పాక్‌నీ పాతరేద్దాం! | Sakshi
Sakshi News home page

పాక్‌నీ పాతరేద్దాం!

Published Fri, Feb 26 2016 11:40 PM

పాక్‌నీ పాతరేద్దాం!

భారత్, పాకిస్తాన్‌ల పోరు నేడు  
ఇరు దేశాల మధ్య ఉద్వేగ వాతావరణం   
ఆసియా కప్ టి20 టోర్నీ


రెండు దేశాల్లోనూ దేశభక్తిని ప్రదర్శించడానికి అతి పెద్ద మార్గం క్రికెట్. ప్రస్తుతం మన దగ్గర ఓ రకమైన ఉద్విగ్న వాతావరణం. సరిహద్దు గొడవలు, సైనికుల దాడులు... నేరుగా కాకపోయినా పరోక్షంగా దాయాది కారణంగా మన దేశంలో ఉద్రేకపూరిత పరిస్థితులు... ఇలాంటప్పుడు పాక్‌ను పాతరేసి భారత జట్టు గెలిస్తే ఆ ఉత్సాహమే వేరు. దేశం యావత్తూ పులకించిపోవడం ఖాయం.
 
అద్భుతమైన ఫామ్... గత ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు... ఎలాంటి పరిస్థితుల్లో అయినా చెలరేగుతున్న భారత సేన... అయితే భారత్ అసలు సిసలు సత్తా చూపాల్సిన సమయం మాత్రం ఇదే. ఎన్ని దేశాలపై గెలిచినా, పాక్ చేతిలో ఓటమిని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేని పరిస్థితి. కాబట్టి చిరకాల ప్రత్యర్థిని నేడు చిత్తు చేయాల్సిందే..!

మిర్పూర్: పాకిస్తాన్‌పై భారత్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించగల భారత క్రికెటర్ ఎవరు అంటే తడుముకోకుండా కోహ్లి పేరు చెప్పేయవచ్చు. టి20ల్లో ఆ జట్టుపై అతని సగటు 75. చివరిసారి రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ (ప్రపంచకప్ వన్డే)లోనూ సెంచరీతో జట్టును గెలిపించాడు. కోహ్లి చెలరేగితే భారత్ కళ్లుమూసుకుని గెలుస్తుంది. అందుకే పాక్ ప్రధానంగా తనపై దృష్టిసారించింది. ఎప్పటిలాగే భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అనగానే అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) షేరే బంగ్లా నేషనల్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య ఆసియాకప్ టి20 మ్యాచ్ జరగనుంది.

టాపార్డర్‌దే భారం
రోహిత్ శర్మ, కోహ్లి ఫామ్‌ల గురించి జట్టుకు బెంగ లేదు. ధావన్ కూడా తనదైన రోజున చెలరేగిపోగలడు. కాబట్టి ఈ మ్యాచ్‌లో జట్టు గెలవాలంటే మన టాపార్డర్ ఆశించిన స్థాయిలో రాణించాల్సి ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే ఈ ముగ్గురిలో ఏ ఇద్దరైనా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. రైనా, ధోనిలతో పాటు ఆల్‌రౌండర్ పాండ్యా బ్యాటింగ్ కూడా జట్టుకు బలం. యువరాజ్ మాత్రమే ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. జట్టులో దాదాపు అందరు ఆటగాళ్లకు పాకిస్తాన్‌ను ఎదుర్కొన్న అనుభవం ఉంది కాబట్టి ఒత్తిడి కూడా లేదు. అయితే టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లు జరిగిన పిచ్‌ను చూస్తే పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. ఆరంభంలో పాక్ బౌలర్లను జాగ్రత్తగా ఎదుర్కొంటే ఆ తర్వాత తిరుగుండదు. మన బౌలింగ్‌పై కూడా ఎలాంటి సందేహాలు లేవు.  ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత వరుస విజయాల జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అయితే వికెట్‌ను దృష్టిలో ఉంచుకొని మరో అదనపు పేసర్‌కు అవకాశం ఇస్తారేమో చూడాలి. వెన్నునొప్పితో బాధపడుతున్న ధోని శుక్రవారం ప్రాక్టీస్‌లో పాల్గొనకుండా విశ్రాంతి తీసుకున్నాడు. మ్యాచ్ ఆరంభమయ్యే వరకూ తను ఆడేదీ లేనిదీ తెలియని పరిస్థితి.

ఆ ముగ్గురే కీలకం
మరో వైపు పాకిస్తాన్ ఇటీవల ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల చేతిలో వరుసగా రెండు టి20 సిరీస్‌లు ఓడింది. అయితే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ కారణంగా ఆ జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌కు సిద్ధంగా ఉన్నారు. కొంత మంది కొత్త కుర్రాళ్లు జట్టులో ఉన్నా... భారత్‌తో మ్యాచ్ అంటే ఆ జట్టు విజయావకాశాలు ప్రధానంగా ముగ్గురు ఆటగాళ్లపైనే ఆధారపడి ఉన్నాయి. ఆఫ్రిది, షోయబ్ మాలిక్, హఫీజ్‌లు http://img.sakshi.net/images/cms/2016-02/71456514061_Unknown.jpgమ్యాచ్‌లను మలుపు తిప్పగల సమర్థులు. వీరికి తోడు జట్టులోకి పునరాగమనం చేసిన మొహమ్మద్ ఆమిర్ కీలక ఆటగాడు. అయితే ఆమిర్ ఎప్పుడూ భారత్‌పై టి20ల్లో ఆడలేదు. ఆల్‌రౌండర్లు మినహా జట్టులో అనుభవం గల ప్రధాన స్పిన్నర్ ఎవరూ లేకపోవడంతో ఆ జట్టు మొత్తం పేసర్లతోనే దిగే అవకాశం కనిపిస్తోంది.

 
 మాటల్లేవ్...
ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్లు శుక్రవారం ఇక్కడ దాదాపు రెండున్నర గంటలపాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాయి. వేర్వేరు సమయాల్లో కాకుండా ఒకేసారి పక్క పక్క నెట్స్‌లోనే ఆటగాళ్లు సాధన చేశారు. అయితే అక్కడంతా గంభీర వాతావరణం కనిపించింది. ఇరు దేశాల క్రికెటర్లు ఒక్కసారి కూడా కనీసం పలకరించుకోలేదు! సాధారణంగా మ్యాచ్‌లో ఎలాంటి పరిస్థితి ఉన్నా నెట్స్‌లో లేదా మైదానం బయట భారత్, పాక్ ఆటగాళ్లలో మంచి స్నేహమే కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అలా లేదు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆటగాళ్ల ధోరణిలో మార్పు వచ్చిందేమో. మ్యాచ్‌కు ముందే పరిస్థితి ఇలా ఉంటే అసలు మ్యాచ్ యుద్ధభూమిని తలపిస్తుందా..!
  
5భారత్, పాక్‌ల మధ్య ఇప్పటివరకూ ఆరు టి20 మ్యాచ్‌లు జరిగితే భారత్ ఐదు గెలిచింది.
2  ఏ ఫార్మాట్‌లో అయినా భారత్‌పై పాకిస్తాన్ గెలిచి రెండేళ్లయింది. చివరిసారిగా 2014 ఆసియాకప్  (వన్డే)లో పాక్ గెలిచింది.
7  రెండు జట్ల మధ్య చివరిసారి ఢాకాలోనే జరిగిన టి20లో భారత్ ఏడు వికెట్లతో గెలిచింది.
  
పాకిస్తాన్ బౌలింగ్ బాగుందనేది వాస్తవం. అయితే మేం మా బలాన్ని బట్టి వ్యూహాలు రూపొందించుకుంటాం. కాబట్టి బౌలర్లు ఎవరైనా మా బ్యాటింగ్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాం. ప్రతీ జట్టుకు తమదైన ప్రత్యేకతలు ఉంటాయి. మా స్పిన్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. నా దృష్టిలో గతంకంటే ప్రస్తుత ఫామ్ మాత్రమే ముఖ్యం.     - రోహిత్
 

 తొలి ఆరు ఓవర్లలో వికెట్లు తీసి శుభారంభం ఇవ్వగల పేస్ బౌలర్లు మా వద్ద ఉన్నారు. ఈ వ్యూహాన్ని సమర్థంగా అమలు చేస్తాం. భారత్ బలం బ్యాటింగే అని తెలుసు. మా బౌలింగ్‌తోనే దెబ్బ తీయగలమని నమ్ముతున్నాం. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం. ఈ సారి విజయం మా వైపు ఉంటుందని ఆశిస్తున్నా.   - ఆఫ్రిది

పిచ్, వాతావరణం

ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్‌లలోనూ ఆరంభంలో పేసర్లు రాణించారు. మరోసారి అదే తరహా వికెట్ ఎదురుకావచ్చు. చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. మ్యాచ్‌కు అంతరాయం ఉండకపోవచ్చు.
 
 జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా.

పాకిస్తాన్: ఆఫ్రిది (కెప్టెన్), హఫీజ్, షర్జీల్, మన్‌జూర్, మాలిక్, ఉమర్ అక్మల్, సర్ఫరాజ్, అన్వర్, రియాజ్, ఆమిర్, ఇమాద్/సమీ.
రా. గం. 7నుంచి  స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం  
 

Advertisement
Advertisement