మా ఓటమికి కారణం అదే : కోహ్లి | Sakshi
Sakshi News home page

మా ఓటమికి కారణం అదే : కోహ్లి

Published Mon, Oct 23 2017 11:13 AM

 we Would have liked to have a better batting performance, says kohli

ముంబై: వన్డేల్లో వరుస విజయాలతో ఊపు మీదున్న భారత్‌ను న్యూజిలాండ్‌ నిలువరించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో కివీస్‌ 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (125 బంతుల్లో 121; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో 31వ సెంచరీతో చెలరేగగా... ట్రెంట్‌ బౌల్ట్‌ (4/35) భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం న్యూజిలాండ్‌ 49 ఓవర్లలో 4 వికెట్లకు 284 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అయితే తమ ఓటమికి కారణాన్ని విశ్లేషించుకునే పనిలో పడ్డాడు కెప్టెన్ కోహ్లి.

' మా ఓటమికి పూర్తి స్థాయి బ్యాటింగ్ చేయకపోవడమే ప్రధాన కారణం. ఇంకా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి ఉంటే మరిన్ని పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచగలిగే వాళ్లం. చివరి 13 నుంచి 14 ఓవర్ల పాటు  మా బ్యాటింగ్ బాగుంది. కానీ మేము అనుకున్న దానికంటే 20-30 పరుగులు తక్కువే చేశాం. మేము లక్ష్యాన్ని నిర్దేశించిన దానికి మరో 40 పరుగులు అదనంగా చేయాల్సింది. మా టాపార్డర్ విఫలం కావడం వల్ల అనుకున్న పరుగుల్ని సాధించలేకపోయాం. ఇదే మా ఓటమిపై ప్రభావం చూపింది'అని మ్యాచ్ అనంతరం కోహ్లి విశ్లేషించాడు.

ఇదిలా ఉంచితే, రెండొంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్సి కివీస్ కు శుభారంభాన్ని అందించిన టామ్ లాథమ్-రాస్ టేలర్ లపై కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు.ఇక్కడ 275 పరుగులు మంచి స్కోరు అనుకున్నప్పటికీ, దాన్ని లాథమ్-టేలర్ తిప్పికొట్టారన్నాడు. తమకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించారన్నాడు. కచ్చితంగా న్యూజిలాండ్ గెలుపు వారిద్దరిదే అనడంలో ఎటువంటి సందేహం లేదని కోహ్లి కొనియాడాడు.

Advertisement
Advertisement