గంగూలీని అధిగమించగలడు: సెహ్వాగ్ | Sakshi
Sakshi News home page

గంగూలీని అధిగమించగలడు: సెహ్వాగ్

Published Sat, Dec 3 2016 11:19 AM

గంగూలీని అధిగమించగలడు: సెహ్వాగ్

న్యూఢిల్లీ:ఇటీవల కాలంలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా క్రికెట్పై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ టెస్టు జట్టు.. విదేశాల్లో కూడా విజయాలు సాధించే నమ్మకాన్ని కూడబెట్టుకుందని కొనియాడాడు. ఇదే క్రమంలో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్రత్యేకంగా సెహ్వాగ్ అభినందించాడు. 'స్వదేశంలో విరాట్ సారథ్యంలోని భారత జట్టు అజేయంగా ఉంది. అదే విజయపరంపరను విదేశాల్లో కూడా కొనసాగించే జట్టు ఇది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నాణ్యమైన టెస్టు జట్టు విరాట్ కోహ్లికి ఉంది. ఇక విదేశాల్లో విజయాలను సాధించడానికి అపసోపాలు పడాల్సిన అవసరం లేదనుకుంటున్నా.


2002-04 సీజన్లో గంగూలీ నేతృత్వంలోని భారత్ జట్టు ఏ స్థాయిలో విజయాలు సాధించిందో.. అదే స్థాయిలో ప్రస్తుత జట్టు కూడా విజయాలకు బాట పడుతుంది. టెస్టు కెప్టెన్ గా విదేశాల్లో గంగూలీ సాధించిన ఘనతను విరాట్ కోహ్లి అధిగమించగలడు. ప్రత్యేకంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో ఆనాటి గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు అనేక ఘన విజయాలను సాధించింది. ఆ ఘనతను కోహ్లి చేరడానికి ఎంతో సమయం లేదు. ప్రధానంగా భారత పేస్ బౌలింగ్ బలం బాగా మెరుగుపడటమే ఇందుకు కారణం. మంచి బౌలింగ్తో సత్తా చాటితే విదేశాల్లో విజయాలు ఏమాత్రం కష్టం కాదు. ఇప్పుడు మొహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ తదితర ఫాస్ట్ బౌలర్లతో కూడిన జట్టు భారత్కు ఉంది' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

 

ఇదిలా ఉండగా, ఇంగ్లండ్తో మూడో టెస్టుకు  రిషబ్ పంత్ను కాదని పార్థీవ్ ఎంపికను సమర్ధించిన సెహ్వాగ్.. మరోసారి అదే నిర్ణయానికి కట్టుబట్టాడు. కచ్చితంగా ఏదొక రోజు రిషబ్ పంత్ భారత జట్టుకు ఆడతాడని పేర్కొన్న సెహ్వాగ్.. అతను ఇంకా కొంత సమయం ఓపిక పట్టక తప్పదన్నాడు.  తన క్రికెట్ జర్నీలో దేశవాళీ టోర్నీలో నిలకడగా ప్రదర్శనలు చేసిన వారు చాలా మంది ఉన్నారని, అదే సమయంలో వారికి తగినంత గౌరవం కూడా లభించలేదని ఆనాటి విషయాల్ని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement