దూషించిన బౌలర్‌కు కోహ్లి గిఫ్ట్‌! | Sakshi
Sakshi News home page

దూషించిన బౌలర్‌కు కోహ్లి గిఫ్ట్‌!

Published Thu, Apr 12 2018 7:09 PM

Virat Kohli gifts his bat to Nitish Rana after abusing conflict - Sakshi

కోల్‌కతా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన మనసుకు నచ్చిన వ్యక్తులకు కానుకలు ఇస్తుంటాడు. గతంలో ఇంగ్లండ్ మహిళ క్రికెటర్ డానియల్‌ వ్యాట్‌కు విరాట్ అప్పట్లో తన పేరుతో ఉన్న బ్యాట్‌ని బహుమానంగా ఇచ్చాడు. ఆ బ్యాట్‌తో వైట్ పలు సంచలన రికార్డులు సృష్టించింది వ్యాట్‌. ఆ తర్వాత పాక్‌ ఆటగాళ్లు మహ్మద్‌ అమిర్‌కు, షాహిద్‌ ఆఫ్రిదిలకు సైతం వేర్వేరు సందర్భాల్లో కోహ్లి గిఫ్ట్‌లు ఇచ్చాడు. అయితే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో తన వికెట్‌ తీసిన తర్వాత అసభ్యపదజాలం ఉపయోగించిన బౌలర్‌కు కోహ్లి బ్యాట్‌ను కానుకగా ఇవ్వడం చర్చనీయాంశమైంది.

ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో తనని ఔట్ చేసిన యువ బౌలర్ నితీష్ రానాకు విరాట్ బ్యాట్‌ని బహుమానంగా ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని రానా తన అభిమానులతో పంచుకున్నాడు. ‘ఎప్పుడైతే గొప్పవాళ్లు నిన్ను అభినందిస్తున్నారో.. అప్పుడు నువ్వు సరైన పని చేస్తున్నట్టు’ అని రానా పేర్కొన్నాడు.
 
కాగా, విరాట్ వికెట్ తీసిన తర్వాత రానా ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. విరాట్ వికెట్ తీసిన తర్వాత రానా ఆ ఆనందంలో అసభ్య పదాలతో దూషించాడు. ఇప్పుడే క్రికెట్‌లో వెలుగులోకి వస్తున్న రానా తన నోటికి పని చెప్పి అసభ్యపదజాలాన్ని వాడటంపై విరాట్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయల్స్‌ చాలెంజర్స్‌ ఇన్నింగ్స్‌లో భాగంగ తొలుత ఏబీ డివిలియర్స్‌ను ఔట్‌ చేసిన రానా..ఆ మరుసటి బంతికి కోహ్లిని బౌల్డ్‌ చేశాడు. దాంతో నిగ్రహాన్ని కోల్పోయిన రానా.. కోహ్లి వైపు చూస్తూ అసభ్యపదజాలం ఉపయోగించాడు.  అయితే ఇప్పుడు అదే బౌలర్‌కు కోహ్లి కానుక ఇచ్చి అభినందించడం అతని గొప్పతనాన్ని చాటి చెబుతోందని ఫాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement