వరల్డ్‌ ‘కింగ్‌’ ఆనంద్‌  | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ ‘కింగ్‌’ ఆనంద్‌ 

Published Fri, Dec 29 2017 12:44 AM

World Rapid Chess Championship winner  Anand - Sakshi

చదరంగపు రారాజు మళ్లీ యుద్ధభూమిలో కదం తొక్కాడు...48 ఏళ్ల వయసులో కొత్త ఎత్తులతో కుర్రాళ్లను చిత్తు చేస్తూ జగజ్జేతగా నిలిచాడు. ‘వేగం’లో తనను అందుకోవడం కష్టం అంటూ  ప్రత్యర్థులను మట్టి కరిపించాడు. అరవై నాలుగు గళ్లలో అతని ఆట ముగిసినట్లే అని భావించినవారికి పదునైన రీతిలో సమాధానమిస్తూ భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ మరోసారి విశ్వ వేదికపై తన సత్తా చాటాడు. వరల్డ్‌ ర్యాపిడ్‌  చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకొని శిఖరాన నిలిచాడు. 15 రౌండ్లలో ఒక్కటి కూడా ఓడకుండా అజేయంగా నిలిచి ఆనంద్‌ అగ్రస్థానాన్ని అందుకోవడం విశేషం.   

రియాద్‌: మాజీ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ తన పాత ఆట తీరును ప్రదర్శిస్తూ విశ్వ వేదికపై అగ్రస్థానాన నిలిచాడు. గురువారం ఇక్కడ ముగిసిన వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను ఆనంద్‌ సొంతం చేసుకున్నాడు. టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆనంద్‌  నిర్ణీత 15 రౌండ్లు ముగిసేసరికి 10.5 పాయింట్లతో వ్లాదిమర్‌ ఫెడసీవ్‌ (రష్యా)తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే కచ్చితమైన ఫలితం కోసం ఇరువురి మధ్య నిర్వహించిన రెండు టైబ్రేక్‌ మ్యాచ్‌ల్లో విజయం ఆనంద్‌నే వరించింది. తెల్లపావులతో ఆడిన తొలి టైబ్రేక్‌ను 29 ఎత్తుల్లో సొంతం చేసుకున్న విషీ... నల్లపావులతో ఆడిన రెండో టైబ్రేక్‌ను 38 ఎత్తుల్లో దక్కించుకొని జగజ్జేతగా అవతరించాడు.  

గురువారం జరిగిన చివరి ఐదు రౌండ్లలో  నాలుగు గేమ్‌లను విషీ డ్రా చేసుకున్నాడు. రష్యాకు చెందిన గ్రిష్చుక్‌తో జరిగిన 14వ రౌండ్‌ గేమ్‌ను 57 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో ఆనంద్‌ ఓవరాల్‌గా 6 గేముల్లో గెలిచి 9 గేముల్ని డ్రా చేసుకున్నాడు.  డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన మాగ్నస్‌ కార్ల్‌సన్‌ చివరిదైన 15వ రౌండ్‌లో రష్యాకు చెందిన గ్రిష్చుక్‌ చేతిలో 60 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. దీంతో 10 పాయింట్లతో టోర్నీలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.   ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ 9.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 15 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో 22వ స్థానాన్ని సంపాదించింది. 

ఆనంద్‌ 2003లో వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. అయితే 2012 నుంచి ‘ఫిడే’  కొన్ని మార్పులతో  వరల్డ్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పేరుతో అధికారికంగా దీనిని నిర్వహిస్తోంది. గతంలో ఇదే టోర్నీలో ఆనంద్‌ 2014లో మూడో స్థానంలో నిలిచాడు.    

Advertisement
Advertisement