మన ‘పంచ్’ అదిరింది | Sakshi
Sakshi News home page

మన ‘పంచ్’ అదిరింది

Published Wed, Oct 23 2013 12:55 AM

మన ‘పంచ్’ అదిరింది

 అల్మాటీ (కజకిస్థాన్): తమ పంచ్ పవర్‌ను కొనసాగిస్తూ... భారత బాక్సర్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో దూసుకెళ్తున్నారు. మంగళవారం జరిగిన మూడు బౌట్‌లలో భారత్‌కు చెందిన ముగ్గురు బాక్సర్లూ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
 
  వికాస్ మలిక్ (60 కేజీలు), సుమీత్ సంగ్వాన్ (81 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) తమ ప్రత్యర్థులపై స్పష్టమైన విజయాలు నమోదు చేశారు. ఇప్పటికే శివ థాపా (56 కేజీలు), మనోజ్ కుమార్ (64 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
 
  ఫలితంగా ఈ మెగా ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్న భారత బాక్సర్ల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి ఐదుగురు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2011లో నలుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా వికాస్ కృషన్ కాంస్య పతకాన్ని అందించాడు. భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్)పై సస్పెన్షన్ ఉన్న నేపథ్యంలో ఈ పోటీల్లో భారత బాక్సర్లు అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) పతాకం కింద పోటీపడుతున్నారు.
 
 మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వికాస్ మలిక్ 3-0 (30-27, 29-28, 29-28)తో ఐదో సీడ్ మిక్లాస్ వర్గా (హంగేరి)ను బోల్తా కొట్టించగా... సుమీత్ సంగ్వాన్ 3-0 (3-27, 30-27, 30-27)తో ఎనిమిదో సీడ్ సియారి నొవికౌ (బెలారస్)పై సంచలనం విజయం సాధించాడు.
 
 మరో బౌట్‌లో సతీశ్ కుమార్ 3-0 (29-28, 29-28, 29-28)తో యాన్ సుద్జిలౌస్కీ (బెలారస్)ను ఓడించాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఇవాన్ దిచ్కో (కజకిస్థాన్)తో సతీశ్; కాన్సికావో (బ్రెజిల్)తో వికాస్ మలిక్; నియాజిమ్‌బెతోవ్ (కజకిస్థాన్)తో సుమీత్; చలాబియెవ్ (అజర్‌బైజాన్)తో శివ థాపా; యాస్నియెర్ లోపెజ్ (క్యూబా)తో మనోజ్ కుమార్ తలపడతారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement