Sakshi News home page

కుర్రాళ్లూ...ఫిదా చేయండి!

Published Fri, Oct 6 2017 12:13 AM

Today's Under-17 World Cup - Sakshi

భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో కీలక అధ్యాయానికి నేడు తెర లేవనుంది. క్రికెట్టే ప్రాణంగా భావించే ఈ గడ్డపై ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఆదరణ పొందిన ఫిఫా ఈవెంట్‌ జరగబోతోంది. అండర్‌–17 ప్రపంచకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత జట్టు పటిష్ట అమెరికాను ఢీకొంటుంది. అయితే సీనియర్‌ జట్టే ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఎక్కడో ఉన్న తరుణంలో భారత కుర్రాళ్లు ఈ టోర్నీలో మెరుపులు మెరిపిస్తారా? అంటే సందేహమే. అత్యుత్తమ స్థాయి ప్రొఫెషనల్‌ శిక్షణతో రాటుదేలిన ప్రత్యర్థి జట్లపై రాణించగలరనే అంచనాలు ఎవరికీ లేకపోయినా... ఇలాంటి అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో భారత కుర్రాళ్లు ఉన్నారు. 23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీతో తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుని విలువైన అనుభవం సంపాదించుకోవాలనుకుంటున్నారు. అటు ఈ టోర్నీని విజయవంతం చేసి దేశంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంచాలని భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య కోరుకుంటోంది.

న్యూఢిల్లీ: తొలిసారిగా ఫిఫా అండర్‌–17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న భారత్‌ నేటి నుంచి అసలు పోరులో బరిలోకి దిగనుంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా స్థానిక జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న అమెరికా జట్టును ఎదుర్కోబోతున్నారు. ఆతిథ్య జట్టు హోదాలో ఈ మెగా ఈవెంట్‌కు భారత్‌ నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగబోతున్న భారత ఆటగాళ్లు ఈ టోర్నీ కోసం కాస్త మెరుగ్గానే శిక్షణ తీసుకున్నారు. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య తమ ఆటగాళ్ల శిక్షణ కోసం యూరోప్, మెక్సికోలలో టోర్నీలను ఆడించింది. అయితే ఎలాంటి శిక్షణ తీసుకున్నా అమెరికాతో పోలిస్తే మన ఆటగాళ్లు చాలా వెనకబడే ఉన్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ జట్టులో చాలామందికి మేజర్‌ లీగ్‌ సాకర్‌ యూత్‌ టీమ్స్‌లో సభ్యులుగా ఉన్న అనుభవం ఉంది. కొందరైతే టాప్‌ యూరోపియన్‌ క్లబ్బుల్లో కూడా ఆడారు. పెద్దగా అంచనాలు కూడా లేకపోవడంతో పాటు స్వదేశీ అనుకూలతను సొమ్ము చేసుకుని అమెరికాపై సంచలన ప్రదర్శన కనబరచాలనే భావనలో భారత్‌ ఉంది. భారత్, అమెరికా జట్ల మధ్య తొలి మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు.  

అనుభవలేమితో భారత్‌...
ఈ మెగా ఈవెంట్‌ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న అనంతరం ఆటగాళ్ల ఎంపిక కోసం భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య పెద్ద కసరత్తే చేసింది. 2015లో అండర్‌–17 కోచ్‌గా ఎంపికైన ఆడమ్‌ దేశవ్యాప్తంగా ట్రయల్స్, టోర్నీలను నిర్వహించి అత్యుత్తమంగా కనిపించిన కుర్రాళ్లతో జట్టును తయారుచేశారు. అయితే రెండేళ్ల అనంతరం ఆటగాళ్లను దూషించారనే కారణంతో ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. తాజా కోచ్‌ అయిన పోర్చుగల్‌కు చెందిన డి మటోస్‌ జట్టులో చాలా మార్పులు చేశారు. మరోవైపు అంతర్జాతీయ వేదికలపై పెద్దగా ఆడిన అనుభవం లేకపోవడం జట్టుకు భారీ లోటు. వీరందరికీ ఇదే తొలి ప్రపంచకప్‌. అమెరికా ఆటగాళ్లలాగా ప్రొఫెషనల్‌ అకాడమీలకు హాజరైన అనుభవం ఎవరికీ లేదు. అందుకే జట్టు నుంచి ఎలాంటి అద్భుతాలు ఆశించకూడదని కోచ్‌ ముందే ప్రకటించారు. స్వదేశీ ఆటగాళ్లకు విదేశీ జట్ల ఆటగాళ్లకు మధ్య భారీ వ్యత్యాసమే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అటాకింగ్‌లో గట్టిగా ఉన్న అమెరికాను తమ పటిష్ట డిఫెన్స్‌ విభాగంతో అడ్డుకుంటామని కోచ్‌ చెప్పారు. ఆరు అడుగుల రెండు అంగుళాల ఎత్తున్న మిడ్‌ఫీల్డర్‌ జీక్సన్‌ సింగ్‌పై కోచ్‌ భారీ ఆశలే పెట్టుకున్నారు. అతడికి మిడ్‌ఫీల్డ్‌లో సహకరించేందుకు కెప్టెన్‌ అమర్జిత్, సురేశ్‌ సిద్ధంగా ఉంటారు. అన్వర్‌ అలీ, జితేందర్‌ సెంటర్‌బ్యాక్స్‌లో సంజీవ్‌ ఫుల్‌ బ్యాక్‌... ఆంటోనీ రైట్‌ బ్యాక్‌లో కీలకం కానున్నారు.  

దూకుడుగా అమెరికా...
అన్ని విభాగాల్లో అమెరికానే భారత్‌కన్నా పటిష్టంగా కనిపిస్తోంది. ఈ జట్టులో ఉన్న 17 మంది ఆటగాళ్లు ఏప్రిల్‌లో జరిగిన కాన్‌కాకాఫ్‌ అండర్‌–17 చాంపియన్‌షిప్‌ ఆడిన జట్టులోనూ సభ్యులుగా ఉన్నారు. ఫైనల్‌దాకా వెళ్లిన ఈ జట్టు మెక్సికో చేతిలో ఓడింది. ఇక కెప్టెన్, స్ట్రయికర్‌ అయిన జోష్‌ సార్జెంట్‌ వచ్చే ఫిబ్రవరిలో బుండెస్‌లిగా క్లబ్‌ వెర్డర్‌ బ్రెమెన్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నాడంటే అతడి ఆట స్థాయి అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆరంభంలో తను అండర్‌–20 ప్రపంచకప్‌లోనూ ఆడటం విశేషం.   

జట్లు: భారత్‌: అమర్జిత్‌ సింగ్‌ (కెప్టెన్‌), అన్వర్, ధీరజ్‌ సింగ్, ప్రభ్‌షుకన్, సన్నీ ధలివాల్, జితేంద్ర సింగ్, సంజీవ్‌ స్టాలిన్, ఆంటోనీ, నమిత్‌ దేశ్‌పాండే, సురేశ్‌ సింగ్, మీటేయి, అభిజిత్‌ సర్కార్, కోమల్‌ తటాల్, లాలెంగ్‌మవాయి, జీక్సన్‌ సింగ్, నవోరెమ్, రాహుల్, షాజహాన్, రహీమ్‌ అలీ, అనికేత్‌.
అమెరికా: సార్జెంట్‌ (కెప్టెన్‌), కార్లోస్, అలెక్స్, గార్సెస్, సెర్గీనో, గ్లోస్టర్, లిండ్సే, సాండ్స్, షావెర్, వాట్స్, అకోస్టా, బూత్, డుర్కిన్, ఫెర్రీ, గోస్లిన్, వాసిలేవ్, అకినోలా, కార్ల్‌టన్, వియా, రేయేస్, రేనాల్డ్స్, జోషువా.

అండర్‌–17 ప్రపంచకప్‌లో నేడు
లంబియా * ఘనా సా.గం. 5.00 నుంచి
భారత్‌* అమెరికా రా.గం. 8.00 నుంచి
వేదిక: న్యూఢిల్లీ

న్యూజిలాండ్‌ * టర్కీ సా.గం. 5.00 నుంచి
పరాగ్వే* మాలి రా.గం. 8.00 నుంచి
వేదిక: ముంబై 

Advertisement

What’s your opinion

Advertisement