పాకిస్తాన్ అంటే ఇప్పటికీ వణుకే! | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ అంటే ఇప్పటికీ వణుకే!

Published Fri, Jan 13 2017 11:30 AM

పాకిస్తాన్ అంటే ఇప్పటికీ వణుకే!

బార్బడోస్: పాకిస్తాన్ లో పర్యటించేందుకు  వెస‍్డిండీస్ క్రికెట్ బోర్డు మరోసారి నిరాకరించింది. తమ ఆటగాళ్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ ఆతిథ్యాన్ని స్వీకరించాలని అంతర్జాతీయ క్రికెటర్ల సమాఖ్య(ఎఫ్ఐసీఏ) వెస‍్డిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ)కు ప్రతిపాదనలు పంపింది. దీనిపై స్పందించిన విండీస్ బోర్డు.. పాక్ వెళ్తే మా ఆటగాళ్లకు ఎవరు భద్రత కల్పిస్తారు. ఇంకా చెప్పాలంటే వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే పీఎస్ఎల్ సందర్భంగా పాక్ లో పర్యటించాలని ఉందని ఆండ్రీ రస్సెల్ వ్యాఖ్యానించగా, సెక్యూరిటీ కల్పిస్తే తనకు ఏ అభ్యంతరం లేదని అప్పటి విండీస్ కెప్టెన్ డారెన్ సమీ ప్రకటించాడు.

విండీస్ జట్టు తమ దేశంలో పర్యటించాలని టెస్ట్, వన్డే సిరీస్ లకు సంసిద్ధం కావాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కొన్ని రోజుల కిందట విండీస్ బోర్డుకు లేఖ రాసింది. ఇందుకు స్పందించిన విండీస్ బోర్డు అధికారులు.. తటస్థవేదిక అమెరికాలోని ఫ్లోరిడాలో అయితే తమకు ఏ సమస్య ఉండదని పీసీబీకి వెల్లడించింది. ఆటగాళ్ల భయాలు వారికి ఉన్నాయి కానీ, ముందుగా పాక్ లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిపాలని, దీనిపై సలహా ఇవ్వాలంటూ ఎఫ్ఐసీఏను విండీస్ బోర్డు కోరింది. చివరగా మార్చి నుంచి మే మధ్య పాక్ జట్టు కరీబియన్ లో పర‍్యటించాలని సూచించింది. రెండు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడేందుకు రావాలని షెడ్యూలు ఖరారు చేసింది.


2009లో పాక్ లో పర్యటన సందర్భంగా శ్రీలంక ఆటగాళ్లపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. లాహార్ లో బస్సులో వెళ్తున్న లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి కుట్ర జరిగింది. దీంతో అప్పటినుంచీ ఏ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ లో పర్యటించేందుకు ఆసక్తి చూపడం లేదు. తమ ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికలలోనే పాక్ తమ క్రికెట్ మ్యాచ్ లను నెట్టుకొస్తుంది. అయితే తమకు ఆదాయం రావాలంటే క్రికెట్ ఆడే దేశాలు కనికరం చూపాలని పాక్ బోర్డు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం కనిపించడం లేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement