బీసీసీఐకి విజయ్ గోయల్ హెచ్చరిక! | Sakshi
Sakshi News home page

బీసీసీఐకి విజయ్ గోయల్ హెచ్చరిక!

Published Mon, May 29 2017 2:10 PM

బీసీసీఐకి విజయ్ గోయల్ హెచ్చరిక!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తరువాతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ద్వైపాక్షిక సిరీస్ గురించి చర్చించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ను క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ తో క్రికెట్ జరగడం అనేది చాలా కష్టమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి భారత్ ఎటువంటి విముఖత వ్యక్తం చేయడం లేదని బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రి గోయల్ స్పందించారు. ఒకవేళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చర్చలు జరిపే ఉద్దేశం ఉంటే ముందుగా కేంద్రం అనుమతి తీసుకోవాలని గోయల్ వార్నింగ్ ఇచ్చారు.

'పాకిస్తాన్ తో సిరీస్ కు సంబంధించి బీసీసీఐ ఎటువంటి ముందడుగు వేయాలనుకున్నా గవర్నమెంట్ తో మాట్లాడటం మంచిది. పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ అనేది ఇప్పట్లో చాలా కష్టం. ఉగ్రవాదం-క్రికెట్ అనేవి ఒకే తాటిపై పయనించలేవు కదా. కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నది పాకిస్తానే. మరొకవైపు భారత సరిహద్దుల్లో కూడా పాక్ ఉగ్రవాద దాడులకు పాల్పడుతుంది. ఇటువంటి తరుణంలో పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ జరిగే ప్రసక్తే ఉండదు'అని విజయ్ గోయల్ పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకూ వారితో ఎటువంటి క్రీడాసంబంధాలు ఉండవని ఆయన మరోసారి తెగేసి చెప్పారు. దాంతో చాంపియన్స్ ట్రోఫీలో పాక్ తో .చర్చలు జరపాలనుకున్న బీసీసీఐకి ఆదిలోనే చుక్కెదురైనట్లయ్యింది.

Advertisement
Advertisement