లంకపై గర్జించిన భారత్‌

6 Jul, 2019 22:43 IST|Sakshi

ఏడు వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం

రోహిత్‌, రాహుల్‌ శతకాలు

మాథ్యూస్‌ శతకం వృథా

మలింగ ప్రపంచకప్‌ చివరి మ్యాచ్‌లో నిరాశే

లీడ్స్‌ : నామమాత్రమైన చివరి మ్యాచ్‌ను కూడా టీమిండియా వదల్లేదు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం హెడింగ్లీ మైదానంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని కోహ్లి సేన 43.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ(103; 94 బంతుల్లో 14ఫోర్లు, 2సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌(111;118 బంతుల్లో 11ఫోర్లు, 1 సిక్సర్‌) శతకాలు సాధించారు. ఓపెనర్లు శతకాలు సాధించడంతో టీమిండియా సులువుగా విజయాన్ని అందుకుంది. విరాట్‌ కోహ్లి(34 నాటౌట్‌; 41 బంతుల్లో 3ఫోర్లు) చివరి వరకు ఉండి జట్టుకు విజయాన్నందించాడు. లంక బౌలర్లలో ఉదాన, రజిత, మలింగలు తలో వికెట్‌ దక్కించుకున్నారు. శతకంతో టీమిండియాకు సులువుగా విజయాన్ని అందించిన రోహిత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

లక్ష్యఛేదనలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ల ఆటనే హైలెట్‌గా నిలిచింది. లంక బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. రాహుల్‌ ఆచితూచి ఆడగా.. రోహిత్‌ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రోహిత్‌ మైదానం నలువైపులా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే టోర్నీలో ఐదో సెంచరీ సాధించాడు. సెంచరీ అనంతరం రోహిత్‌ ఔటయ్యాక కోహ్లి క్రీజులోకి వచ్చాడు. రోహిత్‌ అవుటయ్యాక రాహుల్‌ గేర్‌ మార్చి పరుగులు రాబట్టాడు. రాహుల్‌కు తోడుగా కోహ్లి కూడా రెచ్చిపోయాడు. 


ఈ క్రమంలోనే రాహుల్‌ ప్రపంచకప్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. సెంచరీ అనంతరం రాహుల్‌ను మలింగ తన అద్భుతమైన షార్ట్‌ పిచ్‌ బాల్‌తో పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్‌ పంత్‌(4) తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే హార్దిక్‌ పాండ్యా(7నాటౌట్‌)తో కలిసి కోహ్లి విజయాన్ని పూర్తి చేశాడు. ఇక ప్రపంచకప్‌ చివరి మ్యాచ్‌లో మలింగ పూర్తిగా తెలిపోయాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

మాథ్యూస్‌ సూపర్‌ షో..
అంతకుముందు శ్రీలంక సీనియర్‌ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌(113; 128 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో రాణించగా... లహిరు తిరిమన్నే(53; 68 బంతుల్లో 4 ఫోర్లు) అర్దసెంచరీతో మెరిశాడు. దీంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లు తలో వికెట్‌ తీశారు.  

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకేయులు ఆదిలోనే షాక్‌ తగలింది. లంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే(10) నిరాశపరచగా, కాసేపటకి కుశాల్‌ పెరీరా(18) కూడా పెవిలియన్‌ చేరాడు. దాంతో లంక 40 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లను జస్‌ప్రీత్‌ బుమ్రా సాధించాడు. కొద్ది సేపటి తర్వాత అవిష్కా ఫెర్నాండో(20)ను హార్దిక్‌ పాండ్యా బోల్తా కొట్టించగా, కుశాల్‌ మెండిస్‌ను జడేజా ఔట్‌ చేశాడు. దాంతో 55 పరుగులకే లంకేయులు నాలుగు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ తర్వాత తనకు భారత్‌పై ఉన్న మంచి రికార్డును కొనసాగిస్తూ మాథ్యూస్‌ సమయోచితంగా ఆడాడు. చివర్లో డిసిల్వా(29 నాటౌట్‌) మెరుపుల మెరిపించడంతో శ్రీలంక 265 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు