యువీ ఆశ తీరలేదా? | Sakshi
Sakshi News home page

యువీ ఆశ తీరలేదా?

Published Tue, Dec 22 2015 5:55 PM

యువీ ఆశ తీరలేదా?

ముంబై:సుమారు 20 నెలల తరువాత భారత జాతీయ క్రికెట్ జట్టుకు యువరాజ్ సింగ్ ఎంపికైనా అది అతనికి  సంతృప్తినిచ్చినట్లు కనపడట్లేదు. వచ్చేనెలలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా వన్డే జట్టులో యువరాజ్‌కు చోటు దక్కకపోవడం అతడిని తీవ్ర నిరాశకు గురి చేసింది. భారత జట్టులో పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలనుకున్న యువరాజ్‌ను టి-20లకు ఎంపికచేసి సెలక్టర్లు కొంతవరకూ న్యాయం చేసినా, వన్డేలకు ఎంపిక చేయకపోవడం అతనికి నిరాశనే మిగిల్చింది. వన్డేలలో యువీ.. ఇటీవలి కాలంలో బాగానే రాణించాడు.

దీనికి ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే వన్డే ట్రోఫీనే ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో యువరాజ్ ఐదు మ్యాచ్‌లు ఆడి 341 పరుగులు చేశాడు. మూడు హాఫ్ సెంచరీల సాయంతో 85.25 సగటు నమోదు చేశాడు. ఇందులో రెండుసార్లు 90 పరుగుల మార్కును కూడా చేరాడు. దీంతో యువరాజ్‌కు వన్డేల్లో స్థానం దక్కే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అయితే చివరకు మూడు టి-20 మ్యాచ్‌ల సిరీస్‌కే యువీని పరిమితం చేశారు.

ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలుత వన్డేలు జరగనున్నాయి. దీంతో తన అదృష్టాన్నిపరీక్షించుకునేందుకు ట్వంటీ 20 సిరీస్ వరకూ యువరాజ్ వేచిచూడక తప్పదు. ఆస్ట్రేలియా టూర్ లో భారత్ ఐదు వన్డేలు ఆడనుంది. 50 ఓవర్ల ఫార్మాట్ అయిన వన్డేల్లో దాదాపు అందరు ఆటగాళ్లు తమ ప్రతిభను పరిక్షించుకోవాడానికి అవకాశం ఉంటుంది. కానీ ట్వంటీ 20లలో  హిట్టింగే ప్రధానం. దీంతో తమ ఫామ్‌ను అందుకోవడానికి ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించాలి. ఈ తరుణంలో యువరాజ్ ఎలా నెట్టుకొస్తాడనేది చూడాల్సిందే.


మరోసారి జడేజా నుంచే పోటీ..
2015 వన్డే వరల్డ్ కప్ లో యువరాజ్ కు చోటు దక్కకపోవడానికి రవీంద్ర జడేజానే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఆల్ రౌండర్ల కోటాలో ధోనికి అత్యంత సన్నిహితంగా ఉండే జడేజాకు చోటు దక్కింది. యువరాజ్-జడేజాల ఎంపికపై చివరి వరకూ ఎంతో ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు జరిగిన ఆసీస్ సిరీస్ లో జడేజా గాయపడటంతో వరల్డ్ కప్ కు యువీ పేరు వినిపించింది. కాగా, గాయం నుంచి జడేజా పూర్తిగా కోలుకోవడంతో యువీ ఆశలు గల్లంతయ్యాయి. వరల్డ్ కప్ సమయం నాటికి  యువరాజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. రంజీల్లో మూడు సెంచరీలతో పాటు, ఒక అర్ధసెంచరీ నమోదు చేయడంతో యువరాజ్ ఎంపిక ఖాయంగానే కనబడింది. అయితే బౌలింగ్ విషయంలో యువరాజ్ కంటే జడేజానే మెరుగ్గా ఉన్నాడని భావించిన ధోని.. యువరాజ్ ను పక్కకు పెట్టాడు. అప్పుడు యువరాజ్ కు అన్యాయం  జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపించాయి.


ప్రస్తుత ఆస్ట్రేలియా టూర్ కు ఎంపికైన భారత వన్డే, ట్వంటీ 20 జట్టులో రవీంద్ర జడేజాకు చోటుదక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో 23 వికెట్లు తీసి జడేజా శభాష్ అనిపించుకోవడమే కాకుండా, అంతకుముందు రంజీల్లో కూడా విశేషంగా రాణించాడు. దీంతో ఆస్ట్రేలియా టూర్ కు వన్డే జట్టులో యువీని పక్కకు పెట్టి జడేజాను తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది ట్వంటీ 20 వరల్డ్ కప్ జరగనుంది. అప్పటికి మరింతమంది ఆటగాళ్లను పరిక్షీంచాల్సిన అవసరం ఉందని గతంలోనే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. దీంతో ట్వంటీ 20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకునే యువరాజ్ ను  ఎంపిక చేసినట్లు కనబడుతోంది. ఆసీస్ టూర్ లో యువరాజ్ సత్తా చాటితే వరల్డ్ కప్ కు అతడి ఎంపిక అనివార్యం. ఒకవేళ యువరాజ్ విఫలమైతే అతని కెరీర్ మరోసారి డైలామాలో పడే అవకాశం ఉంది.

2014 ఏప్రిల్ 6న టి20 ప్రపంచకప్ శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ లో... చివరి 21 బంతుల్లో యువరాజ్ 11 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో దశాబ్ద కాలానికి పైగా మ్యాచ్ విన్నర్‌గా ఉన్న యువీపై అభిమానులంతా విరుచుకుపడ్డారు. భారత్ ఓటమికి అతనే కారణమయ్యాడని అన్నివైపుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఆ మ్యాచ్ తర్వాత యువరాజ్ మళ్లీ టీమిండియా తరఫున ఆడలేకపోయాడు. 2014 ఐపీఎల్‌లో రూ. 14 కోట్లు, 2015లో రూ. 16 కోట్లు విలువ పలికినా ఆటలో మాత్రం మునుపటి పదును కనిపించలేదు. అయితే యువీ పోరాటం ఆపలేదు. ఒక పక్క కేన్సర్ ను జయించిన యువీ.. క్రికెట్ లో కూడా మెరుగ్గా రాణిస్తూనే ఉన్నాడు.

Advertisement
Advertisement