వచ్చే ప్రపంచకప్‌లో 10 జట్లు: ఐసీసీ | Sakshi
Sakshi News home page

వచ్చే ప్రపంచకప్‌లో 10 జట్లు: ఐసీసీ

Published Mon, Feb 23 2015 1:19 AM

వచ్చే ప్రపంచకప్‌లో 10 జట్లు: ఐసీసీ

మెల్‌బోర్న్: ప్రపంచకప్‌లో జట్ల సంఖ్యను తగ్గించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ప్రస్తుత టోర్నీలో 14 జట్లను ఆడిస్తుండగా 2019లో ఇంగ ్లండ్‌లో జరుగబోయే టోర్నీలో వీటిని పదికి కుదించనున్నారు. నేడు (సోమవారం) ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం కానుంది.
 
 ఇందులో మెజారిటీ సభ్యులు ప్రస్తుత ఫార్మాట్‌కన్నా 10 జట్లతో ఆడించేందుకే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుత టోర్నీ ఏడు వారాలపాటు సుదీర్ఘంగా సాగడమే కాకుండా కొన్ని ఏకపక్ష మ్యాచ్‌లకు అవకాశం ఉంది. ‘ప్రపంచకప్ టోర్నీ అంటే మ్యాచ్‌లన్నీ అత్యున్నత స్థాయిలో జరగాలి.  టి20 ప్రపంచకప్‌లో చిన్నస్థాయి జట్లను ప్రోత్సహించేందుకు అనుగుణంగా 16 జట్లతో టోర్నీని నిర్వహించే అవకాశాలున్నాయి’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి డేవ్ రిచర్డ్‌సన్ అన్నారు.
 
 మరిన్ని జట్లు ఆడాలి: సచిన్
 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యపై ఐసీసీ అభిప్రాయం ఎలా ఉన్నా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం ఈ మెగా టోర్నీలో ఆడే జట్ల సంఖ్యను పెంచాలనే చెబుతున్నాడు. ‘క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలంటే ప్రపంచకప్‌లో మరిన్ని జట్లను ఆడించాల్సి ఉంటుంది. చిన్న జట్లు తమ సామర్థ్యాన్ని ఎలా నిరూపించుకుంటున్నాయో గమనించాలి. వారు ఉత్తమ జట్లతో ఆడినప్పుడే ఇది సాధ్యమవుతుంది’ అని ప్రపంచకప్ అంబాసిడర్ కూడా అయిన సచిన్ ఐసీసీ హ్యాంగ్‌అవుట్‌లో పేర్కొన్నాడు.
 

Advertisement
Advertisement