'ఆ అవార్డును కోహ్లి షేర్ చేసుకోవాల్సింది' | Sakshi
Sakshi News home page

'ఆ అవార్డును కోహ్లి షేర్ చేసుకోవాల్సింది'

Published Sun, Sep 24 2017 12:22 PM

Virat Kohli Should Have Shared Man of the Match Award With Kuldeep Yadav

కోల్కతా: అంతర్జాతీయ క్రికెట్ లో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్ చేతన శర్మ. 1987లో జరిగిన వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ వికెట్లను చేతన్ శర్మ సాధించి తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. అయితే  తాజాగా ఆసీస్ తో  రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ నమోదు చేయడంపై చేతన్ శర్మ ప్రశంసలు కురిపించాడు. కాగా, హ్యాట్రిక్ వికెట్లు సాధించినప్పటికీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులో కుల్దీప్ యాదవ్ భాగం కాలేకపోవడంపై చేతన్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'ఆసీస్ తో మ్యాచ్ లో కుల్దీప్ హ్యాట్రిక్ సాధించినా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రాకపోవడం బాధగా అనిపించింది. ఆ మ్యాచ్ లో కోహ్లిని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. కోహ్లి తరుచుగా పరుగులు చేస్తూనే ఉన్నాడు. హ్యాట్రిక్ అనేది చాలా అరుదుగా జరిగేది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కుల్దీప్ తో కలిసి కోహ్లి షేర్ చేసుకోవాల్సింది'అని ఆనాటి తన హ్యాట్రిక్ కు లెజెండ్ సునీల్ గావస్కర్ తో కలిసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును పంచుకోవడాన్ని చేతన్ శర్మ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

'ఆనాటి మ్యాచ్ లో గావస్కర్ సెంచరీ చేయగా, నేను హ్యాట్రిక్ సాధించా. ఇద్దరం కలిసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును పంచుకున్నాం. దిగ్గజ ఆటగాడు గావస్కర్ తో కలిసి అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ రోజు కుల్దీప్ విషయంలో కూడా అలా జరిగితే బాగుండేది. కోహ్లితో కలిసి కుల్దీప్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును పంచుకోవాల్సింది'అని చేతన్ పేర్కొన్నాడు. దాదాపు 26 ఏళ్ల తరువాత వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన భారత బౌలర్ కుల్దీప్ అంటూ అతనిపై పొగడ్తల వర్షం కురిపించాడు. 1991లో కపిల్ దేవ్ చివరిసారి భారత తరపున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన బౌలర్ అని, అటు తరువాత కుల్దీప్ ఆ ఘనతను అందుకున్నాడంటూ చేతన్ శర్మ అభినందనలు తెలియజేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement