వెటెల్ కొత్త చరిత్ర | Sakshi
Sakshi News home page

వెటెల్ కొత్త చరిత్ర

Published Tue, Nov 19 2013 2:41 AM

వెటెల్ కొత్త చరిత్ర

ఆస్టిన్: మరో రేసు... మరో విజయం... మరో రికార్డు... మూడు వారాల క్రితమే వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్న రెడ్‌బుల్ జట్టు స్టార్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ నామమాత్రమైన రేసుల్లోనూ దుమ్ము రేపుతున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యునెటైడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 39 నిమిషాల 17.148 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో వరుసగా ఎనిమిదో విజయాన్ని తన ఖాతాలో జమచేసుకున్నాడు. అంతేకాకుండా ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో ఒకే సీజన్‌లో వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన తొలి డ్రైవర్‌గా చరిత్ర సృష్టించాడు. దాంతో ఇప్పటిదాకా ఒకే సీజన్‌లో వరుసగా ఏడు విజయాలతో ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్ (జర్మనీ-2004లో) పేరిట ఉన్న రికార్డును వెటెల్ తిరగరాశాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో వెటెల్‌కిది 12వ విజయం కాగా... కెరీర్‌లో 38వ టైటిల్ కావడం విశేషం.
 ఈనెల 24న సీజన్‌లోని చివరిదైన రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలోనూ వెటెల్ గెలిస్తే మరో రెండు ప్రపంచ రికార్డులను సమం చేస్తాడు. ఎఫ్1 చరిత్రలో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన ఏకైక డ్రైవర్ అల్బెర్టో అస్కారి (ఇటలీ) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. అల్బెర్టో అస్కారి 1952 సీజన్‌లోని చివరి ఆరు రేసుల్లో... 1953 సీజన్ ఆరంభంలోని తొలి మూడు రేసుల్లో విజేతగా నిలిచాడు. ఒకే సీజన్‌లో అత్యధికంగా 13 విజయాలతో మైకేల్ షుమాకర్ (2004లో) పేరిట ఉన్న రికార్డునూ వెటెల్ సమం చేస్తాడు.
 ఫోర్స్ ఇండియాకు నిరాశ
 ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెటెల్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు.  తొలి ల్యాప్‌లోనే భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్  సుటిల్ కారుపై నియంత్రణ కోల్పోయి విలియమ్స్ జట్టు డ్రైవర్ పాస్టర్ మల్డొనాడో కారును ఢీకొట్టాడు. దాంతో సర్క్యూట్‌పై సేఫ్టీ కారు రంగప్రవేశం చేసింది. ఐదో ల్యాప్ మొదలయ్యే సమయానికి వెటెల్ ఆధిక్యం 1.9 సెకన్లకు చేరుకుంది. ఆ తర్వాత వెటెల్ వెనుదిరిగి చూడలేదు. ఓవరాల్‌గా వెటెల్ ఆరు సెకన్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. గ్రోస్యెన్ (లోటస్) రెండో స్థానంలో... వెబెర్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) నాలుగో స్థానంలో నిలిచారు. ఐదో స్థానం పొందిన ఫెరారీ జట్టు డ్రైవర్ అలోన్సో ఓవరాల్‌గా 227 పాయింట్లతో ఈ సీజన్‌లోని డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్ స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ‘ఫోర్స్’కే చెందిన మరో డ్రైవర్ పాల్ డి రెస్టా 15వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
 
 గర్వంగా ఉంది
 ‘‘ఒకే సీజన్‌లో వరుసగా ఎనిమిది రేసులు నెగ్గిన తొలి డ్రైవర్‌గా రికార్డు సృష్టించినందుకు గర్వంగా అనిపిస్తోంది. ఈ విజయాల సంఖ్య కారణంగా నేను కారులో నుంచి ఎగిరి గంతేయను. అయితే తాజా గెలుపుతో నేను ఓ అద్భుతం చేశానని గ్రహించాను. కొన్నేళ్ల తర్వాత మా ఘనతలపై కూడా అభిమానులు చర్చించుకుంటారు. నా రికార్డు వెనుక రెడ్‌బుల్ జట్టు బృందం కృషి ఎంతో ఉంది. వాస్తవానికి షుమాకర్ పేరిట ఉన్న రికార్డును ఎవరూ తిరగరాసే అవకాశం లేదని భావించారు. కానీ మేం దీనిని సాధ్యం చేశాం.’’
 -వెటెల్, రెడ్‌బుల్ డ్రైవర్
 
 
 
 

Advertisement
Advertisement