మ్యాచ్ గురించి ట్విట్టర్ ఏమంటోంది? | Sakshi
Sakshi News home page

మ్యాచ్ గురించి ట్విట్టర్ ఏమంటోంది?

Published Fri, Apr 1 2016 12:42 PM

మ్యాచ్ గురించి ట్విట్టర్ ఏమంటోంది? - Sakshi

భారత్- వెస్టిండీస్ మ్యాచ్‌ ఫలితం తర్వాత ట్విట్టర్ కొంత నెమ్మదించింది. టీమిండియా విజయం సాధించినప్పుడల్లా అభినందనలతో ముంచెత్తే సెలబ్రిటీలు అయితే ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారు, లేదా పాపం.. మనవాళ్లు ప్రయత్నించినా అదృష్టం వాళ్లవైపు ఉందని, వెస్టిండీస్ వాళ్లు కూడా చాలా బాగా ఆడారని చెప్పారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అసలు ఈ మ్యాచ్ గురించిన ప్రస్తావనే తేలేదు. కోల్‌కతా ఫ్లై ఓవర్ దుర్ఘటన గురించి, రక్తదానం చేయాల్సిన అవసరం గురించి మాత్రమే చెప్పారు. ఇక వెస్టిండీస్ మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు, ఇతర దేశాల క్రీడాకారులు మాత్రం ఆ టీమ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. సిమ్మన్స్ నేరుగా విమానంలో దిగి వచ్చి తమ జట్టుకు విజయాన్ని అందించాడని, అతడు నిజమైన చాంపియన్ అని వెస్టిండీస్ టీమ్ సభ్యుడు డ్వేన్ బ్రేవో అన్నాడు. ఇక సెమీఫైనల్ మ్యాచ్‌లో మెరుపులు మెరిపిస్తాడని ఆశించినా, బుమ్రా అద్భుతమైన బౌలింగుతో కేవలం 5 పరుగులకే వెనుదిరిగిన క్రిస్‌గేల్ కూడా దీనిపై స్పందించాడు. తమ జట్టులో చాంపియన్ ఒక్కరే కాదని, చాలామంది ఉన్నారని చెప్పాడు. విండీస్ మాజీ ఆటగాడు బ్రయాన్ లారా పట్టలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గ్రేట్ గ్రేట్ గ్రేట్.. అంటూ, వెస్టిండీస్ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో ఆడుతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వాంఖడే స్టేడియం నిశ్శబ్దంగా మారిపోయిందని, వెస్టిండీస్ వాసిని అయినందుకు గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు.

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్లెన్ మెక్‌గ్రాత్ దీనిపై స్పందిస్తూ.. ఆట చాలా బాగుందని, వెస్టిండీస్ జట్టు సభ్యులు తమ సంబరాల నుంచి బయటకు రావడానికి కనీసం రెండు రోజులు పడుతుందని అన్నాడు. టీమిండియాలో ఒకప్పటి భీకరమైన లెగ్‌స్పిన్నర్ అనిల్ కుంబ్లే భారతజట్టు ప్రదర్శన పట్ల కొంత నిరాశ చెందారు. వెస్టిండీస్ బాగానే ఆడిందంటూ, భారత జట్టు మాత్రం ఫీల్డులో అంత బాగోలేదని నిర్మొహమాటంగా చెప్పారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మొత్తం మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి, మన అదృష్టం బాగోలేదని చెప్పాడు. ఇది చాలా మంచి మ్యాచ్ అని, మనవాళ్లు బాగా పోరాడారని అన్నాడు. ఫైనల్స్‌లో పోరాడుతున్న వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు రెండింటికీ అభినందనలు చెప్పాడు. సిద్దార్థ మాల్యా స్పందిస్తూ.. మనవాళ్లు చాలా బాగా ఆడారని, ముఖ్యంగా టోర్నీ మొత్తం విరాట్ కోహ్లీ అదరగొట్టాడని ప్రశంసించాడు.

ఇక బాలీవుడ్ సంచలన దర్శకుడు మధుర్ భండార్కర్ తనదైన శైలిలో ఈ మ్యాచ్ గురించి చెప్పాడు. సినిమా బాక్సాఫీసు కలెక్షన్లు, క్రికెట్ మ్యాచ్ ఫలితం రెండింటినీ ఎవరూ ఊహించలేరని, మనవాళ్లు ఓడినందుకు చాలా బాధగా ఉంది గానీ, వెస్టిండీస్ బాగా ఆడిందని అన్నాడు. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా కూడా ఈ మ్యాచ్‌ తీరుపై స్పందించింది. మాట్లాడటానికి మాటలు ఏమీ మిగల్లేదని, వెస్టిండీస్ వాళ్లు బాగా ఆడారని చెప్పింది. మనవాళ్ల అదృష్టం బాగోలేదని వాపోయింది.

 

Advertisement
Advertisement