యువీ సేన బోల్తా

18 Sep, 2013 01:14 IST|Sakshi
యువీ సేన బోల్తా

 బెంగళూరు: మిడిలార్డర్ ఆటగాడు జొనాథన్ కార్టర్ అటు బ్యాటింగ్ (132 బంతుల్లో 133; 18 ఫోర్లు; 3 సిక్స్)... ఇటు బౌలింగ్ (2/33)లోనూ అద్వితీయంగా రాణించడంతో వెస్టిండీస్ ‘ఎ’ జట్టు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన యువరాజ్ బృందం... మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో మాత్రం అన్ని రంగాల్లో విఫలమైంది. ఫలితంగా 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల అనధికారిక సిరీస్‌లో ఇరు జట్లు  1-1తో నిలిచాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 279 పరుగులు సాధించింది.
 
  కళ్లు చెదిరే షాట్లతో అలరించిన కార్టర్ చక్కటి సెంచరీ చేయగా ఎడ్వర్డ్స్ (58 బంతుల్లో 36; 4 ఫోర్లు; 1 సిక్స్), జాన్సన్ (46 బంతుల్లో 39; 3 ఫోర్లు; 1 సిక్స్) ఓ మాదిరిగా రాణించారు. వినయ్‌కు మూడు, యూసుఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.4 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటయ్యింది. యువరాజ్ (58 బంతుల్లో 40; 3 ఫోర్లు; 1 సిక్స్), ఉన్ముక్త్ (72 బంతుల్లో 38; 3 ఫోర్లు; 1 సిక్స్), కేదార్ జాదవ్ (38 బంతుల్లో 35; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కమిన్స్‌కు నాలుగు, మిల్లర్‌కు రెండు వికెట్లు దక్కాయి.
 
 ఆరంభంలో తడబడినా..
 ఇన్నింగ్స్ ప్రారంభంలో భారత బౌలర్లు విండీస్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. మూడు ఓవర్ల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టారు. అప్పటికి స్కోరు 21 పరుగులే. అయితే వన్‌డౌన్ ఆటగాడు ఎడ్వర్డ్స్, సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన కార్టర్ ఎలాంటి తడబాటు లేకుండా ఆడారు. వినయ్ వేసిన 11వ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన ఎడ్వర్డ్స్ దూకుడుగా ఆడాడు. అయితే యూసుఫ్ వేసిన వైడ్ బంతిని ఆడబోయి స్టంప్ అయ్యాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 79 పరుగులు జత చేరాయి.
 
  వెంటనే బరిలోకి దిగిన రస్సెల్ వరుసగా రెండు సిక్స్‌లు బాది అదే ఓవర్‌లో చిక్కాడు. అనంతరం జాన్సన్‌తో జత కట్టిన కార్టర్ మెరుపులు మెరిపించాడు. 6 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతను 82 బంతుల్లో అర్ధ సెంచరీ చేసినా సెంచరీ అందుకునేందుకు మరో 35 బంతులు మాత్రమే తీసుకున్నాడు. 49వ ఓవర్‌లో ఉనాద్కట్‌కు వికెట్ల ముందు దొరికే దాకా జోరు కొనసాగించాడు.
 
 బ్యాట్స్‌మెన్ విఫలం
 18 పరుగులకే వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ఏ దశలోనూ విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయింది. యువరాజ్, ఉన్ముక్త్ పోరాడిన తీరు ఆశలు రేపినా మిగతా బ్యాట్స్‌మెన్ లక్ష్యంపై దృష్టి పెట్టలేకపోయారు. మరో భారీ స్కోరు వైపు కెప్టెన్ యువీ దూసుకెళుతున్న తరుణంలో మిల్లర్ దెబ్బతీశాడు. 28వ ఓవర్‌లో మిల్లర్ యువరాజ్, యూసుఫ్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపడంతో భారత్ ఆశలు వదులుకుంది.
 
 స్కోరు వివరాలు
 వెస్టిండీస్ ‘ఎ’ ఇన్నింగ్స్: ఫ్లెచర్ (సి) నమన్ (బి) వినయ్ 15; పావెల్ (సి) నమన్ (బి) వినయ్ 4; ఎడ్వర్డ్స్ (స్టంప్డ్) నమన్ (బి) యూసుఫ్ 36; కార్టర్ ఎల్బీడబ్ల్యు (బి) ఉనాద్కట్ 133; రస్సెల్ (సి) నర్వాల్ (బి) యూసుఫ్ 12; జాన్సన్ (సి) చంద్ (బి) వినయ్ 39; థామస్ నాటౌట్ 13; నర్స్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో ఆరు వికెట్లకు) 279
 వికెట్ల పతనం: 1-20; 2-21; 3-100; 4-112; 5-243; 6-620.
 
 బౌలింగ్: ఉనాద్కట్ 10-1-57-1; నర్వాల్  10-2-52-0; వినయ్ 10-1-56-3; నదీమ్ 10-0-38-0; యూసుఫ్ 9-0-61-2; మన్‌దీప్ 1-0-7-0.
 
 భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: ఉతప్ప (బి) కార్టర్ 10; ఉన్ముక్త్ (సి) ఫ్లెచర్ (బి) నర్స్ 38; మన్‌దీప్ సింగ్ (సి) థామస్ (బి) కమిన్స్ 3; యువరాజ్ (సి) పావెల్ (బి) మిల్లర్ 40; జాదవ్ (సి) థామస్ (బి) కమిన్స్ 35; యూసుఫ్ (సి) నర్స్ (బి) మిల్లర్ 0; నమన్ (బి) కమిన్స్ 34; నర్వాల్ (సి) థామస్ (బి) రస్సెల్ 18; వినయ్ (బి) కమిన్స్ 1; నదీమ్ నాటౌట్ 21; ఉనాద్కట్ (సి) పెరుమాల్ (బి) కార్టర్ 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 224
 వికెట్ల పతనం: 1-15; 2-16; 3-82; 4-114; 5- 114; 6-148; 7-177; 8-187; 9-187; 10-224.
 
 బౌలింగ్: కమిన్స్ 10-0-31-4; రస్సెల్ 10-0-56-1; కార్టర్ 6.4-0-33-2; నర్స్ 8-0-32-1; పెరుమాల్ 5-0-25-0; మిల్లర్ 9-1-46-2.
 

మరిన్ని వార్తలు