కోహ్లిలాగా ఎదగాలనుంది: బాబర్‌ | Sakshi
Sakshi News home page

కోహ్లిలాగా ఎదగాలనుంది: బాబర్‌

Published Tue, Mar 14 2017 10:51 PM

కోహ్లిలాగా ఎదగాలనుంది: బాబర్‌

లాహోర్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలాగా క్రికెట్‌ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నట్లు పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ తన కోరికను వెలిబుచ్చాడు. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సంబంధించి ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొన్న బాబర్‌ మీడియాతో పైవిధంగా మాట్లాడాడు. విరాట్‌లాగా తాను ఆడకపోయినప్పటికీ., తన బ్యాటింగ్‌ శైలి కోహ్లికి భిన్నంగా ఉన్నప్పటికీ అతని లాగా జట్టు కోసం విజయవంతమైన ఇన్నింగ్స్‌ ఆడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

జట్టు విజయంలో తాను కీలకమవ్వాలని అభిలషిస్తున్న బాబర్‌.. ఇందుకోసం తాను చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నదని తెలిపాడు. అయితే అందుకు తగిన విధంగా సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. వెటరన్లు యూనిస్‌ ఖాన్, మిస్బావుల్‌ హక్‌ రిటైరైన తర్వాత వారిస్థానంలో జట్టులో పాతకుపోవడాని ఎదురు చూస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. పాక్‌కు చెందిన ఈ 22 ఏళ్ల బ్యాట్స్‌మన్‌కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. ఓవరాల్‌గా 23 వన్డేలు ఆడిన బాబర్‌.. 53 సగటుతో నాలుగు సెంచరీలు చేశాడు. మరోవైపు నాలుగు టీ20లు, నాలుగు టెస్టులు కూడా ఆడాడు. పాక్‌ కోచ్‌ మికీ ఆర్ధర్‌ .. బాబర్‌లోని ప్రతిభను కోహ్లితో పోల్చిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement