అన్ని రికార్డులు ఒకే సిరీస్‌లో బద్ధలు కొట్టేస్తారా? | Sakshi
Sakshi News home page

అన్ని రికార్డులు ఒకే సిరీస్‌లో బద్ధలు కొట్టేస్తారా?

Published Mon, Oct 21 2019 11:16 AM

You Want To Break All Records In One Series Reporter Asks Rohit - Sakshi

రాంచీ: ‘మొత్తం అన్ని టెస్టు రికార్డులు ఓపెనర్‌గా అరంగేట్రం చేసి మొదటి సిరీస్‌లోనే బద్ధలు కొట్టేస్తారా’.. ఇది రోహిత్‌ శర్మను మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన తర్వాత ఒక రిపోర్టర్‌ అడిగిన ప్రశ్న. ఇందుకు చిరునవ్వులు చిందించడమే రోహిత్‌ వంతైంది. కాగా, ఈ ప్రశ్న అడగడంలో ఎంత మాత్రం తప్పులేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు దగ్గర్నుంచీ చూస్తే రోహిత్‌ శర్మ వరుస రికార్డులు బ్రేక్‌ చేస్తూనే ఉన్నాడు. ఈ మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టిన రోహిత్‌ శర్మ.. మరొక అరుదైన ఘనతను కూడా సాధించాడు. అది కూడా ఆసీస్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డును సవరించాడు.

స్వదేశీ టెస్టులో రోహిత్‌ శర్మ 18 ఇన్నింగ్స్‌లు గాను 6 సెంచరీలు, 5 అర్థ శతకాలతో 1298 పరుగులు సాధించాడు.  సొంతగడ్డపై కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్‌ సగటుల జాబితా తీసుకుంటే రోహిత్‌దే అత్యుత్తమం. ఇక్కడ బ్రాడ్‌మన్‌ 98.22 సగటుతో ఉంటే, రోహిత్‌ శర్మ కొద్దిపాటి తేడాలో 99.89 సగటుతో ఉన్నాడు. ఫలితంగా ఇప్పటివరకూ బ్రాడ్‌మన్‌ పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ అధిగమించాడు. దక్షిణాఫ్రికాతో చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర డబుల్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా మరో రికార్డు రోహిత్‌ ఖాతాలో చేరింది. దక్షిణాఫ్రికాపై ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో రెండుసార్లు 150కిపైగా పరుగులు సాధించిన తొలి ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు.

అదే సమయంలో ఓవరాల్‌గా ఈ ఫీట్‌ సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.  2012-13 సీజన్‌లో మైకేల్‌ క్లార్క్‌.. సఫారీలతో జరిగిన సిరీస్‌లో రెండుసార్లు 150కి పైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఇంతకాలానికి ఆ మార్కును రోహిత్‌ చేరాడు. కాకపోతే క్లార్క్‌ మిడిల్‌ ఆర్డర్‌లో ఈ ఘనత సాధించాడు. ఆ ఇక ఒక సిరీస్‌లో సఫారీలపై రెండు సందర్భాల్లో 150కి పరుగులు నమోదు చేసిన తొలి ఓవరాల్‌ ఇండియన్‌ క్రికెటర్‌గా రోహిత్‌ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆపై దాన్ని డబుల్‌ సెంచరీ మార్చుకుని టెస్టు, వన్డే ఫార్మాట్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన నాల్గో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తొలి టెస్టులో వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేయడం ద్వారా ఓపెనర్‌గా అరంగేట్రపు టెస్టులో ఈ మార్కును చేరిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ఆ టెస్టులోనే ఓపెనర్‌గా అరంగేట్రం టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును కూడా రోహిత్‌ లిఖించాడు. ఇలా వరుసగా రికార్డులు కొల్లగొడుతూ తనకు వచ్చిన అవకాశాన్ని రోహిత్‌ అందిపుచ్చుకున్నాడు.

Advertisement
Advertisement