హామిల్టన్‌ హవా | Sakshi
Sakshi News home page

హామిల్టన్‌ హవా

Published Mon, Oct 1 2018 5:09 AM

Valtteri Bottas beats Lewis Hamilton to pole as Mercedes dominate - Sakshi

సోచి: సహచరుడు బొటాస్‌ సహకారం ఇవ్వడంతో ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్‌ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత 53 ల్యాప్‌లను హామిల్టన్‌ గంటా 27 నిమిషాల 32.054 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన బొటాస్‌ రెండో స్థానాన్ని పొందాడు. 25వ ల్యాప్‌ వరకు వెటెల్‌ (ఫెరారీ) తొలి స్థానంలో, బొటాస్‌ రెండో స్థానంలో, హామిల్టన్‌ మూడో స్థానంలో ఉన్నారు. ఈ దశలో హామిల్టన్‌కు ఓవర్‌టేక్‌ చేసే అవకాశం ఇవ్వాలని మెర్సిడెస్‌ జట్టు టీమ్‌ రేడియాలో బొటాస్‌ను ఆదేశించింది.

జట్టు ఆదేశాలను పాటించిన బొటాస్‌ వేగం తగ్గించి హామిల్టన్‌కు ఓవర్‌టేక్‌ చేసే అవకాశం ఇచ్చాడు. దాంతో రెండో స్థానానికి చేరిన హామిల్టన్‌ అదే జోరులో ఆధిక్యంలో ఉన్న వెటెల్‌ను కూడా వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి ల్యాప్‌ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని కెరీర్‌లో 70వ విజయాన్ని దక్కించుకున్నాడు. వెటెల్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్‌ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. 21 రేసుల ఈ సీజన్‌లో 16 రేసులు పూర్తయ్యాక హామిల్టన్‌ 306 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 256 పాయింట్లతో వెటెల్‌ రెండో స్థానంలో... 189 పాయింట్లతో బొటాస్‌ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 7న జరుగుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement