పేస్‌ ఎక్స్‌ప్రెస్‌కు బ్రేక్‌! | Sakshi
Sakshi News home page

పేస్‌ ఎక్స్‌ప్రెస్‌కు బ్రేక్‌!

Published Fri, Apr 7 2017 12:31 AM

పేస్‌ ఎక్స్‌ప్రెస్‌కు బ్రేక్‌!

డేవిస్‌ కప్‌ జట్టులో చోటు దక్కని లియాండర్‌
27 ఏళ్లలో ఇదే తొలిసారి
బోపన్నకే ప్రాధాన్యతనిచ్చిన మహేశ్‌ భూపతి
తీవ్రంగా విరుచుకుపడ్డ పేస్‌


భారత డేవిస్‌ కప్‌ చరిత్రలో ఒక శకం ముగిసింది! దాదాపు మూడు దశాబ్దాలుగా జట్టులో అంతర్భాగమై పలు చిరస్మరణీయ విజయాలు అందించిన లియాండర్‌ పేస్‌కు మ్యాచ్‌ బరిలోకి దిగే తుది జట్టులో స్థానం లభించలేదు. ఉజ్బెకిస్తాన్‌తో జరిగే పోరులో డబుల్స్‌ మ్యాచ్‌లో పేస్‌ను కాదని రోహన్‌ బోపన్నను నాన్‌ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి ఎంచుకున్నారు. బెంగళూరులో పరిస్థితులే కారణమంటూ మహేశ్‌ వివరణ ఇచ్చినా... తనతో పాత విభేదాల వల్ల కావాలనే పక్కన పెట్టినట్లు పేస్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డేవిస్‌కప్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా నిలిచేందుకు కేవలం ఒక విజయం దూరంలో ఉన్న సమయంలో చోటు కోల్పోయిన ఈ దిగ్గజం ఇక ముందు దేశం తరఫున ఆడటం దాదాపు అసాధ్యం కావచ్చు!

బెంగళూరు: లియాండర్‌ పేస్‌ తొలి సారిగా భారత్‌ తరఫున 1990లో జపాన్‌తో జైపూర్‌లో జరిగిన డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ బరిలోకి దిగాడు. నాటినుంచి ఇప్పటి వరకు అతను అందుబాటులో ఉన్న ప్రతీ సారి బరిలోకి దిగాడు. గాయంలాంటి కారణాలతో తనంతట తాను తప్పుకోవడం మినహా ఫామ్‌ పేరుతో పేస్‌ను ఒక్కసారి కూడా తప్పించలేదు. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో అతడిని పక్కన పెట్టారు. నేటి నుంచి ఆదివారం వరకు ఇక్కడ జరిగే ఆసియా/ఓసియానియా గ్రూప్‌ 1 మ్యాచ్‌లో తలపడే నలుగురు సభ్యుల భారత జట్టును గురువారం నాన్‌ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి ప్రకటించారు.

డబుల్స్‌ మ్యాచ్‌లో రోహన్‌ బోపన్న, శ్రీరామ్‌ బాలాజీ కలిసి ఆడతారు. సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఒలింపిక్స్‌ కాంస్య పతకం, 18 గ్రాండ్‌స్లామ్‌ల టైటిల్స్‌ విజేత పేస్‌ కంటే కూడా బోపన్న వైపు భూపతి మొగ్గు చూపారు. ప్రస్తుతం ప్రపంచ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో పేస్‌ 53వ స్థానంలో ఉండగా, బోపన్న 24వ స్థానంలో కొనసాగుతున్నాడు. ‘ఇక్కడి వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతుంటాయి. రోహన్‌ చాలా బాగా సర్వీస్‌ చేస్తున్నాడు. అతని ఎంపికకు అదే ప్రధాన కారణం. పేస్‌ను తప్పించాలనేది చాలా కఠిన నిర్ణయం. అందుకే దానిని తీసుకునేందుకు ఆలస్యమైంది. నేను మొదటి నుంచి ముగ్గురు సింగిల్స్‌ ఆటగాళ్లనే ఎంచుకోవాలని భావిస్తూ వచ్చాను. ఎందుకంటే వీరిలో ఇద్దరికి డేవిస్‌కప్‌లో ఆడిన అనుభవం లేదు. అందుకే ఇద్దరు డబుల్స్‌ స్పెషలిస్ట్‌లను తీసుకునే సాహసం చేయలేకపోయాను.

అయితే టాప్‌–5లో ఉంటే తప్ప డబుల్స్‌ స్పెషలిస్ట్‌లు అనేదానిని నేను నమ్మను’ అని భూపతి వివరించారు. పేస్‌ బుధవారమే నగరానికి వచ్చాడని, అతనితో పోలిస్తే గత ఆదివారంనుంచి కలిసి సాధన చేస్తున్న రోహన్, బాలాజీలకే మంచి విజయావకాశాలు ఉంటాయని భూపతి అభిప్రాయ పడ్డారు. పేస్‌ కాస్త ముందుగా వచ్చి ఉంటే తమ ఆలోచనలో కూడా మార్పు ఉండేదేమోనన్న మహేశ్‌... ఈ మ్యాచ్‌కు దూరమైనంత మాత్రాన పేస్‌ కెరీర్‌ ముగిసినట్లు కాదని అన్నారు.

ఇందుకా నన్ను పిలిచింది!
డేవిస్‌ కప్‌ జట్టునుంచి తనను తొలగించడం పట్ల లియాండర్‌ పేస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను కావాలని తప్పించేందుకే అర్హతా ప్రమాణాలను ఇష్టారాజ్యంగా మార్చుకున్నారని అతను విమర్శించాడు. తనకు, భూపతికి మధ్య ఉన్న విభేదాలే అందుకు కారణం కావచ్చని పేస్‌ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ‘జట్టు ఎంపిక ఒకసారేమో ర్యాంకింగ్స్‌ ప్రకారం జరుగుతుంది. మరోసారి వారి ఇష్టాలు, వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా జరుగుతుంది. కొన్ని సార్లు వ్యక్తిగతంగా కాకుండా ఎడమ వైపు కోర్టులో ఎవరు ఆడతారు, కుడి వైపు కోర్టులో ఎవరు ఆడతారు అనేదానిపై చర్చించి నిర్ణయిస్తారు. ఇప్పుడేమో ఫామ్‌ను బట్టి తీసుకుంటారు. ఫామ్‌ మాటకొస్తే ఎవరు బాగా ఆడుతున్నారో అందరికీ తెలుసు’ అని పేస్‌ తీవ్రంగా విరుచుకు పడ్డాడు. గత వారమే పేస్‌ లియోన్‌లో జరిగిన మెక్సికో చాలెంజర్‌ టైటిల్‌ను గెలిచాడు.

కొందరు ఇక్కడి వాతావరణం గురించి మాట్లాడుతున్నారని, అయితే సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న లియోన్‌లో టోర్నీ నెగ్గిన తనకు 920 మీటర్ల ఎత్తులో ఉన్న బెంగళూరులో ఆడటంలో సమస్య ఎలా ఎదురవుతుందని పేస్‌ వ్యంగ్యంగా అన్నాడు. కేవలం దేశంపై ప్రేమతో తాను సుదీర్ఘ ప్రయాణం చేసి మెక్సికోనుంచి వచ్చానని, ఇలా అవమానించకుండా ఫోన్‌లోనే చోటు లేదని చెప్పేస్తే సరిపోయేదని అతను చెప్పాడు. ‘పరిణామాలు ఎలా ఉన్నా దేశం పట్ల నా ప్రేమ షరతులు లేనిది. అందుకే ఇంత దూరం వచ్చాను. ఒక ఫోన్‌ చేసి నేను కావాలా వద్దా అని చెబితే ఇంత రచ్చ జరగకపోయేది కదా. అయితే నేను మున్ముందు ఇంకా ఎక్కువగా శ్రమిస్తాను. మళ్లీ భారత్‌ తరఫున డేవిస్‌ కప్‌ ఆడతాననే నమ్మకముంది’ అని పేస్‌ ఉద్వేగంగా చెప్పాడు.

నేడు ఎవరితో ఎవరు?
రామ్‌కుమార్‌& తేమూర్‌ ఇస్మయిలోవ్‌ (తొలి సింగిల్స్‌)
ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌& ఫైజీవ్‌ (రెండో సింగిల్స్‌)

Advertisement
Advertisement