'ఫినిష్‌' చేసేదెవరు? | Sakshi
Sakshi News home page

'ఫినిష్‌' చేసేదెవరు?

Published Sat, Feb 24 2018 12:35 AM

Today is the last T20 match - Sakshi

కేప్‌టౌన్‌లో మొదలైన భారత జట్టు సఫారీ ఆఖరి మజిలీగా మళ్లీ కేప్‌టౌన్‌ చేరింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత ఒక అద్భుత విజయంతో టెస్టు సిరీస్‌కు ముగింపు... ఆ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో ఏకపక్షంగా వన్డే సిరీస్‌ సొంతం... పొట్టి ఫార్మాట్‌లో రెండు మ్యాచ్‌లలో సమం సమం... ఇక దక్షిణాఫ్రికా పర్యటనను సంతృప్తికరంగా ముగించి స్వదేశం తిరిగి వెళ్లేందుకు భారత్‌ ముందు ఆఖరి అవకాశం. మరొక్క మ్యాచ్‌లో మన ఆటగాళ్లు స్థాయికి తగ్గట్లుగా ఆడితే ఈ 51 రోజుల టూర్‌ ఎప్పటికీ చిరస్మరణీయంగా మారిపోతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా వన్డేల్లో పోయిన పరువును ఇక్కడైనా కాపాడుకునే ప్రయత్నంలో సిరీస్‌ గెలుచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు చివరి టి20లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా జట్టు ఆఖరి సారిగా 2015లో భారత్‌లో పర్యటించినప్పుడు టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడినా... వన్డే, టి20 సిరీస్‌లు రెండింటిని సొంతం చేసుకుంది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో బదులివ్వాలంటే టీమిండియా టి20 సిరీస్‌ కూడా గెలుచుకోవాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు న్యూలాండ్స్‌ మైదానంలో ఆఖరి టి20 మ్యాచ్‌ జరగనుంది. గత మ్యాచ్‌లో అనూహ్య విజయంతో సఫారీ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరగగా... ఆ మ్యాచ్‌లో దొర్లిన తప్పులను దిద్దుకొని సత్తా చాటాలని కోహ్లి సేన పట్టుదలగా ఉంది.  

కుల్దీప్‌కు చోటు! 
చాలా కాలంగా పరిమిత ఓవర్లలో చుక్కానిలా ఉన్న భారత్‌ టాపార్డర్‌ సెంచూరియన్‌లో అనూహ్యంగా విఫలమైంది. రోహిత్, ధావన్, కోహ్లి ముగ్గురూ ఒకేసారి తక్కువ స్కోర్లకే వెనుదిరగడం ఇటీవల ఎప్పుడూ జరగలేదు. అయితే అదీ ఒకందుకు మేలు చేసింది. మనీశ్‌ పాండే బ్యాటింగ్‌ లోతు ఏమిటో తెలియగా, తగినన్ని ఓవర్లు అందుబాటులో ఉంటే ఏం చేయగలడో ధోని చూపించాడు. రైనా రెండు మ్యాచ్‌లలో తన విలువను చూపించాడు. మరోసారి ఈ బ్యాటింగ్‌ లైనప్‌ చెలరేగాల్సి ఉంది. కేప్‌టౌన్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ మినహా ఒక్కసారి కూడా బ్యాటింగ్‌లో ప్రభావం చూపించలేకపోయిన పాండ్యాకు ఇది మరో అవకాశం. బౌలింగ్‌లో భువనేశ్వర్‌తో పాటు  రాణించిన శార్దుల్‌ ఠాకూర్‌కు కూడా చోటు ఖాయం. బుమ్రా కోలుకోవడంపై ఇంకా స్పష్టత రాలేదు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఉనాద్కట్‌ స్థానంలో కుల్దీప్‌ లేదా అక్షర్‌ పటేల్‌కు అవకాశం దక్కవచ్చు. చహల్‌ రెండో టి20లో ఘోరంగా విఫలమైనా... అతని స్థానానికి ఢోకా లేదు. అయితే ఆ మ్యాచ్‌ దెబ్బకు ఆత్మవిశ్వాసం కోల్పోయిన అతను తిరిగి గాడిలో పడాల్సి ఉంది. ఇప్పటికే దక్షి ణాఫ్రికా గడ్డపై అనుకున్నదానికంటే మంచి ఫలితాలు సాధించిన భారత్‌కు ఈ మ్యాచ్‌ చావోరేవోలాంటిదేమీ కాదు. అయితే రెండు సిరీస్‌ విజయాలతో తిరిగి వెళ్లాలని జట్టు కోరుకుంటుందనడంలో మాత్రం సందేహం లేదు.  

అమితోత్సాహంతో... 
రెండో టి20లో పవర్‌ప్లే ముగిసేసరికి కూడా దక్షిణాఫ్రికా విజయంపై ఎవరికీ అంచనాలు లేవు. కానీ క్లాసెన్‌ ఇన్నింగ్స్‌ మ్యాచ్‌ స్వరూపం మార్చేసింది. డుమిని చాలా కాలం తర్వాత బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా దక్కిన గెలుపు వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ జోరును తగ్గించరాదని, ఇదే తరహాలో ఆడి సిరీస్‌ సొంతం చేసుకోవాలని ఆ జట్టూ భావిస్తోంది. వీరిద్దరితో పాటు హెన్‌డ్రిక్స్‌ దూకుడైన బ్యాటింగ్‌ సఫారీలకు ఇప్పుడు బలంగా మారింది. స్మట్స్‌ రెండు మ్యాచ్‌లలో విఫలమైనా... అతని దేశవాళీ రికార్డును బట్టి చూస్తే సంచలన ఇన్నింగ్స్‌ ఆడగలడని జట్టు నమ్ముతోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు ఏకైక సమస్యగా మిల్లర్‌ మారాడు. ఐదు వన్డేల్లో 39 పరుగులే అతని అత్యధిక స్కోరు కాగా రెండు టి20ల్లోనూ విఫలమయ్యాడు. చివరి మ్యాచ్‌లోనైనా చెలరేగితే టీమ్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో కొత్త ఆటగాడు డాలా మెరవగా... మోరిస్, ఫెలుక్‌వాయో ప్రధాన పేసర్లు. అయితే సఫారీలు కూడా రెండో స్పిన్నర్‌ను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. భారీగా పరుగులిచ్చిన ప్యాటర్సన్‌ స్థానంలో ఫాంగిసో రావచ్చు. మొత్తానికి సీనియర్లు లేని లోటు సెంచూరియన్‌లో కనిపించనివ్వని కొత్త ఆటగాళ్లు మరో విజయాన్ని అందించి తమ ఎంపికకు న్యాయం చేయాలని భావిస్తున్నారు.

సిరీస్‌ విజయమే లక్ష్యంగా మహిళల జట్టు బరిలోకి...
దక్షిణాఫ్రికా గడ్డపై అరుదైన రెండు సిరీస్‌ విజయాల ఘనత సాధించేందుకు భారత మహిళల జట్టు సన్నద్ధమైంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2–1తో గెలుచుకున్న భారత్, ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2–1తో ముందంజలో నిలిచింది. నాలుగో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కేప్‌టౌన్‌లోనే నేడు జరిగే ఆఖరి మ్యాచ్‌ సిరీస్‌ ఫలితాన్ని తేల్చనుంది. తొలి రెండు మ్యాచ్‌లలో సునాయాసంగా నెగ్గిన హర్మన్‌ బృందం మూడో మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడింది. ఆఖరి మ్యాచ్‌ లో గెలిచి సిరీస్‌ సొంతం చేసుకుంటే భారత మహిళల జట్టు ప్రస్థానంలో మరో కీలక మైలురాయి కాగలదు.

►మరో 17 పరుగులు చేస్తే టి20ల్లో కోహ్లి 2 వేల పరుగులు పూర్తవుతాయి.  

► ఈ మైదానంలో దక్షిణాఫ్రికా 8 మ్యాచ్‌లు ఆడి 5 ఓడింది. మరోవైపు భారత్‌ న్యూలాండ్స్‌లో ఒక్క టి20 కూడా ఆడలేదు. ఇదే తొలి మ్యాచ్‌. 

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రైనా, పాండే, ధోని, పాండ్యా, భువనేశ్వర్, చహల్, ఠాకూర్, కుల్దీప్‌/అక్షర్‌ పటేల్‌. 
దక్షిణాఫ్రికా: డుమిని (కెప్టెన్‌), హెన్‌డ్రిక్స్, స్మట్స్, క్లాసెన్, మిల్లర్, బెహర్దీన్, ఫెలుక్‌వాయో, మోరిస్, డాలా, షమ్సీ, ప్యాటర్సన్‌/ఫాంగిసో. 

పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోరుకు తగిన వేదిక. వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా ఉన్నా తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశం ఉంది.  

► రాత్రి గం. 9.30 నుంచి  సోనీ టెన్‌–1, 3లలో  ప్రత్యక్ష ప్రసారం 

Advertisement

తప్పక చదవండి

Advertisement