మహారాష్ట్ర కల నెరవేరుతుందా! | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర కల నెరవేరుతుందా!

Published Wed, Jan 29 2014 1:00 AM

మహారాష్ట్ర కల నెరవేరుతుందా! - Sakshi

ఉ. గం. 9.30 నుంచి
 స్టార్‌స్పోర్ట్స్ 2లో
 ప్రత్యక్ష ప్రసారం
 
 సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో స్వాతంత్య్రానికి పూర్వం రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచిన మహారాష్ట్రకు ఇప్పుడు మరోసారి అరుదైన అవకాశం లభించింది. అద్భుత ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించిన మరాఠా జట్టు తమ 72 ఏళ్ల కలను నెరవేర్చుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డనుంది. అయితే కర్ణాటక రూపంలో ఆ జట్టుకు పటిష్టమైన ప్రత్యర్థి ఎదురుగా ఉంది. ఈ ఏడాది కర్ణాటక తిరుగు లేని విజయాలు సాధించి ఫామ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం 2013-14 సీజన్ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు తెర లేవనుంది. ఇరు జట్లు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం.
 
 సమష్టిగా రాణింపు...
 మూడేళ్ల క్రితం ‘ప్లేట్’ గ్రూప్‌లో ఆడిన రాజస్థాన్ ఏకంగా రంజీ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు మహారాష్ట్ర కూడా అదే స్ఫూర్తితో టైటిల్‌పై దృష్టి పెట్టింది. గ్రూప్ ‘సి’లో అగ్ర స్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించిన ఆ జట్టు క్వార్టర్ ఫైనల్లో ముంబైపై సంచలన విజయంతో సత్తా చాటింది. ఆ తర్వాత సెమీస్‌లో బెంగాల్‌ను మూడు రోజుల్లోనే చిత్తు చేసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ప్రతీ ఆటగాడు చక్కగా రాణించడంతో జట్టుకు ఈ విజయాలు దక్కాయి. కేదార్ జాదవ్, ఖడీవాలే, విజయ్ జోల్ ఈ జట్టులో కీలక బ్యాట్స్‌మెన్. బౌలింగ్‌లో ఫలా, దరేకర్ రాణించడం కీలకం. 1992-93 సీజన్‌లో ఆఖరి సారిగా ఫైనల్‌కు చేరి పంజాబ్ చేతిలో పరాజయం పాలైన మహారాష్ట్ర ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది.
 
 బ్యాటింగే బలం...
 మరో వైపు కర్ణాటక... అగ్రశ్రేణి జట్లు ఉన్న గ్రూప్ ‘ఎ’లో టాపర్‌గా నిలిచింది. లీగ్ దశలో పటిష్టమైన ముంబై, ఢిల్లీ, పంజాబ్‌లను చిత్తుగా ఓడించడం ఆ జట్టు ఫామ్‌కు నిదర్శనం. గతంలో ఆరు సార్లు రంజీ ట్రోఫీని గెలుచుకున్న కర్ణాటక ఆఖరిసారిగా 1998-99లో విజేతగా నిలిచింది. కర్ణాటక బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. కేఎల్ రాహుల్, మనీశ్ పాండే , కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడుతున్నారు. ఉతప్ప, గౌతమ్‌లతో జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. కెప్టెన్ వినయ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
 
 ఫైనల్ మ్యాచ్ కోసం మైదానంలోని మూడో వికెట్‌ను ఎంపిక చేశారు. ఆరంభంలో బౌన్స్, ఆ తర్వాత నెమ్మదిస్తూ ఐదు రోజుల పాటు నిలిచి ఫలితం వచ్చే ‘స్పోర్టింగ్ పిచ్’ను తీర్చిదిద్దినట్లు క్యురేటర్ వెల్లడించారు. ఇదే వికెట్‌పై జరిగిన హైదరాబాద్, కేరళ లీగ్ మ్యాచ్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement