రెండు వారాల ముందే... | Sakshi
Sakshi News home page

రెండు వారాల ముందే...

Published Fri, Nov 21 2014 12:33 AM

రెండు వారాల ముందే...

తొలి టెస్టుకు ఆసీస్ జట్టు ప్రకటన రేపు
మెల్‌బోర్న్: సాధారణంగా సొంతగడ్డపై జరిగే టెస్టు మ్యాచ్‌లకు ఏ జట్టయినా రెండు, మూడు రోజుల ముందు జట్టును ఎంపిక చేస్తుంది. అయితే మార్కెటింగ్ కారణాలతో భారత్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టును ముందే ఎంపిక చేయనున్నారు.  డిసెంబర్ 4నుంచి బ్రిస్బేన్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం  సెలక్టర్లు శనివారం జట్టును ప్రకటించనున్నారు. అయితే ఇది తమ నిర్ణయం కాదని, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమపై ఒత్తిడి తెచ్చిందని సెలక్టర్లలో ఒకడైన మార్క్‌వా వెల్లడించాడు.

‘తొలి టెస్టు కోసం శనివారం టీమ్‌ను ఎంపిక చేయనున్నాం. వాస్తవానికి మంగళవారంనుంచి ప్రారంభమయ్యే రెండో దశ షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌ల అనంతరం జట్టును ప్రకటించాలని భావించాం. అయితే మార్కెటింగ్ ప్రయోజనాల కోసం జట్టును ముందుగా ఎంపిక చేయమని సీఏ ఆదేశించింది’ అని వా చెప్పాడు.
 
క్లార్క్‌పై మళ్లీ సందేహం!
తొలి టెస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చిన మరుసటి రోజే అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. దీనిపై రోజుకో మాట వినిపిస్తోంది. మంగళవారంనుంచి జరిగే షెఫీల్డ్ గేమ్‌నుంచి క్లార్క్ తప్పుకోవడంతో అతను మొదటి టెస్టు ఆడేది అనుమానంగా మారింది.  క్లార్క్ ఆడాలని టీమ్ మేనేజ్‌మెంట్ గట్టిగా కోరుకుంటున్నా...అతను ఎప్పుడు తిరిగి ఆడగలడనేదానిపై స్పష్టత లేదు.

ఈ ఏడాది ఆగస్టునుంచి మూడు సార్లు క్లార్క్ తొడ కండరానికి గాయమైంది. ఈ గాయం అంత తొందరగా తగ్గదని ఆసీస్ జట్టు ఫిజియో అలెక్స్ కాంటూరిస్ అన్నారు. ‘క్లార్క్ బ్యాటింగ్ చేయలేకపోవడంతో పాటు కనీసం పరుగెత్తలేకపోతున్నాడు కూడా’ అని ఆయన చెప్పారు. గతంలో జరిగిన విధంగా కోలుకునేందుకు కనీసం ఆరు వారాలు పడితే మెల్‌బోర్న్‌లో జరిగే మూడో టెస్టుకు గానీ క్లార్క్ మ్యాచ్ ఫిట్‌నెస్‌తో సిద్ధం కాలేడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement