Sakshi News home page

సమవుజ్జీల సమరం

Published Wed, Sep 17 2014 12:46 AM

సమవుజ్జీల సమరం

సాక్షి, హైదరాబాద్: రెండు జట్లలోనూ కావలసినంత మంది స్టార్ ఆటగాళ్లు... అనుభవం, యువతరంతో ఇరు జట్లలోనూ కావలసినంత సమతూకం... పైగా ఐపీఎల్‌లో పరస్పరం తలపడటం వల్ల ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు ఇద్దరికీ తెలుసు. ఈ నేపథ్యంతో చాంపియన్స్ లీగ్ ప్రధాన మ్యాచ్‌ల తొలిపోరుకు కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమయ్యాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో బుధవారం జరిగే ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. 
 నరైన్ మ్యాజిక్‌పై ఆశలు
 ఐపీఎల్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈ సారి గాయాలు కాస్త ఇబ్బందికరంగా మారాయి. క్రిస్ లిన్, మోర్నీ మోర్కెల్ గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. మరోవైపు బంగ్లాదేశ్ బోర్డు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వని కారణంగా షకీబ్ అల్ హసన్ టోర్నీలో ఆడటం లేదు. గంభీర్ సారథ్యంలోని ఈ జట్టు ప్రధానంగా యూసుఫ్ పఠాన్, ఉతప్ప, మనీష్ పాండే లాంటి దేశీయ బ్యాట్స్‌మెన్‌పై ఆధారపడింది. బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ కలిస్, టెన్ డస్కటే, పేసర్ కమ్మిన్స్‌తో పాటు అత్యంత కీలకం సునీల్ నరైన్. తన కోటా నాలుగు ఓవర్లతో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల నరైన్‌పై కోల్‌కతా మరోసారి ఆశలు పెట్టుకుంది. ఇక ఉమేశ్, వినయ్‌లలో ఒకరు మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. . 
 సమతూకంతో ధోని సేన
 మరోవైపు ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మంచి సమతూకంతో కనిపిస్తోంది. గాయం కారణంగా ఐపీఎల్ పూర్తిగా ఆడలేకపోయిన వెస్టిండీస్ స్టార్ డ్వేన్ బ్రేవో ఈసారి జట్టుకు పెద్ద బలం. మెకల్లమ్, డు ప్లెసిస్, డ్వేన్ స్మిత్‌లతో ముగ్గురు నాణ్యమైన విదేశీ బ్యాట్స్‌మెన్ అందుబాటులో ఉన్నారు. అలాగే రైనా, ధోనిల రూపంలో ఇద్దరు అద్భుతమైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఆల్‌రౌండర్లు అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ బాధ్యత తీసుకుంటారు. ఇక పేసర్లుగా ఈశ్వర్ పాండే, మోహిత్ శర్మ, నెహ్రా తుది జట్టులో ఉండొచ్చు. మొత్తం మీద చెన్నై జట్టు బాగా పటిష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 11 మంది ఆటగాళ్లు బరిలోకి దిగడం ఈ జట్టుకు లాభించే అంశం.
 
 
 
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement