Sakshi News home page

బంగార్రాజుకు మళ్లొకటి

Published Sat, Aug 20 2016 1:58 AM

బంగార్రాజుకు మళ్లొకటి

200 మీటర్ల రేసులో స్వర్ణం
ట్రిపుల్ ట్రిపుల్‌కు అడుగు దూరంలో బోల్ట్


ఒలింపిక్స్‌లో పరుగుల వీరుడికి మరో రికార్డు దాసోహమంది. 200మీటర్ల పరుగులోనూ బోల్ట్ స్వర్ణం సాధించి... మరో విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకూ ఒలింపిక్స్ చరిత్రలో బరిలోకి దిగిన ఎనిమిది ఈవెంట్లలో తనకు ఇది ఎనిమిదో స్వర్ణం కావడం విశేషం. ఇక 4ఁ100లోనూ స్వర్ణం సాధించి ట్రిపుల్ ట్రిపుల్‌తో ఒలింపిక్స్‌ను ఘనంగా ముగించడమే మిగిలింది.


రియో డీ జనీరో: జమైకా చిరుత ఉసేన్‌బోల్ట్ మరోసారి తన పరుగుతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులను ఉత్తేజపరిచేలా.. తన పరుగుకు స్వర్ణాభిషేకం చేశాడు. 100మీటర్ల తరహాలోనే ఏకపక్షంగా సాగిన 200 మీటర్ల పరుగులోనూ స్వర్ణం సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో జమైకా స్టార్‌కు ఇది ఎనిమిదో స్వర్ణం భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం జరిగిన రేసును బోల్ట్ 19.78 సెకన్లలో పూర్తి చేశాడు. కెనడా అథ్లెట్ ఆండ్రే డీ గ్రాస్సే 20.02 టైమింగ్‌తో రజతం, ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టోఫీ లెమైటర్ కాంస్యాన్ని అందుకున్నారు. ఈ విజయంతో మూడు వరుస ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు రేసులో మొదటి స్థానంలో నిలిచిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. అరుదైన ట్రిపుల్ ట్రిపుల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ‘నేను చేయటానికి ఇంకేం మిగల్లేదు. ప్రపంచంలో నేను గొప్పోణ్ని అని నిరూపించుకున్నాను. అందుకోసమే నేను ఇక్కడికొచ్చాను. ఇది నా చివరి ఒలింపిక్స్ అని ముందే ప్రకటించాను’ అని రేసు గెలిచిన అనంతరం బోల్ట్ తెలిపాడు. ఈ విజయంతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఒలింపిక్ అథ్లెట్‌గా ఫెల్ప్స్ సరసన బోల్ట్ చేరాడు. అయితే ప్రపంచ రికార్డు (19.19 సెకన్లు)ను చేరుకోవటం అంత సులభమేం కాదన్నాడు. ‘మేం ఇంతకన్నా వేగంగా పరిగెత్తలేమని నా కాళ్లు ముందే చెప్పేశాయి.


ఈ విజయంతో నేను సంపూర్తిగా తృప్తి చెందలేదు. అయినా నాకింకా 21 ఏళ్లు లేవుగా’ అని చమత్కరించాడు. అత్యుత్తమ ఒలింపియన్ ఎవరనే విషయంపై మాట్లాడేందుకు నిరాకరించాడు. ‘ట్రాక్ అండ్ ఫీల్డ్, స్విమ్మింగ్ పూర్తిగా వేర్వేరు అంశాలని చెప్పలేం. ఉత్తమ అథ్లెట్లలో ఒకరిగా ఫెల్ప్స్ నిరూపించుకున్నాడు. తన క్రీడలో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించాడు. మేమిద్దరం గొప్పవాళ్లమే’ అని బోల్ట్ తెలిపాడు. పనిలో పనిగా రెండుసార్లు డోపింగ్‌లో పట్టుబడ్డ అమెరికన్ అథ్లెట్ జస్టిన్ గాట్లిన్‌తోపాటు డోపింగ్‌కు పాల్పడే అథ్లెట్లపైనా విమర్శలు చేశాడు. ‘మనం క్లీన్‌గా ఉంటూనే రికార్డులు చేయవచ్చు, పతకాలు సాధించొచ్చని కఠిన పరిశ్రమ ద్వారా నేను నిరూపించాను. రన్నింగ్ రేసులను ప్రజలు ఆసక్తిగా చూసేలా చేశాను’అని బోల్ట్ అన్నాడు.

 

Advertisement
Advertisement