టీమిండియాకు ఆసీస్‌ షాక్‌ | Sakshi
Sakshi News home page

టీమిండియాకు ఆసీస్‌ షాక్‌

Published Sun, Mar 10 2019 9:39 PM

Turner special helps Australia seal record chase against India in 4th Odi - Sakshi

మొహాలి: ఆసీస్‌తో జరిగిన నాల్గో వన్డేలో భారత్‌ ఓటమి పాలైంది. స్కోరు బోర్డుపై 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచినా దాన్ని కాపాడుకోవడంలో భారత్‌ విఫలమైంది. ఆసీస్‌ బ్యాటింగ్‌ ధాటికి విరాట్ సేన నమోదు చేసి స్కోరు చిన్నబోయింది. ఆసీస్‌ ఇంకా 13 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి భారత్‌కు షాకిచ్చింది. ఆసీస్‌ ఆటగాడు ఆస్టన్‌ టర్నర్‌ 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు.

ఆసీస్‌ లక్ష్య ఛేదనలో అరోన్‌ ఫించ్‌(0), షాన్‌ మార్ష్‌(6) వికెట్లను ఆదిలోనే చేజార్చుకుంది. కాగా, హ్యాండ్స్‌ కోంబ్‌(117), ఉస్మాన్‌ ఖాజా(91)ల జోడి మూడో వికెట్‌కు 192 పరుగులు జత చేయడంతో ఆసీస్‌ తేరుకుంది. అటు తర్వాత మ్యాక్స్‌వెల్‌(23; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) బ్యాట్ ఝుళిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. కాగా, ఆస్టన్‌ టర్నర్‌ రూపంలో భారత్‌కు అసలు సిసలు పరీక్ష ఎదురైంది. టర్నర్‌ బౌండరీల లక్ష్యంగా విజృంభించాడు. బౌలర్‌ ఎవరన్నది చూడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా ఆసీస్‌ చిరస్మణీయమైన విజయాన్ని అందుకుంది. తాజా విజయంతో సిరీస్‌ 2-2తో సమం అయ్యింది. బుధవారం చివరి వన్డే జరుగునుంది.

అంతకుముందు టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. భారత ఓపెనర్లలో శిఖర్‌ ధావన్‌(143; 115బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకం నమోదు చేయగా, రోహిత్‌ శర్మ(95; 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు.

కాగా, రోహిత్‌ శర్మ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత ధావన్‌ మరింత ధాటిగా ఆడాడు.  ఈ క్రమంలో వన్డేల్లో 16వ సెంచరీ సాధించిన ధావన్‌.. అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అయితే భారత్‌ స్కోరు 254 పరుగుల వద్ద ధావన్‌ రెండో వికెట్‌ ఔటయ్యాడు. ప్యాట్ కమిన్స్‌ బౌలింగ్‌లో ధావన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆపై మరో 12 పరుగుల వ్యవధిలో విరాట్‌ కోహ్లి(7) ఔట్‌ కావడంతో భారత్ మూడో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో కేఎల్‌ రాహుల్‌తో జత కలిసిన రిషబ్‌ పంత్‌ బ్యాట్‌ ఝుళిపించాడు.  జట్టు స్కోరు 296 పరుగుల వద్ద రాహుల్‌(26) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు. కాసేపటికి రిషభ్‌ పంత్‌(36; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత జాదవ్‌(10), భువనేశ్వర్‌లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో భారత్‌ స్కోరులో వేగం తగ్గింది. చివర్లో విజయ్‌ శంకర్‌( 26; 15 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో భారత్‌ భారీ స్కోరు చేసింది.

Advertisement
Advertisement