భారత్‌ను ఓడించాలంటే 100 శాతం ఆడాల్సిందే.. | Sakshi
Sakshi News home page

భారత్‌ను ఓడించాలంటే 100 శాతం ఆడాల్సిందే..

Published Tue, Sep 26 2017 5:21 PM

You have to play 100 percent to beat India, says Aaron Finch

సాక్షి, హైదరాబాద్‌:  ఉపఖండ పిచ్‌లపై టీమిండియాను ఓడించాలంటే 100 శాతం ఆడాల్సిందేనని ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ అభిప్రాయపడ్డారు. కాలి పిక్క గాయంతో​ తొలి రెండు వన్డేలకు దూరమైన ఫించ్‌ మూడో వన్డేలో శతకంతో రాణించిన విషయం తెలిసిందే. వరుస మూడు వన్డేల్లో గెలిచి కోహ్లి సేన సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఫించ్‌ ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ వెబ్‌సైట్‌తో ముచ్చటించారు.

‘ విదేశీ గడ్డపై ఓటములు ఎదురైతే ఆటగాళ్లు కొంచెం దైర్యం కోల్పోతారు.  దక్షిణాఫ్రికా, భారత్‌ సిరీస్‌ల ఓటమికి కారణం ఆ జట్లు మా కన్నా కొంత నాణ్యమైన ప్రదర్శన చేశాయి. మా జట్టు మంచి ప్రదర్శన చేసినా చివరి నిమిషంలో ఓడిపోయాం. ఇలా గత10 మ్యాచుల్లో 9 ఓడిపోయాం. ఇదే పరిస్థితి భారత్‌లో కూడా ఎదురైంది. ఉపఖండ పిచ్‌లపై భారత్‌ను ఢీకొట్టాలంటే 100 శాతం ఆడాల్సిందే. ఒక వేళ 90 శాతం ఆడుతానంటే ఇక్కడి పరిస్థితులకు సరిపోదు. గత ఐదేళ్లలో మాజట్టును ఢీకొన్న ఇతర జట్లు అద్భుతంగా రాణించాయి. ఇప్పుడు భారత్‌ సిరీస్‌ గెలిచి నెం.1 గా ఉంది. మేము మా ఆటగాళ్లతో ప్రణాళికలు రచించి ముందుకెళ్తాం. విజయానికి ఉన్న ఆ కొద్ది దూరాన్ని అధిగమిస్తాం’. అని ఫించ్‌ పేర్కొన్నారు.

ఆసీస్‌కు గడ్డు పరిస్థితులు
ఇక ఆస్ట్రేలియా పరిస్థితి దారుణంగా మారింది. ఆ జట్టు గత ఏడాది కాలముగా ఆడిన 13 వన్డేల్లో 11 ఓడగా రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దక్షిణాఫ్రికాతో 5-0తో సిరీస్‌ కోల్పోగా, న్యూజిలాండ్‌ 2-0, చాంపియన్స్‌ ట్రోఫిలో లీగ్‌ దశ నుంచే నిష్క్రమించింది. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌ కోల్పోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement