కసితీరా... కలిసికట్టుగా... | Sakshi
Sakshi News home page

కసితీరా... కలిసికట్టుగా...

Published Mon, Feb 23 2015 12:43 PM

కసితీరా... కలిసికట్టుగా...

 సాక్షి క్రీడావిభాగం
 భారత జట్టు దక్షిణాఫ్రికాపై గెలుస్తుందని మనస్ఫూర్తిగా నమ్మిన అభిమానుల సంఖ్య తక్కువ. ఇటీవల కాలంలో సఫారీల ప్రదర్శన, ఫామ్ చూసిన తర్వాత ధోని సేన పోరాడితే చాలు అనే భావనలో ఉన్నారు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ఫలితం (130 పరుగుల విజయం) చూస్తే ఓ అద్భుతం. నిజానికి భారత్ తొలుత 307 పరుగులు చేసినా కచ్చితంగా మన జట్టు గెలుస్తుందనే ధీమా లేదు. కానీ భారత బౌలర్లు, ఫీల్డర్లు అద్భుతం చేశారు. స్టెయిన్, మోర్కెల్, ఫిలాండర్ లాంటి బౌలర్లు ఉన్న లైనప్‌పై 300 పైచిలుకు స్కోరు చేయడం కూడా ఆషామాషీ కాదు. మొత్తం అన్ని విభాగాల్లోనూ భారత క్రికెటర్లు కసితీరా... కలిసికట్టుగా ఆడి అదరగొట్టారు.
 
 మరోసారి మంచి భాగస్వామ్యం
 టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలనేది భారత్ వ్యూహం. ఈసారి కూడా ధోని టాస్ గెలవగానే సందేహం లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిజానికి మొదటి 10 ఓవర్లు మ్యాచ్ పూర్తిగా దక్షిణాఫ్రికా నియంత్రణలోనే ఉంది. డివిలియర్స్ అద్భుతంగా స్పందించడంతో మూడో ఓవర్లోనే రోహిత్ రనౌట్ కావడం భారత్‌కు పెద్ద దెబ్బ. అయితే శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి మరోసారి నియంత్రణతో కూడిన ఇన్నింగ్స్ ఆడారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ తరహాలోనే ఈసారి కూడా క్రీజులో కుదురుకునే వరకు ఆగి... క్రమంగా జోరు పెంచుకుంటూ పోయారు. 20 ఓవర్లలో భారత్ చేసిన పరుగులు 83 మాత్రమే. కానీ కోహ్లి, ధావన్ ఇద్దరూ స్పీడ్ పెంచడంతో తర్వాతి ఏడు ఓవర్లలో 51 పరుగులు వచ్చాయి. 127 పరుగుల ధావన్, కోహ్లి భాగస్వామ్యం భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టింది.
 
 మరింత జోరుగా...: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అజింక్యా రహానేకు పెద్దగా ఆడే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో తన అసలు సత్తా ఏంటో బయటపెట్టాడు. నిలదొక్కుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఒకసారి పిచ్‌పై అవగాహన వచ్చిన తర్వాత కళ్లు చెదిరే షాట్స్ ఆడాడు. ధావన్, రహానేల 125 పరుగుల భాగస్వామ్యం 7.57 రన్‌రేట్‌తో రావడం విశేషం. మధ్య ఓవర్లలో ఆటపై నియంత్రణ ఎంత ముఖ్యమో మరోసారి భారత క్రికెటర్లు నిరూపించారు. 43 ఓవర్లలో భారత స్కోరు 254/2. ఈ దశలో భారత్ కచ్చితంగా 330 పైచిలుకు స్కోరు దిశగా సాగింది.
 
 చివర్లో తడబాటు: పాక్‌తో మ్యాచ్‌లో చేసిన తప్పును మనోళ్లు మరోసారి చేశారు. వికెట్లు చేతిలో ఉంటే చివరి ఓవర్లలో భారీగా పరుగులు చేయొచ్చు. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత వ్యూహం ఇదే. అయితే ఈ తొందరలో చేతిలో ఓవర్లు మిగిలుండగానే వికెట్లు పడుతున్నాయి. కనీసం ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చివరి వరకు క్రీజులో ఉంటే ఈ లోపాన్ని అధిగమించవచ్చు. అడిలైడ్‌లో రైనా సిక్సర్లు కొట్టిన షాట్లు ఇక్కడ క్యాచ్‌లు అయ్యాయి. కారణం మెల్‌బోర్న్ పెద్ద మైదానం కావడం. స్లాగ్‌లో తడబాటుతో చివరి 7 ఓవర్లలో భారత్ 53 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా చివరి రెండు ఓవర్ల లో కేవలం పది పరుగులు మాత్రమే వచ్చాయి.
 
 
 ఫీల్డింగ్ అదుర్స్
 అద్భుతమైన ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు దక్షిణాఫ్రికా. ఈసారి మాత్రం సఫారీలను మించి భారత ఫీల్డర్లు మైదానంలో చురుగ్గా కదిలారు. మోహిత్, ఉమేశ్ లాంటి బౌలర్లు కూడా తమ కచ్చితమైన త్రోలతో రనౌట్‌లలో పాలు పంచుకున్నారు. ఈ తరహా ఫీల్డింగ్‌ను కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు.
 
 ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా ఒక బ్యాట్స్‌మన్‌ను తగ్గించుకుని, ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో దిగడం ఆశ్చర్యం కలిగించింది. గత మ్యా చ్‌లో ఆడిన బెహర్దీన్‌ను ఆపి, పార్నెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. పార్నెల్‌ను భారత బ్యాట్స్‌మెన్ 9 ఓవర్లలో 85 పరుగులు బాదారు. దీనికి తోడు మరో ప్రధాన పేసర్ ఫిలాండర్ కేవలం 4 ఓవర్లు వేసిన తర్వాత గాయం కారణంగా బౌలింగ్‌కు దూరమయ్యాడు.
 
 సూపర్ పేస్
 చివరిసారిగా భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో ఆడిన సిరీస్‌లో డికాక్ కొరకరాని కొయ్యగా కనిపించాడు. ఈసారి మ్యాచ్‌లో షమీ తన రెండో ఓవర్లోనే డికాక్‌ను బోల్తా కొట్టించాడు. ఇది భారత్‌కు  అద్భుతమైన ఆరంభం. అసలు ఆశ్చర్యం ఆమ్లా వికెట్. మోహిత్ షార్ట్‌బాల్స్ వేయడం అరుదు. అలాంటి షార్ట్‌బాల్‌ను ఆమ్లా కూడా ఊహించలేదు. అందుకే దొరికిపోయాడు. డు ప్లెసిస్, డివిలియర్స్ భాగస్వామ్యంతో మ్యాచ్ మీద సఫారీలు పట్టుతెచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ మోహిత్ శర్మ అద్భుతమైన ఫీల్డింగ్‌తో డివిలియర్స్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అదే జోరులో మోహిత్... డు ప్లెసిస్‌నూ పెవిలియన్‌కు పంపడంతో భారత శిబిరంలో ధీమా వచ్చింది. అయితే జింబాబ్వేతో జరిగిన గత మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్, డుమిని చేసిన మెరుపు సెంచరీలు మదిలో మెదులుతున్నందున అప్పుడే సంబరాలు మొదలు కాలేదు.
 
 అశ్విన్ హవా
 దక్షిణాఫ్రికా జట్టు స్పిన్ ఆడటంలో బలహీనం. గతంలో అనేకసార్లు ఇది రుజువయింది. అయితే అశ్విన్‌ను ఎదుర్కోవడంలో తమకు ఎలాంటి సమస్య లేదని మ్యాచ్‌కు ముందు రోజు డివిలియర్స్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా స్పిన్ ఆడటం నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేశారు. కానీ అసలు సమయానికి అశ్విన్ ధాటికి మరోసారి బెంబేలెత్తారు. మధ్య ఓవర్లలో జడేజా, అశ్విన్‌లు పరుగులు నియంత్రించడంతో పాటు... అశ్విన్ చకచకా వికెట్లు తీయడం మొదలుపెట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా డీలా పడిపోయింది.
 
 సచిన్ నామస్మరణ...
 క్రికెట్‌నుంచి రిటైర్ అయ్యాక కూడా సచిన్ పట్ల అభిమానుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మైదానంలో దిగకపోయినా వారి దృష్టిలో అతను ఇప్పటికీ హీరోనే. భారత్ మ్యాచ్ సందర్భంగా అది మరోసారి మెల్‌బోర్న్‌లో కనిపించింది. రిటైర్మెంట్ తర్వాత మ్యాచ్‌ల సందర్భంగా ఎక్కడా కనిపించని సచిన్... ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఇక్కడ అడుగు పెట్టాడు. జెయింట్ స్క్రీన్‌పై అతడిని చూపించగానే సచిన్ పేరుతో స్టేడియం మార్మోగింది. అతడు చేయి ఊపగానే వారంతా మరోసారి ఉప్పొంగిపోయారు.
 
 టెండూల్కర్ ఉన్న ఐసీసీ హాస్పిటాలిటీ బాక్స్‌లో ఉన్నవారు అతనితో ఫోటోలు దిగి, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఉత్సాహం చూపించ గా... ఆ అవకాశం లేనివారు దూరంనుంచి అతడిని తమ కెమెరాల్లో బంధించారు. మొత్తానికి ఆ వాతావరణం చూస్తే సచిన్ ఇంకా రిటైర్ కాలేదేమో అనిపించింది. మ్యాచ్ సందర్భంగా సచిన్ స్టాండ్స్‌లో నుంచి ‘సెల్ఫీ’ తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో విజ యాన్ని ‘మధుర క్షణాలు’గా మాస్టర్ అభివర్ణించాడు.
 
 
 అభిమానులకు కృతజ్ఞతలు
 ఆదివారం మెల్‌బోర్న్ మైదానం భారత అభిమానులతో కిక్కిరిసిపోయింది. జట్టు వార్మప్‌నుంచి హడావుడి చేసిన అభిమానులు జాతీయ గీతం పూర్తయ్యే సరికి ఒక్కసారిగా హోరెత్తించారు. ఇంత మంది తమ జట్టును సమర్థించడం సంతోషంగా ఉందన్న ధోని... మ్యాచ్‌లో తమకు అండగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పాడు. ‘దాదాపు 87 వేల మంది స్టేడియంలో ఉన్నారు. ఇందులో దక్షిణాఫ్రికాకు ఒక 20 వేల మందిని ఇచ్చేసినా 50 వేలకు పైగా జనం మా వెంట ఉన్నట్లే. ఇంతటి జనం మధ్య, ఈ వాతావరణంలో ఆడటం చాలా బాగుంది. ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన అభిమానులకు కూడా మా విజయంలో భాగం ఉంది. వారికి నా కృతజ్ఞతలు’ అని ధోని వ్యాఖ్యానించాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement