జవాబు జబర్దస్త్ | Sakshi
Sakshi News home page

జవాబు జబర్దస్త్

Published Fri, Dec 12 2014 12:12 AM

జవాబు జబర్దస్త్

నాలుగో రోజు  ఆట ఉ.గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
 భారత్  తొలి ఇన్నింగ్స్‌లో 369/5
 కెప్టెన్ విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ
 విజయ్, పుజారా, రహానే అర్ధసెంచరీలు
 ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్
 
 కుర్రాళ్లు బెదరలేదు. తొలిసారి ఆడుతున్నా సరే ఆస్ట్రేలియా గడ్డపై బెంబేలెత్తలేదు. ప్రత్యర్థి భారీ స్కోరును చూసి తడబడలేదు. ‘కంగారు’ పడకుండా తమ బ్యాట్‌తో ప్రత్యర్థికి దీటైన సమాధానం ఇచ్చారు. తొలి రోజు ఆసీస్ 3.97 రన్‌రేట్‌తో పరుగులు సాధిస్తే... మనోళ్లు 3.80తో ఆడారు. వారు ఆరు వికెట్లు కోల్పోతే, మనం నష్టపోయింది ఐదు వికెట్లే.
 
 ఆడిన మొదటి బంతే కెప్టెన్ కోహ్లి హెల్మెట్‌ను తాకింది. కొన్ని క్షణాల పాటు స్తబ్ధత... అంతే ఆ తర్వాత అతని ఆటలో ఎక్కడా దూకుడు తగ్గలేదు. కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన చోటే కెప్టెన్‌గానూ శతకం బాది కోహ్లి తన విలువేంటో చూపించాడు. ఇది అతని ఇన్నింగ్స్ మాత్రమే కాదు, నాయకుడిగా జట్టు ప్రదర్శననే ప్రతిబింబించింది.
 
 ఒకే రోజు ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు... టీమిండియా ఎంత సాధికారికంగా బ్యాటింగ్ చేసిందనేదానికి ఇది ఉదాహరణ. ఇందులో మూడింటిలో కోహ్లి ఉన్నాడు. ఎలా పోల్చినా గత ‘సీనియర్ల’ పర్యటనతో పోలిస్తే యువ ఆటగాళ్లు తమదైన రీతిలో సత్తా చాటి సిరీస్‌లో శుభారంభం చేశారు. అన్నట్లు... అసలు జాన్సన్ ముందు నిలబడగలరా అన్న అంచనాలను పటాపంచలు చేస్తూ అతడినీ చితక్కొట్టారు.
 
 అడిలైడ్: తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరుకు భారత్ దీటుగా జవాబిచ్చింది. మ్యాచ్ మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ 97 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (184 బంతుల్లో 115; 12 ఫోర్లు) సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. పుజారా (135 బంతుల్లో 73; 9 ఫోర్లు), రహానే (76 బంతుల్లో 62; 10 ఫోర్లు), విజయ్ (88 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా అర్ధ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ శర్మ (33 బ్యాటింగ్; 4 ఫోర్లు), సాహా (1 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ మరో 148 పరుగులు వెనుకబడి ఉంది. నాలుగో రోజు కూడా బాగా ఆడితే మ్యాచ్ ఆసక్తికరంగా మారవచ్చు. చివర్లో కోహ్లి అవుట్ కాకుండా ఉంటే జట్టు పరిస్థితి పటిష్టంగా ఉండేది. అంతకు ముందు ఆస్ట్రేలియా తమ ఓవర్‌నైట్ స్కోరు 517/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
 
 
 సెషన్ 1   ఆకట్టుకున్న విజయ్
 భారత్ ఇన్నింగ్స్‌ను ధావన్ (24 బంతుల్లో 25; 5 ఫోర్లు) ధాటిగా ఆరంభించాడు. జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికే హాడిన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ధావన్ అదే ఓవర్లో మూడు ఫోర్లు బాది బదులిచ్చాడు. ఆ తర్వాత హారిస్ బంతిని ధావన్ వికెట్లపైకి ఆడుకోవడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ విజయ్ మాత్రం ప్రతి బంతికీ తడబడ్డాడు. 19వ బంతికి గానీ అతను మొదటి పరుగు తీయలేకపోయాడు. 11 పరుగుల వద్ద విజయ్ క్యాచ్‌ను స్లిప్‌లో మార్ష్ వదిలేశాడు. అయితే నిలదొక్కుకున్నాక విజయ్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. లయోన్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన అతను 78 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం జాన్సన్ బౌలింగ్‌లో విజయ్ వెనుదిరిగాడు.
 ఓవర్లు: 32, పరుగులు: 119, వికెట్లు: 2
 
 సెషన్ 2   రాణించిన పుజారా
 లంచ్ తర్వాత కోహ్లి, పుజారా భాగస్వామ్యం భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చింది. వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడి స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో 96 బంతుల్లో పుజారా అర్ధ సెంచరీ పూర్తయింది. ఆసీస్ బౌలర్లలో ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. అప్పుడప్పుడు జాన్సన్ కొన్ని షార్ట్ పిచ్ బంతులు విసరడం మినహా వికెట్‌నుంచి కూడా బౌలర్లకు సహకారం అందలేదు. మరో భారీ భాగస్వామ్యం దిశగా వెళుతున్న దశలో లయోన్ చక్కటి బంతితో పుజారాను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు.
 ఓవర్లు: 29, పరుగులు: 104, వికెట్లు: 1
 
 సెషన్ 3   కోహ్లి, రహానే దూకుడు
 విరామం తర్వాత 86 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. అనంతరం రహానేతో కలిసి జోరు పెంచాడు. ఇంగ్లండ్‌లో నిలకడగా రాణించిన రహానే, ఇక్కడ కూడా చూడచక్కటి షాట్లు ఆడాడు. 10 ఫోర్లతో 61 బంతుల్లో అతను అర్ధ సెంచరీ అందుకోవడం విశేషం. అయితే మరోసారి లయోన్ భారత్‌ను దెబ్బ తీశాడు. చక్కటి బంతితో అతను రహానేను అవుట్ చేయడంతో 101 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరో వైపు కోహ్లి తగ్గలేదు. 158 బంతుల్లో అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ కూడా తడబాటుకు లోనుకాకుండా నిలదొక్కుకున్నాడు. అయితే మరో మూడు ఓవర్లలో రోజు ముగుస్తుందనగా భారత్‌కు షాక్ తగిలింది. జాన్సన్ బౌన్సర్ ఆడలేక కోహ్లి, డీప్ ఫైన్‌లెగ్ వద్ద క్యాచ్ ఇచ్చాడు.
 ఓవర్లు: 36, పరుగులు: 146, వికెట్లు: 2
 
 4  విజయ్ హజారే, గవాస్కర్, వెంగ్‌సర్కార్ తర్వాత కెప్టెన్‌గా తొలి టెస్టులోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ కోహ్లి.
 
 7 కోహ్లి టెస్టు కెరీర్‌లో ఇది ఏడో సెంచరీ. ఆస్ట్రేలియాపై మూడోది. వీటిలో రెండు అడిలైడ్‌లోనే చేశాడు.
 
 1ఆసీస్ గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో వరుసగా 2,3,4,5 వికెట్లకు భారత జట్టు కనీసం 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే తొలిసారి.
 
 300 500 పరుగులు దాటిన తర్వాత  ఒక జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం ఇది చరిత్రలో 300వ సారి కావడం విశేషం. ఇందులో ఆస్ట్రేలియా (67) ఎక్కువ సార్లు డిక్లేర్ చేసింది.
 
 ‘ఆసీస్ భారీ స్కోరు చేసిన చోటే మేం ఎందుకు ఆడలేమని భావించాం. అందుకే బాగా ఆడి మమ్మల్ని మేం నిరూపించుకున్నాం. జట్టులో అందరం పరుగులు సాధించాం. ప్రత్యర్థి ప్రణాళికలను విఫలం చేస్తూ చక్కగా ఆడిన మా బ్యాట్స్‌మెన్‌ను కొంతైనా అభినందించాలి. సిరీస్‌లో లభించిన ఈ శుభారంభాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తాం.’
 -పుజారా, భారత బ్యాట్స్‌మన్
 
 
 స్కోరు వివరాలు
 ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 517/7 డిక్లేర్డ్
 భారత్ తొలి ఇన్నింగ్స్:  విజయ్ (సి) హాడిన్ (బి) జాన్సన్ 53; ధావన్ (బి) హారిస్ 25; పుజారా (బి) లయోన్ 73; కోహ్లి (సి) హారిస్ (బి) జాన్సన్ 115; రహానే (సి) వాట్సన్ (బి) లయోన్ 62; రోహిత్ శర్మ (బ్యాటింగ్) 33; సాహా (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (97 ఓవర్లలో 5 వికెట్లకు) 369
 వికెట్ల పతనం: 1-30; 2-111; 3-192; 4-293; 5-367.
 బౌలింగ్: జాన్సన్ 18-5-90-2; హారిస్ 17-5-49-1; లయోన్ 30-3-103-2; సిడిల్ 13-2-62-0; మార్ష్ 11-4-29-0; వాట్సన్ 5-1-13-0; స్మిత్ 3-0-19-0.
 
 సరిగ్గా ‘అలాంటి’ శబ్దమే..!
 అవును... అది సరిగ్గా హ్యూస్‌కు బంతి తగిలినప్పుడు వచ్చిన శబ్దంలాంటిదే! నాడు దానిని విన్న, చూసిన ‘ఆ నలుగురి’ గుండె మరోసారి ఒక్క క్షణం పాటు ఆగిపోయింది. మళ్లీ జీవితంలో అలాంటి ఘటన చూడాలని వారు కోరుకోవడం లేదు. అందుకే వెంటనే  కోహ్లి వద్దకు పరుగెత్తుకొచ్చారు. ఎంత వద్దనుకున్నా సరిగ్గా రెండు వారాల క్రితం నాటి చేదు జ్ఞాపకాలు ఆటగాళ్లను వీడటం లేదనేదానికి గురువారం ఘటన నిదర్శనం.
 
  31వ ఓవర్ తొలి బంతిని జాన్సన్ 150 కిలో మీటర్ల వేగంతో విసిరాడు. కోహ్లి క్రీజ్‌లోకి వచ్చాక ఎదుర్కొంటున్న తొలి బంతి కూడా అదే. దానిని ఆడాలా, వద్దా అనే సంశయంలోనే అంచనా తప్పాడు. ఫలితంగా నేరుగా వచ్చి బంతి హెల్మెట్ ముందు భాగంలో బ్యాడ్జ్‌పై ఫట్‌మంటూ తగిలింది. మైదానం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం! లిప్త కాలం పాటు ఏం జరిగిందో కోహ్లికీ అర్ధం కాలేదు. అతని తల కదిలిపోయింది. దాంతో వెంటనే హెల్మెట్ తీసేశాడు.
 
 అప్పటికే అందరికంటే ముందుగా వార్నర్ దగ్గరికొచ్చాడు. ఆ తర్వాత ఇతర ఆటగాళ్లు, అంపైర్లు కూడా... ఎలా ఉందంటూ కోహ్లి క్షేమం కోసం వారిలో ఆత్రుత. అటు జాన్సన్ మొహంలో కూడా ఆందోళన. ఎందుకంటే అది ఆటే కావచ్చు, కానీ అది ప్రాణాలు తీయరాదని అతనికీ తెలుసు. అందుకే రోడ్డుపై యాక్సిడెంట్ చేసినవాడిలా పరుగెత్తుతూ కోహ్లి వైపు వచ్చాడు. ప్రమాదం లేదని తెలిశాక తర్వాతి బంతికి అంతా సిద్ధమయ్యారు. అటు జాన్సన్ భుజంపై చేయి వేసి క్లార్క్ అనునయించడంతో అంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.
 
 ఆస్ట్రేలియన్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ చుట్టూ చేరింది ఈసారి స్లెడ్జింగ్ చేయడానికి కాదు... స్వాంతన ఇచ్చేందుకు. వారిలో దురుసుతనం లేదు... క్రీడా స్ఫూర్తి తప్ప. రెండు జట్లు, ఒకే కుటుంబం! ఆ బంతి తర్వాత కోహ్లికి జాన్సన్ మరో 24 బంతుల వరకు బౌన్సర్ వేయనే లేదు.
 

Advertisement
Advertisement