కోహ్లి మళ్లీ కొట్టేశాడు.. | Sakshi
Sakshi News home page

కోహ్లి మళ్లీ కొట్టేశాడు..

Published Fri, Mar 8 2019 8:30 PM

Virat Kohligets Another Century  - Sakshi

రాంచీ: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి మరో శతకం బాదేశాడు. శుక్రవారం జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లి సెంచరీ సాధించాడు. 85 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో  కోహ్లి శతకం సాధించాడు. ఇది కోహ్లికి వన్డే కెరీర్‌లో 41వ సెంచరీ.  ఆసీస్‌ నిర్దేశించిన 314 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.  ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ వికెట్లతో పాటు అంబటి రాయుడు వికెట్‌ను కూడా భారత్‌ చేజార్చుకుంది. ధావన్‌(1) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, రోహిత్‌ శర్మ(14) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో ధావన్‌ ఔట్‌ కాగా, ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఎల్బీగా పెవిలియన్‌ బాట పట్టాడు.

అటు తర్వాత రాయుడు(2)ను కమిన్స్‌ బౌల్డ్‌ చేశాడు. దాంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ తరుణంలో కోహ్లి-ధోనిల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ నాల్గో వికెట్‌ 59 పరుగులు సాధించిన తర్వాత ధోని(26) ఔటయ్యాడు. ఆ తర్వాత జాదవ్‌తో కలిసి 88 పరుగుల్ని కోహ్లి జత చేశాడు. కాగా, జట్టు స్కోరు 174 పరుగుల వద్ద జాదవ్‌ ఔట్‌ కాగా, విజయ్‌ శంకర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ క్రమంలోనే కోహ్లి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న కోహ్లి 123 వ్యక్తిగత స్కోరు వద్ద ఆరో వికెట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు. గత వన్డేలో కూడా కోహ్లి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement