నల్లకలువ విశ్వరూపం | Sakshi
Sakshi News home page

నల్లకలువ విశ్వరూపం

Published Thu, Sep 5 2013 1:01 AM

నల్లకలువ విశ్వరూపం

దారిలో ఉన్న ఒక్కో ప్రత్యర్థిని అడ్డుతొలగించుకుంటూ...యూఎస్ ఓపెన్ చరిత్రలో టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా చరిత్ర సృష్టించేందుకు సెరెనా విలియమ్స్ మరో రెండు విజయాల దూరంలో నిలిచింది. 31 ఏళ్ల ఈ అమెరికన్ స్టార్... కార్లా నవారోతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో విశ్వరూపం చూపించింది. ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా 52 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది.
 
 న్యూయార్క్: మూడు పదుల వయసు దాటినా తన జోరు కొనసాగిస్తూ అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో దూసుకుపోతోంది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సెరెనా 6-0, 6-0తో 18వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)ను చిత్తు చేసింది. కేవలం 52 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా తన ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం.
 
 
  నాలుగు ఏస్‌లు సంధించిన ఈ టాప్ సీడ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. కేవలం తొమ్మిది అనవసర తప్పిదాలు చేసిన ఈ డిఫెండింగ్ చాంపియన్ 20 విన్నర్ షాట్స్‌ను నమోదు చేసింది. మ్యాచ్ మొత్తంలో నవారో రాకెట్ నుంచి మూడు విన్నర్ షాట్‌లు మాత్రమే రావడం సెరెనా స్పష్టమైన ఆధిపత్యానికి నిదర్శనం. పదునైన సర్వీస్‌లకుతోడు శక్తివంతమైన గ్రౌండ్ స్ట్రోక్స్‌తో చెలరేగిపోయిన సెరెనాకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. కెరీర్‌లో 53వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న సెరెనా ఈ మెగా ఈవెంట్స్‌లో 24వసారి సెమీఫైనల్ దశకు చేరుకుంది.
 
 గత 23 సెమీఫైనల్స్‌లో ఆమెను ముగ్గురు మాత్రమే (2000 వింబుల్డన్‌లో వీనస్ విలియమ్స్; 2003 ఫ్రెంచ్ ఓపెన్‌లో జస్టిన్ హెనిన్; 2009 యూఎస్ ఓపెన్‌లో క్లియ్‌స్టర్స్) ఓడించారు. ‘నేను చాలా బాగా ఆడాను. ఆటతీరు మెరుగుపర్చుకునేందుకు ప్రతిసారీ అవకాశం ఉంటుందని నమ్ముతాను. మ్యాచ్ ఆడే సమయంలో నా ప్రత్యర్థిపై ఎలాంటి జాలి చూపను. విజయం సాధించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగుతాను. ఈ అంశం తప్ప మరో ఆలోచనే ఉండదు’ అని కార్లా నవారో పుట్టిన రోజునే ఆమెను ఓడించిన తీరుపై స్పందిస్తూ సెరెనా వ్యాఖ్యానించింది.
 
 పెనెట్టా జోరు
 మరో క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ నా లీ (చైనా) 6-4, 6-7 (5/7), 6-2తో 24వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా)ను ఓడించి యూఎస్ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన తొలి చైనా క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో సెరెనాతో ఆడనున్న నా లీ ముఖాముఖి రికార్డులో 1-8తో వెనుకబడి ఉంది. మరో క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) తన జోరు కొనసాగిస్తూ 6-4, 6-1తో 10వ సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ)పై గెలిచింది.
 
 హెవిట్‌కు కళ్లెం
 పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జొకోవిచ్ 6-3, 6-0, 6-0తో గ్రానోలెర్స్ (స్పెయిన్)ను చిత్తు చేయగా... ముర్రే 6-7 (5/7), 6-1, 6-4, 6-4తో ఇస్టోమిన్ (ఉజ్బెకిస్థాన్)పై చెమటోడ్చి గెలిచాడు.
 
 జొకోవిచ్ వరుసగా ఏడోసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. మాజీ చాంపియన్, నంబర్‌వన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) జోరుకు మిఖాయిల్ యూజ్నీ (రష్యా) కళ్లెం వేశాడు. ఐదు సెట్‌లపాటు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 21వ సీడ్ యూజ్నీ 6-3, 3-6, 6-7 (3/7), 6-4, 7-5తో హెవిట్‌ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో తొమ్మిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 3-6, 6-1, 7-6 (8/6), 6-2తో ఐదో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను బోల్తా కొట్టించాడు.
 
 సెమీస్‌లో పేస్ జోడి
 పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం 6-1, 6-7 (3/7), 6-4తో ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్)-రోజర్ (నెదర్లాండ్స్) జంటపై గెలిచి సెమీస్‌కు చేరింది.
 
 సానియా జోడి కూడా...
 మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో 10వ సీడ్ సానియా మీర్జా (భారత్)-జెంగ్ జీ (చైనా) జోడి 6-4, 7-6 (7/5)తో నాలుగో సీడ్ సూ వీ సెయి (చైనీస్ తైపీ) -షుయె పెంగ్ (చైనా) జంటను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
 

Advertisement
Advertisement