతాలు | Sakshi
Sakshi News home page

జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు రజతాలు

Published Thu, Feb 12 2015 12:52 AM

జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు రజతాలు

తిరువనంతపురం: నిలకడగా రాణిస్తున్న తెలంగాణ క్రీడాకారులు జాతీయ క్రీడల్లో తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన పోటీల్లో తెలంగాణకు రెండు రజత పతకాలు వచ్చాయి. 500 మీటర్ల కనోయ్ సింగిల్స్‌లో నవోబీ సింగ్... 500 మీటర్ల కయాక్ డబుల్స్ విభాగంలో పదమ్‌కర్ ప్రసాద్, ప్రేమానంద సింగ్ ద్వయం రజత పతకాలు గెల్చుకున్నారు. కనోయ్ ఫైనల్స్‌లో నవోబీ సింగ్ రెండు నిమిషాల 9.15 సెకన్లలో గమ్యానికి చేరుకొని రెండో స్థానంలో నిలిచాడు. కయాక్ డబుల్స్‌లో ప్రసాద్-ప్రేమానంద సింగ్ జంట ఒక నిమిషం 44 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.

మహిళల బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో తెలంగాణ క్రీడాకారిణులు రుత్విక శివాని, రితూపర్ణ దాస్ రెండో రౌండ్‌లోకి చేరుకున్నారు. తొలి రౌండ్‌లో రుత్విక 21-11, 21-9తో ముద్రా ధైంజీ (మహారాష్ట్ర)పై, రితూపర్ణ దాస్ 17-21, 21-17, 21-18తో నేహా పండిత్ (మహారాష్ట్ర)పై గెలిచారు.

శ్యామ్ సంచలనం

పురుషుల బాక్సింగ్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ సంచలనం సృష్టించాడు. 49 కేజీల విభాగం రెండో రౌండ్‌లో శ్యామ్ కుమార్ 18-6 పాయింట్ల తేడాతో ప్రపంచ యూత్ మాజీ చాంపియన్ థోక్‌చోమ్ నానౌ సింగ్ (సర్వీసెస్)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణ 20 పతకాలతో (6 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలు) 11వ స్థానంలో; ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (5 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలు) 15వ స్థానంలో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ సర్వీసెస్ 109 పతకాలతో (68 స్వర్ణాలు, 19 రజతాలు, 22 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement