వెల్‌డన్‌... వెర్‌స్టాపెన్‌

29 Jul, 2019 02:21 IST|Sakshi

సీజన్‌లో రెండో టైటిల్‌ వశం

జర్మన్‌ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కు షాక్‌

హాకెన్‌హీమ్‌ : జర్మనీ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. 21 ఏళ్ల ఈ డచ్‌ యువ రేసర్‌ జర్మన్‌ ట్రాక్‌పై దుమ్మురేపాడు. రేసును అందరికంటే ముందుగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. 64 ల్యాపుల ఈ రేసులో అతనికి ఆదివారం బాగా కలిసొచ్చింది. మేటి రేసర్ల కార్లు ఢీకొనడం, వర్షం వల్ల గజిబిజిగా సాగిన ఈ రేసులో వెర్‌స్టాపెన్‌ చివరకు విజేతగా నిలిచాడు. అతను గంటా 44 నిమిషాల 31.275 సెకన్లలో పూర్తి చేసి ఈ సీజన్‌లో రెండో టైటిల్‌ సాధించాడు. ఓవరాల్‌గా అతని కెరీర్‌లో ఇది ఏడో విజయం. నాలుగుసార్లు ఫార్ములావన్‌ చాంపియన్‌షిప్‌ దక్కించుకున్న ఫెరారీ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌కు అందనంత వేగంగా కార్‌ను బుల్లెట్‌లా పరుగెత్తించాడు. దీంతో వెటెల్‌ 1గం:44ని:38.608 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.

టోరో రోసో డ్రైవర్‌ డానిల్‌ క్వియాట్‌ (1గం:44ని:39.580 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. డిఫెండింగ్‌ చాంపియన్, మెర్సిడెస్‌ స్టార్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌కు ఈ రేసు తీవ్ర నిరాశను మిగిల్చింది. తన కెరీర్‌లో 200వ రేసు బరిలోకి దిగిన హామిల్టన్‌ కారు ప్రమాదానికి గురవడంతో చాలా ఆలస్యంగా 1గం:44ని:50.942 సెకన్లలో రేసును పూర్తిచేశాడు. ప్రమాదంతో పాటు అగచాట్లతో ఆరు సార్లు అతని కారుకు బ్రేకులు పడ్డాయి. దీంతో కనీసం ఒక్క పాయింటైనా అతను పొందలేకపోయాడు. గత 23 రేసుల్లో ఈ మెర్సిడెస్‌ డ్రైవర్‌ పాయింట్‌ కూడా గెలవలేకపోవడం ఇదే మొదటిసారి. ఈ రేసులో పలువురి కార్లు ఢీకొనడంతో హేమాహేమీలైన డ్రైవర్లు అసలు రేసునే పూర్తి చేయలేకపోయారు. బొటాస్‌ (మెర్సిడెస్‌), హుల్కెన్‌బర్గ్‌ (రెనౌ), రికియార్డో (రెనౌ)లు రేసు నుంచి వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు ఆగస్టు 4న హంగేరి గ్రాండ్‌ప్రి జరుగుతుంది.    

>
మరిన్ని వార్తలు