కోర్టుకెక్కిన రెజ్లర్ సుశీల్ కుమార్ | Sakshi
Sakshi News home page

కోర్టుకెక్కిన రెజ్లర్ సుశీల్ కుమార్

Published Mon, May 16 2016 6:13 PM

కోర్టుకెక్కిన రెజ్లర్ సుశీల్ కుమార్

న్యూఢిల్లీ:భారత రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ ల మధ్య చోటు చేసుకున్న రియో ఒలింపిక్స్ బెర్తు గొడవ ఇప్పట్లో సమసిపోయేలా లేదు. తాజాగా  రెజ్లర్ నర్సింగ్ యాదవ్ను 74 కేజీల విభాగంలో రియో  సన్నాహక శిబిరానికి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్యూఎఫ్ఐ) ఎంపిక చేయడంతో వివాదం మరింత తారస్థాయికి చేరింది. బుధవారం నుంచి  హరియాణాలోని సోన్పేట్లో భారత రెజ్లింగ్ రియో సన్నాహకాల్లో  ఆరంభమవుతున్న నేపథ్యంలో నర్సింగ్ యాదవ్ పేరును డబ్యూఎఫ్ఐ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

దీనిపై సుశీల్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తమలో ఎవరు భారత్కు ప్రాతినిథ్యం వహించాలో తేల్చాలంటూ కోర్టును కోరాడు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం, 2012 లండన్ ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సుశీల్.. ట్రయల్ ఆధారంగానే  తుది ఎంపిక జరగాలని పట్టుబడుతున్నాడు.


వాస్తవానికి  రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ లు పోటీ పడ్డారు. భారత్ తరపున ఈ కేటగిరిలో సుశీల్ (ఢిల్లీ), నర్సింగ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు కాగా, కేవలం ఒకరికి మాత్రమే ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది.   గతేడాది లాస్‌వేగాస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని సుశీల్ కోరుతున్నాడు.

Advertisement
Advertisement