ఆసీస్ అలవోకగా... | Sakshi
Sakshi News home page

ఆసీస్ అలవోకగా...

Published Sat, Mar 26 2016 12:55 AM

ఆసీస్ అలవోకగా...

పాకిస్తాన్‌పై 21 పరుగులతో విజయం 
ఫాల్క్‌నర్‌కు ఐదు వికెట్లు 
ఇక సెమీస్ బెర్త్ కోసం భారత్‌తో అమీతుమీ

 
మొహాలీ: టి20 ప్రపంచకప్‌లో తొలిసారి ఆస్ట్రేలియా జట్టు చాంపియన్ తరహా ఆటతీరు ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో స్మిత్, వాట్సన్, బౌలింగ్‌లో ఫాల్క్‌నర్ చెలరేగడంతో పాకిస్తాన్‌పై అలవోకగా గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. పీసీఏ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగుల భారీస్కోరు సాధించింది.

ఓపెనర్ ఖవాజా (16 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్సర్) మంచి ఆరంభాన్నిచ్చినా... పాక్ పేసర్ల జోరుకు తడబడిన ఆసీస్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ స్మిత్ (43 బంతుల్లో 61 నాటౌట్, 7 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఎప్పటిలాగే వేగంగా ఆడగా... వాట్సన్ (21 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు భారీస్కోరు అందించాడు. స్మిత్, వాట్సన్ ఐదో వికెట్‌కు అజేయంగా 38 బంతుల్లోనే 74 పరుగులు జోడించడం విశేషం. పాక్ బౌలర్లలో వహాబ్, ఇమాద్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

 పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓపెనర్ షార్జీల్ ఖాన్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు)తో పాటు లతీఫ్ (41 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్సర్), ఉమర్ అక్మల్ (20 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో ఒక దశలో పాక్ లక్ష్యం దిశగా సాగుతున్నట్లే అనిపించింది. కానీ ఆసీస్ స్పిన్నర్ జంపా (2/32) కీలక సమయంలో వికెట్లు తీశాడు. చివర్లో షోయబ్ మాలిక్ (20 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక ఎండ్‌లో పోరాడినా... రెండో ఎండ్‌లో ఫాల్క్‌నర్ (5/27) ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆస్ట్రేలియా తరఫున టి20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఫాల్క్‌నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

 స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖవాజా (బి) వహాబ్ 21; ఫించ్ (బి) ఇమాద్ 15; వార్నర్ (బి) వహాబ్ 9; స్టీవ్ స్మిత్ నాటౌట్ 61; మ్యాక్స్‌వెల్ (సి) షెహ్‌జాద్ (బి) ఇమాద్ 30; వాట్సన్ నాటౌట్ 44; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 193.
 వికెట్ల పతనం: 1-28; 2-42; 3-57; 4-119.

బౌలింగ్: ఆమిర్ 4-0-39-0; సమీ 4-0-53-0; వహాబ్ రియాజ్ 4-0-35-2; ఆఫ్రిది 4-0-27-0; ఇమాద్ వసీమ్ 4-0-31-2.

పాకిస్తాన్ ఇన్నింగ్స్: షార్జీల్ ఖాన్ (బి) ఫాల్క్‌నర్ 30; షెహ్‌జాద్ (సి) కౌల్టర్ నైల్ (బి) హాజిల్‌వుడ్ 1; లతీఫ్ (బి) ఫాల్క్‌నర్ 46; ఉమర్ అక్మల్ (బి) జంపా 32; ఆఫ్రిది (స్టంప్డ్) నెవిల్ (బి) జంపా 14; షోయబ్ మాలిక్ నాటౌట్ 40; ఇమాద్ వసీమ్ (సి) కౌల్టర్ నైల్ (బి) ఫాల్క్‌నర్ 0; సర్ఫరాజ్ (సి) ఖవాజా (బి) ఫాల్క్‌నర్ 2; వహాబ్ (సి) హాజిల్‌వుడ్ (బి) ఫాల్క్‌నర్ 0; సమీ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172.

వికెట్ల పతనం: 1-20; 2-40; 3-85; 4-110; 5-147; 6-147; 7-164; 8-164.
బౌలింగ్: హాజిల్‌వుడ్ 4-0-26-1; కౌల్టర్ నైల్ 4-0-45-0; ఫాల్క్‌నర్ 4-0-27-5; వాట్సన్ 2-0-27-0; జంపా 4-0-32-2; మ్యాక్స్‌వెల్ 2-0-13-0.  
 
ఎవరు గెలిస్తే వాళ్లు సెమీస్‌కు

భారత xఆస్ట్రేలియా
పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా విజయంతో గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్త్‌ల విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్
ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. ఆదివారం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది.

Advertisement
Advertisement