కివీస్ ను శ్రీలంక నిలువరించేనా? | Sakshi
Sakshi News home page

కివీస్ ను శ్రీలంక నిలువరించేనా?

Published Fri, Feb 13 2015 1:58 PM

will srilanka stop new zealand?

క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్.. ప్రప్రంచకప్ హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటి. గడిచిన నాలుగు వరల్డ్ కప్ టోర్నీల్లో నాలుగు సార్లు సెమీ ఫైనల్  వరకూ వెళ్లిన జట్టు. ఈసారి మాత్రం కచ్చితంగా వరల్డ్ కప్ ను చేజిక్కించుకోవాలనే కృత నిశ్చయంతో ఉంది. వరల్డ్ కప్ కు ముందు  జరిగిన వార్మప్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి తమ ఉద్దేశం ఎంత బలంగా ఉందనేది ఇప్పటికే చాటి చెప్పింది.  గత సంవత్సరం  వరుస విజయాలతో రికార్డు సృష్టించిన కివీస్ ను న్యూజిలాండ్ ను శ్రీలంక నిలువరిస్తాందా?లేదా అనేది మాత్రం కచ్చితంగా ఆసక్తికరమే.  ఇరు జట్ల మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కివీస్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.


ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ సంయుక్తం ఆతిథ్యం ఇస్తున్న 11 వ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ స్వదేశంలో జరగడం న్యూజిలాండ్ కు కలిసొచ్చే  అంశంగానే చెప్పాలి. ఆ జట్టులో ఓపెనర్లతో పాటు, మిడిల్ ఆర్డర్, టెయిలెండర్లు కూడా రాణిస్తుండటం వారి వరల్డ్ కప్ ఆశలను రెట్టింపు  చేస్తోంది. ఇదిలా ఉండగా శ్రీలంక మాత్రం పేలవమైన ఫామ్ తో ఉంది. గత నెల్లో ఇరు జట్ల మధ్య జరిగిన ఆరు వన్డేల సిరీస్ లో శ్రీలంక  ఘోరంగా చతికిలబడింది. కేవలం రెండు మ్యాచ్ లను మాత్రమే గెలిచిన శ్రీలంక.. నాలుగు వన్డేలను కివీస్ కు అప్పజెప్పి ఆ సిరీస్ ను  కోల్పోయింది. ఇదిలా ఉండగా వరల్డ్ కప్ ఆరంభానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో అండర్ డాగ్ జట్టు జింబాబ్వే చేతిలో శ్రీలంక  ఓడిపోవడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.

 

అయితే వరల్డ్ కప్ లో శ్రీలంకకు ఎప్పుడూ మంచి రికార్డే ఉంది. 1996లో వరల్డ్ కప్  ను చేజిక్కించుకోవడంతో పాటు.. ఆ తరువాత రెండు సార్లు ఫైనల్ కు చేరింది. గత వరల్డ్ కప్  ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి కూడా  శ్రీలంకనే అన్న విషయం మిగతా జట్లు గుర్తుంచుకోవాలి. వరుసగా 2007, 2011 లో శ్రీలంక ఫైనల్ కు చేరినా  ఫైనల్ అడ్డంకిని  మాత్రం ఆ జట్టు దాటలేకపోయింది. ప్రస్తుతం శ్రీలంక జట్టు కాస్త బలహీనంగానే కనిపిస్తున్నా సంచలనాలు నమోదు చేయడంలో ఆ జట్టుకి  మంచి ఘనతే ఉంది. దీంతో రేపు ఇరు జట్ల మధ్య జరిగే పోరు మాత్రం ఆసక్తికరంగానే సాగుతుందనడంలో ఎలాంటి సందేహం  లేదు.

Advertisement
Advertisement